రౌండ్ ‘‘రాబిన్ హుడ్’’.. చాంపియన్ జట్లకు సెమీస్ చెడుగుడు
డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా మొన్నటివరకు సెమీస్ చేరతాయనే అంచనాలున్నాయి.
భారత్ ఏకైక వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచ కప్ లో ఓ ప్రత్యేకత ఉంది. అదేమంటే రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిన ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. దీనిప్రకారం మొత్తం పది జట్లు మిగతా తొమ్మిది జట్లతో కనీసం ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. అంటే.. అన్నిమ్యాచ్ లలో గెలిచిన జట్టు 18 పాయింట్లతో టాపర్ గా సెమీస్ కు వెళ్తుంది. 8 మ్యాచ్ లు గెలిస్తే నంబర్ 2, ఏడు గెలిస్తే నంబర్ 3 గా సెమీస్ చేరతాయి. నాలుగో స్థానం ఎవరిదనేది కచ్చితంగా చెప్పలేం. అంతేకాదు.. ఈ నంబర్లు కూడా ఒక అంచనా మాత్రమే. 8 మ్యాచ్ లు మాత్రమే నెగ్గిన జట్టు 16 పాయింట్లు (వర్షం తో రద్దయి ఒక పాయింటే దక్కితే అప్పుడు 17 పాయింట్లు) పొంది టాపర్ గా సెమీస్ వెళ్లొచ్చు. ఇలా అంకెలన్నీ మ్యాచ్ లు జరుగుతున్నా కొద్దీ మారుతుంటాయి.
టాప్ 4కు వెళ్తాయనుకుంటే..
డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా మొన్నటివరకు సెమీస్ చేరతాయనే అంచనాలున్నాయి. వీటితో పాటు భారత్, న్యూజిలాండ్-పాకిస్థాన్-దక్షిణాఫ్రికాల్లో ఒక జట్టు సెమీస్ లో ఆడతాయని భావించారు. కానీ, ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అంతా తలకిందులైంది.
భారత్-దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్
ప్రపంచ కప్ లో ప్రస్తుతం 14 వ మ్యాచ్ నడుస్తోంది. ఇంకా 28 లీగ్ మ్యాచ్ లున్నాయి. ఇప్పుడే ఓ అంచనాకు రావడం పొరపాటే కానీ.. వీరాభిమానులుగా కొంత లెక్కలేసుకోవచ్చు. అదేమంటే.. ప్రస్తుతం ఆడుతున్న తీరును బట్టి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సెమీస్ కు చేరడం కాస్త సంక్లిష్టమే. భారత్ కు మాత్రం ఆ బాధ లేదు. పాకిస్థాన్, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్లను కొట్టేసిన టీమిండియా.. సంచలనాల అఫ్ఘానిస్థాన్ ను చితక్కొట్టింది. మిగిలింది ఏడు మ్యాచ్ లు.. వీటిలో కనీసం ఐదు లేదా ఆరు నెగ్గగలదు. అంటే.. 16 పాయింట్లతో సెమీస్ కు ఢోకా ఉండదు. దక్షిణాఫ్రికా ఆడిన రెండు మ్యాచ్ లలోనూ మంచి టచ్ లో కనిపించింది. ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. న్యూజిలాండ్ కూడా మూడుకు మూడు మ్యాచ్ లలో నెగ్గింది. ఈ రెండూ సెమీస్ రేసులో ముందున్నాయి.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కు కష్టమే
ఇప్పుడు చెప్పలేం కానీ.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లకు సెమీస్ దారిలో ముళ్ల బాటే. ఆ రెండు జట్లలో ఆసీస్ పరిస్థితి మరీ ఘోరం. రెండుకు రెండు మ్యాచ్ లలో ఓడిన ఆ జట్టు మైనస్ 1.846 రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఇంగ్లండ్ మాత్రం మూడు మ్యాచ్ లలో రెండు ఓడిపోయి మైనస్ 0.084 రన్ రేట్ తో ఐదో స్థానంలో ఉంది. శ్రీలంకపై ఆస్ర్టేలియా గనుక ఓడిపోతే ఆ జట్టు సెమీస్ చేరడంపై ఆశలు వదులుకోవాల్సిందే. అఫ్గాన్ చేతిలో ఓడిన ఇంగ్లండ్ సెమీ ఫైనల్ అవకాశాలూ బాగా సంక్లిష్టమైనట్లే. మూడు ఆడితే ఓడింది ఒక్క మ్యాచ్ మాత్రమే కదా..? అనుకోవద్దు. సెమీస్ బెర్తుల కోసం పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో చిన్న జట్టు చేతిలో ఓడిపోయి ముందంజ వేయడం చాలా కష్టం. అందులోనూ రెండు ఓటములూ భారీ తేడాతో ఉన్నాయి. రన్ రేట్ పడిపోయింది. అందుకనే ఇంగ్లండ్ కు ప్రతి మ్యాచ్ చావోరేవోనే. అఫ్ఘాన్ చేతిలో ఓటమి బట్లర్ టీమ్ ఆత్మవిశ్వాసాన్ని బాగా దెబ్బ తీసి ఉంటుంది.
కొసమెరుపు : ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వెనుకబడిన నేపథ్యంలో.. సెమీస్ రేసు రసవత్తరంగా జరుగుతుంది. మ్యాచ్ లు జరుగుతున్న కొద్దీ పాయింట్లలో తేడాలు వస్తాయి. చివరకు వరకు ఎవరు ముందంజ వేస్తారో తేలకపోవచ్చు.