టైటిల్ రాత మారడం లేదని పేరు మార్చిన ఐపీఎల్ జట్టు

ప్రపంచంలో విధ్వంసక టి20 బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్, డివిలియర్స్. యార్కర్లు, పేస్ తో బ్యాట్స్ మెన్ ను బోల్తాకొట్టించే బౌలర్ మిచెల్ స్టార్క్

Update: 2024-03-14 03:15 GMT

ప్రపంచంలో విధ్వంసక టి20 బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్, డివిలియర్స్. యార్కర్లు, పేస్ తో బ్యాట్స్ మెన్ ను బోల్తాకొట్టించే బౌలర్ మిచెల్ స్టార్క్. ఏ పిచ్ పైనైనా పరుగులు సాధించగల, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ ను గెలిపించిగల సత్తా ఉన్న బ్యాటర్ విరాట్ కోహ్లి. ఇలాంటి వారంతా ఉన్నప్పటికీ ఒక జట్టు ఇంతవరకు టైటిల్ కొట్టలేదు. 16 సీజన్లుగా ఈసాలా కప్ నమదే అంటూ బరిలో దిగడం, ఒట్టి చేతులతో ఇంటికి వెళ్లడం వారికి పరిపాటి. అయితే, కొన్నిసార్లు పరిస్థితుల వల్ల, మరికొన్నిసార్లు ఆటగాళ్ల వైఫల్యంతో వెనుకబడింది. మొత్తమ్మీద మంచి జట్టేనని మాత్రం చెప్పవచ్చు.

ఈసారైనా కప్ కొడుతుందా..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). కోహ్లి, డివిలియర్, గేల్, స్టార్క్, సిరాజ్, చాహల్ వంటివారు ప్రాతినిధ్యం వహించారు. లీగ్‌ దశలో బాగా ఆడి ప్లే ఆఫ్స్ లో చేతులెత్తేస్తందనే అభిప్రాయం ఈ జట్టుపై ఉంది. మూడుసార్లు ఫైనల్‌ కు వెళ్లినా కప్ కొట్టలేకపోయింది. అయితే.. ఐపీఎల్‌-24 సీజన్‌ కు ఆర్సీబీ తన పేరులో చిన్న మార్పు చేసుకునే అవకాశం ఉంది.

బెంగళూర్ కాదు బెంగళూరు

ఆర్సీబీ తన జట్టు పేరును ఇంగ్లిష్ లో (Royal Challengers Bangalore)గా పేర్కొంటోంది. ఇకపై (Royal Challengers Bengaluru)గా మార్చనున్నట్లు తెలుస్తోంది. అంటే బెంగళూర్ అని ఉన్న దానిని బెంగళూరుగా మారుస్తోంది. ఆర్సీబీ సోషల్ మీడియా ఖాతాల్లో ఈ మేరకు పోస్ట్ చేసిన వీడియో ఇందుకు ఊతమిస్తోంది. ఈ వీడియోలో సూపర్ హిట్ సినిమా కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి.. రాయల్‌ (Royal), ఛాలెంజర్స్‌ (Challengers), బెంగళూరు (Bangalore) అని రాసి ఉన్న మూడు దున్నల దగ్గరకు వస్తాడు. అనంతరం బెంగళూరు (Bangalore) అని రాసి ఉన్న దున్నను తీసుకెళ్లమని కాపలాదారుతో చెబుతాడు. ఆర్సీబీ ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ‘‘రిషబ్ శెట్టి ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థమైందా? ఆర్సీబీ అన్‌ బాక్స్‌ ఈవెంట్‌ లో అదేంటో మీకు తెలుస్తుంది. టికెట్లు ఇప్పుడే కొనండి’’ అనే వ్యాఖ్యను జత చేసింది. కన్నడ అభిమానుల కోరిక మేరకు ఆర్సీబీ ఈ మార్పు చేస్తోందట. ఈ నెల 19న చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ అన్‌ బాక్స్‌ ఈవెంట్‌లో పేరు మార్పుపై ప్రకటన రానుంది. 22న సీఎస్కే, ఆర్సీబీ మధ్య చెన్నైలో మ్యాచ్‌ తో ఐపీఎల్‌-2024 సీజన్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News