పార్ట్ టైమ్ బౌలర్ లేని టీమిండియా.. ఇదే తొలిసారి
సరిగ్గా పదంటే పదే రోజుల్లో వన్డే ప్రపంచ కప్ భారత్ వేదికగా మొదలుకానుంది. అన్ని జట్లూ బలాబలాలను బేరిజు వేసుకుని బరిలో దిగుతున్నాయి.
సరిగ్గా పదంటే పదే రోజుల్లో వన్డే ప్రపంచ కప్ భారత్ వేదికగా మొదలుకానుంది. అన్ని జట్లూ బలాబలాలను బేరిజు వేసుకుని బరిలో దిగుతున్నాయి. గాయాలు వెంటాడుతున్నా.. ఫిట్ నెస్ సమస్యలున్నా.. ఆల్ రౌండర్లను వెనకేసుకొస్తున్నాయి. ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా చూసుకుంటున్నారు.
6 లేదా 7 బౌలింగ్ ఆప్షన్లు
ఇప్పుడంతా టి20 తరహా క్రికెట్. అంటే.. ఫాస్ట్ ఫాస్ట్.. ఇలాంటి సమయంలో 50 ఓవర్ల మ్యాచ్ అయినా ధనాధన్ ఇన్నింగ్స్ చూస్తున్నాం. బ్యాట్స్ మెన్ విరుచుకుపడే ఇలాంటి సమయంలో ఎన్ని బౌలింగ్ ప్రత్యామ్నాయాలు ఉంటే అంత మేలు. లేదు.. కేవలం ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతోనే దిగుతామంటే కుదురదు. ఆరో బౌలర్ ఉన్నప్పటికీ సరిపోని పరిస్థితుల్లో పార్ట్ టైమ్ బౌలర్లను రంగంలోకి దింపాల్సి ఉంటుంది.
అప్పట్లో అలా..
టీమిండియాకు ఒకప్పుడు లెక్కకు మిక్కిలి పార్ట్ టైమ్ బౌలర్లు ఉండేవారు. పది పదిహేనేళ్ల కిందటి సంగతే చూస్తే.. సచిన్, సెహ్వాగ్, రైనా, యువరాజ్ ఇలా అనేక ప్రత్యామ్నాయాలు ఉండేవి. ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ చెలరేగిపోతున్న సమయంలో వీరిని దింపి అడ్డుకట్ట వేసిన సందర్భాలు అనేకం. అంతెందుకు..? భారత్ చివరిసారి ప్రపంచకప్ గెలిచిన 2011లో యువరాజ్ బౌలర్ గా ఎంతటి కీలక పాత్ర పోషించాడో అందరికీ తెలిసిందే.
మరిప్పుడు ఏరి..?
ఈసారి భారత ప్రపంచ కప్ జట్టును చూస్తే, బ్యాట్స్ మెన్ లో కనీసం ఒక్కరు కూడా స్పెషలిస్ట్ స్పిన్నర్ పాత్ర పోషించేవారు కనిపించడం లేదు. ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి, తర్వాత వచ్చే కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ వీరెవరూ బంతి పట్టి నాలుగు ఓవర్లు వేసే పరిస్థితి లేదు. ఆరో స్థానంలో వచ్చే ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తప్ప టాప్-5 బ్యాటర్లు బ్యాటింగ్ కే పరిమితం అన్నమాట.
బౌలింగ్ వనరుల పరంగా చూస్తే.. బుమ్రా, షమీ/సిరాజ్, శార్దూల్, జడేజా, అశ్విన్-అక్షర్ పటేల్ ఉన్నారు. ఈ ఐదుగురూ స్పెషలిస్ట్ బౌలర్లు. హార్దిక్ ఆరో బౌలర్. బ్యాటింగ్ పిచ్ లు ఉండే భారత్ లో.. ఇంగ్లండ్ వంటి హార్డ్ హిట్టింగ్ ప్రత్యర్థి ఎదురైన సందర్భంలో స్పెషలిస్ట్ బౌలర్లు తేలిపోతే పార్ట్ టైమ్ స్పిన్నర్ అవసరం పడుతుంది. వాస్తవానికి రోహిత్, కోహ్లి గతంలో బౌలింగ్ వేసిన వారే. రోహిత్ అయితే ఐపీఎల్ లో హ్యాట్రిక్ కూడా తీశాడు. కోహ్లి కెరీర్ తొలినాళ్లలో మీడియం పేస్ వేశాడు. కానీ, ఇప్పుడు మాత్రం ఇద్దరూ బంతి పట్టుకోవడం లేదు. సూర్యకుమార్ (ఒకవేళ జట్టులో ఉంటే) కూడా మీడియం పేస్ వేసినవాడే. అతడూ ఇప్పుడు బౌలింగ్ చేయడం లేదు. రాహుల్, కిషన్ ఎలాగూ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్. అంటే టీమిండియా బ్యాటర్లలో ఎవరూ పార్ట్ టైమ్ బౌలింగ్ చేయడం లేదు.
అవసరమా? అంటే అవసరమే
ఆరుగురు బౌలింగ్ చేస్తుండగా.. మరొక ప్రత్యామ్నాయం అవసరమా అంటే అవసరమే. ప్రపంచ కప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నోలో ఎంత పటిష్ఠంగా ఉంటే అంత మేలు. అందులోనూ 15 మంది సభ్యుల భారత జట్టులో బౌలింగ్ వనరులు పెద్దగా లేవు. కాబట్టి పార్ట్ టైమ్ బౌలింగ్ ప్రత్యామ్నాయం అవసరమే.