హైదరాబాద్ వర్సెస్ ముంబై... చరిత్ర సృష్టించనున్న రోహిత్‌ శర్మ!

ఆ మ్యాచ్ లో ఆధ్యంతం సన్ రైజర్స్ ఆకట్టుకున్నప్పటికీ చిన్న చిన్న పొరపాట్లవల్ల విజయం చేజారింది.

Update: 2024-03-27 06:52 GMT

ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ఉప్పల్ లో ఎనిమిదో మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా... 22వ సారి ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఇప్పటికే గుజరాత్ చేతిలో ఓటమిపాలై ముంబై, కేకేఆర్ చేతిలో దెబ్బతిని సన్ రైజర్స్ లు ఈసారి ఎలాగైనా బోణీ కొట్టాలని భావిస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్ మరింత రసవత్తరంగా ఉండబోతోంది!

అవును... ఈ సీజన్‌ లోని తమ తొలి మ్యాచ్‌ లలో ఎదురుదెబ్బలు తగిలించుకున్న ఇద్దరూ తలపడబోతుండటంతో ఈ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా ఉండబోతోంది! పాట్ కమ్మిన్స్ కెప్టెనీసీలో... కోల్ కతాలోని ఈడేన్ గర్దెన్ లో కేకేఆర్ తో జరిగిన ప్రారంభ మ్యాచ్ లో నాలుగు పరుగులతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో ఆధ్యంతం సన్ రైజర్స్ ఆకట్టుకున్నప్పటికీ చిన్న చిన్న పొరపాట్లవల్ల విజయం చేజారింది.

అయితే ఈసారి ఆ మిస్టేక్స్ జరగకుండా జాగ్రత్త పడి, సొంతగడ్డపై ఈ సీజన్ లో ఖాతా తెరవాలని భావిస్తోంది. ఇదే సమయంలో... హార్థిక్ పాండ్యా నాయకత్వంలోని అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆరుపరుగుల తేడాతో స్వల్ప ఓటమితో ముంబై ఇండియన్స్ ఈ సీజన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. చేజింగ్ సమయంలో చివర్లో తడబడటంతో ముంబై పరాజయాన్ని మూటకట్టుకుంది! దీంతో... వారి నెక్స్ట్ మ్యాచ్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది!

ఆ మ్యాచ్ లో బౌలింగ్ విభాగంలో బూమ్రా 4-0-14-3 బెస్ట్ ఫిగర్స్ తో అసాధారణమైన ప్రదర్శన కనబరచగా... 29 బంతుల్లో 43 పరుగులతో మాజీ కెప్టెన్ రోహిత్ రాణించాడు. మరోపక్క హైదరాబాద్ జట్టులో క్లాసిన్ విజృంభణ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. 29 బంతుల్లో 8 సికర్ల సాయంతో అతడు కొట్టిన 63 పరుగులు ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అనే చెప్పాలి! ఇక నటరాజన్, మార్కాండేలు బాల్ తో చేసిన మ్యాజిక్ కూడా హైలెట్ గా నిలిచింది.

ఇలా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్... రెండు విభాగాల్లోనూ ఇప్పటికే బలమైన, ఆసక్తికరమైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ అతి స్వల్ప తేడాతో ఓటమి చెందిన ఈ ఇరుజట్లూ తలపడనున్న ఈ మ్యాచ్ పై ఇరు జట్ల అభిమానుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి.

హెడ్ టు హెడ్:

ఇక ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు ఇప్పటివరకూ 21 మ్యాచ్ లలో తలపడ్డాయి. ఈ 21 మ్యాచ్‌ లలోనూ సన్‌ రైజర్స్ 9 విజయాలు సాధించగా, ముంబై 12 సందర్భాల్లో విజయం సాధించింది.

రోహిత్ కు చాలా ప్రత్యేకం:

ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా హైదరబాద్ తో జరిగే మ్యాచ్ ముంబై స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా ప్రత్యేకం. ఈ మ్యాచ్ తో రోహిత్.. ముంబై తరుపున 200 మ్యాచ్ లు పూర్తిచేసుకోబోతున్నాడు. దీంతో... ఒక ఫ్రాంచైజీ తరుపున 200 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడిన మూడో క్రికెటర్ గా రోహిత్ నిలవనున్నాడు. ఈ జాబితాలో విరాట్ కొహ్లీ (239 మ్యాచ్ లు - బెంగళూరు).. ఎంఎస్ ధోనీ (221 మ్యాచ్ లు - చెన్నై) మొదటి రెండు స్థానాల్లోనూ ఉన్నారు!

Tags:    

Similar News