చరిత్రలో సిరాజ్.. ప్రపంచ కప్ ఫైనల్ ఆడనున్న హైదరాబాదీ తొలి క్రికెటర్

టీమిండియాలోకి మూడేళ్ల కిందట అనూహ్యంగా ఎంట్రీ అయిన హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

Update: 2023-11-18 09:55 GMT

టీమిండియాలోకి మూడేళ్ల కిందట అనూహ్యంగా ఎంట్రీ అయిన హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. టెస్టుల, వన్డేలు, టి20లు ఇలా మూడు ఫార్మాట్లలోనూ ఆడుతూ.. ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తూ.. ర్యాంకింగ్స్ లో దూసుకెళ్తూ ఔరా అనిపిస్తున్నాడు. మరోవైపు సిరాజ్.. జట్టులో రెండో ప్రాధాన్య బౌలర్. జస్ప్రీత్ బుమ్రా కొత్త బంతిని వేస్తుండగా.. అతడికి జోడీగా సిరాజ్ వస్తున్నాడు. వాస్తవానికి బుమ్రా జట్టుకు దూరమైన ఏడాది కాలంలో కొత్త బంతిని అందుకున్నది సిరాజే. దీన్నిబట్టే జట్టులో అతడి పాత్ర ఏపాటిదో తెలిసిపోతోంది.

ప్రపంచ కప్ ఆసాంతం

జట్టులో సిరాజ్ పాత్ర గురించి ఇంకా చెప్పాలంటే.. మొహమ్మద్ షమీని కాదని మరీ అతడిని ప్రపంచ కప్ లో తొలి మూడు మ్యాచ్ లు ఆడించారు. అయితే, షమీ తిరిగొచ్చినప్పటికీ సిరాజ్ ను మాత్రం తొలగించకపోవడం గమనార్హం. మొత్తంగా ప్రపంచ కప్ ఆసాంతం ఆడాడు సిరాజ్. ఇప్పుడు కీలకమైన ఫైనల్ ఆడబోతున్నాడు. ఈ రకంగా సిరాజ్ మరెంతో ఘన కీర్తిని మూటగట్టుకోనున్నాడు. ఇప్పటివరకు మరే హైదరాబాద్ క్రికెటరూ ప్రపంచ కప్ ఫైనల్ ఆడలేదు. అందుకే ఇది అరుదైన రికార్డు.

అజహరుద్దీన్ ఉన్నప్పటికీ..

భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేరు మొహమ్మద్ అజహరుద్దీన్. గొప్ప బ్యాట్స్ మన్ గానే కాక, దేశానికి గొప్ప కెప్టెన్ గానూ అజహర్ ది చెరగని ముద్ర. అయితే, 1990ల ప్రారంభం నుంచి 2000 ప్రారంభం వరకు అజ్జూ కెప్టెన్ ఉన్నాడు. కానీ, అతడు ప్రపంచ కప్ లలో ఫైనల్ ఆడలేదు. వాస్తవానికి 1992, 1996, 1999 కప్ లలో అజహర్ కెప్టెన్. ఈ మూడు సార్లూ భారత జట్టు ఫైనల్ చేరలేదు. 1992, 1999లో లీగ్ దశకే పరిమితం అయింది. స్వదేశంలో జరిగిన 1996లో కప్ లో సెమీస్ లో పరాజయం పాలైంది. అయితే, వరుసగా మూడు ప్రపంచ కప్ లలో భారత్ జట్టును నడిపించిన అరుదైన ఘనత మాత్రం అజహర్ ఖాతాలో చేరింది. మరెవరీకి సాధ్యం కాని రికార్డు ఇది.

లక్ష్మణ్, రాయుడుకూ దక్కలేదు

హైదరాబాద్ నుంచి వీవీఎస్ లక్ష్మణ్, వెంకటపతిరాజు, అర్షద్ అయూబ్, అంబటి రాయుడు తదితర క్రికెటర్లు దేశానికి ప్రాతినిధ్యం వహించినా వీరెవరికీ ప్రపంచ కప్ ఫైనల్ ఆడే అవకాశం రాలేదు. వెంకటపతి రాజు ప్రపంచ కప్ ఆడినా ఫైనల్ ఆడలేదు. లక్ష్మణ్ ,రాయుడికి ప్రపంచ కప్ అవకాశమే దక్కలేదు. అయితే, ప్రస్తుతం తరంలో హనుమ విహారి, తిలక్ వర్మ వంటి కుర్రాళ్లు మున్ముందు ప్రపంచ కప్ ఆడే చాన్స్ కొట్టేయొచ్చు. ముఖ్యంగా తిలక్ కు ఎక్కువ అవకాశాలున్నాయి.

సిరాజ్ మాత్రం చాన్స్ కొట్టేశాడు

హైదరాబాదీ పేసర్ సిరాజ్ ఆదివారం అహ్మదాబాద్ లో జరగబోయే వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఆడనున్నాడు. తుది జట్టులో అతడికి చోటు గ్యారెంటీ. దీంతో ప్రపంచ కప్ ఫైనల్స్ ఆడిన తొలి హైదరాబాదీ, అందులోనూ పేసర్ గా రికార్డులకెక్కనున్నాడు. కాగా, సిరాజ్ ఇప్పటివరకు టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ ఆడాడు. ఆ రకంగానూ రికార్డు కొట్టేశాడు. టి20 ప్రపంచ కప్ లోనూ ఆడినా జట్టు ఫైనల్ కు చేరలేదు.

పవర్ ప్లే స్పెషలిస్ట్

సిరాజ్ ఈ ప్రపంచ కప్ లో సాధారణ ప్రదర్శనే చేశాడు. అయితే, అంతకుముందు ఆసియా కప్ ఫైనల్లో మాత్రం చెలరేగి శ్రీలంకపై ఆరు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం మోస్తరుగానే రాణిస్తున్నప్పటికీ.. సిరాజ్ మరీ ముఖ్యంగా పవర్ ప్లే బౌలర్. పవర్ ప్లేలో వికెట్ తీయడంలో సిరాజ్ ది అందెవేసిన చేయి. 2022 నుంచి అతడు 35 పైగా వికెట్లను పవర్ ప్లేలోనే సాధించాడు. ఈ జాబితాలో టాప్ లో ఉన్నాడు. ఆదివారం ఫైనల్లోనూ సిరాజ్ చెలరేగి.. ఆసీస్ టాపార్డర్ ను కుప్పకూలిస్తే టీమిండియాకు జయము జయమే..

Tags:    

Similar News