విరాట్ కోహ్లి భావోద్వేగం... సచిన్ ఆకాంక్ష ఇదే!
భారత్ తరఫున ఆడేందుకు వచ్చే ప్రతీ అవకాశం గొప్పదే అని, తన హీరో రికార్డును సమం చేయడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు.
ప్రపంచ కప్ లో టీం ఇండియా ఉన్న ఫాం గురించి తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతుంది టీం ఇండియా. చిన్న టీం, పెద్ద టీం, ఫాంలో ఉన్న టీం, ఫాం లో లేని టీం... ఇలాంటి తారతమ్యాలేమీ లేవు! ఒకటే ఉతుకుడు, ఒకటే దూకుడు!! ఈ క్రమంలో భారత్ విజయయాత్రల్లో కింగ్ కొహ్లీ పాత్ర కూడా ప్రత్యేకం అనే చెప్పాలి. ఈ క్రమంలో తాజాగా కొహ్లీ మరో ఫీట్ సాధించాడు. 49 సెంచరీలతో సచిన్ సరసన నిలిచాడు. ఈ సందర్భంగా సచిన్ స్పందించాడు.
అవును... సెంచరీల విషయంలో తన రికార్డును సమం చేసిన కొహ్లీకి సచిన్ తన అభినందనలు తెలిపాడు. ఇందులో భాగంగా... "విరాట్ బాగా ఆడావు. నువ్వు 49 నుంచి 50కి చేరుకుని, రాబోయే కొద్ది రోజుల్లో నా రికార్డును బద్దలు కొడతావని ఆశిస్తున్నాను. అభినందనలు!!" అని టెండూల్కర్ ఆన్ లైన్ వేదికగా స్పందించాడు. ఇక నెటిజన్ల రియాక్షన్ అయితే వైరల్ అవుతుంది.
ఇదే సమయంలో సచిన్ రికార్డు సమం చేసిన అనంతరం విరాట్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. భారత్ తరఫున ఆడేందుకు వచ్చే ప్రతీ అవకాశం గొప్పదే అని, తన హీరో రికార్డును సమం చేయడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు. ఇదే సమయంలో తాను సచిన్ అంత గొప్ప ఆటగాడిని కానని కొహ్లీ చెప్పాడు.
ఈ సందర్భంగా సచిన్ అభినందన ఎంతో ప్రత్యేకం అని చెప్పిన కొహ్లీ... తాను సచిన్ ఆటను టీవీలో చూస్తూ పెరిగినట్లు చెప్పాడు. అలాంటిది ఇప్పుడు స్వయంగా ఆయన ప్రశంసలు అందుకోవడం అమూల్యం అని తెలిపాడు. ఈ సందర్భంగా దేవుడికి కృతజ్ఞతలు తెలిపాడు!
కాగా... సచిన్ 452వ ఇన్నింగ్స్ లో 49వ వన్డే సెంచరీ అందుకుంటే.. కోహ్లి 277వ ఇన్నింగ్స్ లోనే ఆ రికార్డు సమం చేయడం గమనార్హం. ఇక సచిన్ సెంచరీలు చేసిన 49 మ్యాచ్ లకు గాను భారత్ 33 గెలవగా... కొహ్లీ సెంచరీలు చేసిన మ్యాచ్ లలో 40 గెలిచింది. ఈ లెక్క సరిపోతుంది... టీం ఇండియా విజయంలో కొహ్లీ పాత్ర ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి.
కాగా... దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అంచనాలను నిలబెట్టుకుంటూ పుట్టిన రోజు నాడు అద్వితీయమైన ఇన్నింగ్స్ తో అద్భుతాన్ని అందుకున్నాడు కొహ్లీ. దీంతో... టీం ఇండియా 5 వికెట్లకు 326 పరుగుల భారీ స్కోరు సాధించింది. కొహ్లీ (101)తోపాటు శ్రేయస్ అయ్యర్ (77) కూడా మెరిశాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సఫారీలను భారత్ బౌలర్లు చుట్టేశారు.
ఇందులో భాగంగా... ఈ సారి స్పిన్నర్ రవీంద్ర జడేజా (5/33) తనదైన స్పిన్ మాయలో సఫారీలను పెవిలియన్ కు పంపించాడు. ఇదే సమయంలో ఫుల్ ఫాం లో ఉన్న షమి (2/18), కుల్ దీప్ (2/7) కూడా రాణించడంతో దక్షిణాఫ్రికా 83 పరుగులకే కుప్పకూలింది. దీంతో 243 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.