టీమిండియా హెడ్ కోచ్ గా బీసీసీఐ చూపు హైదరాబాదీ పైనే..
ఏడాదికి పది కోట్లు ఇచ్చినా చాలామంది దిగ్గజ ఆటగాళ్లు టీమిండియా కోచ్ గా వచ్చేందుకు భయపడతారు. ఇప్పుడు భారత జట్టు కోచ్ పదవి ఖాళీ అవుతోంది
వందకోట్ల మంది అభిమానులు.. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు.. లక్ష కోట్ల విలువైన లీగ్.. ఒకేసారి రెండు, మూడు అంతర్జాతీయ జట్లను తయారుచేయగల స్థాయిలో ప్రతిభ.. ఇదీ భారత క్రికెట్ ప్రస్తుత సత్తా. ఇలాంటి దేశానికి చెందిన జాతీయ జట్టుకు కోచ్ అంటే మామూలు మాటలు కాదు. ఏడాదికి పది కోట్లు ఇచ్చినా చాలామంది దిగ్గజ ఆటగాళ్లు టీమిండియా కోచ్ గా వచ్చేందుకు భయపడతారు. ఇప్పుడు భారత జట్టు కోచ్ పదవి ఖాళీ అవుతోంది. మరి అందులోకి వచ్చేదెవరు?
గంభీర్ కు చాన్సుందా?
టీమిండియా హెడ్ కోచ్ గా దిగ్గజ బ్యాట్స్ మన్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం వన్డే ప్రపంచ కప్ తోనే ముగిసింది. కానీ, అతడిని టి20 ప్రపంచ కప్ వరకు కొనసాగించారు. వచ్చే జూన్ 1 నుంచి మొదలయ్యే టి20 కప్ అనంతరం ద్రవిడ్ దిగిపోతాడు. ఈ లోగా కొత్త కోచ్ ను వెదికే పనిలో పడింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). దీనికోసం దరఖాస్తులు ఆహ్వానించగా సోమవారం అందుకు గడువు తీరింది. కాగా, ఈ పదవికి.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్ కతా నైట్ రైడర్స్ ను మూడోసారి చాంపియన్ గా నిలిపిన మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ.. అతడు దరఖాస్తు చేసుకున్నదీ లేనిది తెలియదు. మరోవైపు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు స్టీఫెన్ ఫ్లెమింగ్, రికీ పాంటింగ్ తదితరుల పేర్లూ వినిపించినా.. వారెవరూ తాము రేసులో ఉన్నట్లు చెప్పలేదు. పాంటింగ్ అయితే విముఖత చూపినట్లు సమాచారం.
మన హైదరాబాదీ కోసమే..
గంభీర్ ది చాలా ముక్కుసూటి వ్యవహారం. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో ఇబ్బంది లేకున్నా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో మాత్రం గంభీర్ కు సరిపడదనే చెప్పాలి. గతంలో మైదానంలోనే వీరిద్దరూ ఢీ అంటే ఢీ అనేలా కనిపించారు. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గా హైదరాబాదీ దిగ్గజం, స్టైలిష్ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేరు బాగా వినిపిస్తోంది. బీసీసీఐ కూడా లక్ష్మణ్ వైపే చూస్తోందని సమాచారం. అతడు ఇప్పటికే జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చైర్మన్ గా ఉన్నాడు. అండర్-19 జట్టుకు కోచింగ్ చేపట్టాడు. ద్రవిడ్ లేని సమయంలో టీమిండియా కోచ్ గా వ్యవహరించాడు. అన్నిటికి మించి లక్ష్మణ్ సౌమ్యుడు. ఆటపరంగా గంభీర్ కంటే కాస్త ప్రతిభ ఉన్నవాడు. ప్రస్తుత జట్టులోని కోహ్లి, రోహిత్ శర్మ తప్ప అందరూ అతడికి జూనియర్లే. దీంతోనే లక్ష్మణ్ అయితే టీమిండియా హెడ్ కోచ్ గా సరైనవాడని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.