ఐపీఎల్ లోనూ టీమిండియా దిగ్గజాల ఢీ.. సమరం తప్పేలా లేదు
ఐదేళ్లుగా టీమిండియా దిగ్గజాల మధ్య విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలు వస్తున్నాయి. జట్టు వీరిమధ్య రెండుగా చీలిపోయిందనే కథనాలు వ్యాపించాయి
ఐదేళ్లుగా టీమిండియా దిగ్గజాల మధ్య విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలు వస్తున్నాయి. జట్టు వీరిమధ్య రెండుగా చీలిపోయిందనే కథనాలు వ్యాపించాయి. ఒకరు వదులుకున్న కెప్టెన్సీ మరొకరికి దక్కడం.. ఆ తర్వాత సిరీస్ లకు దూరంగా ఉండడం.. వదంతులకు ఊతమిచ్చాయి. అయితే, వారిద్దరూ అత్యంత ప్రొఫెషనల్ క్రీడాకారులు. అలాంటివారి మధ్య విభేదాలు అంటే కాస్త ఆలోచించాల్సిందే. అంతా సర్దుకుందని భావిస్తున్న సమయంలో ఇటీవల మరోసారి వివాదాలు చర్చకు వచ్చాయి. ఇప్పుడు ప్రతిష్ఠాత్మక లీగ్ ముంగిట మరో ఆసక్తికర పరిణామం జరగనుంది.
5 కప్ లు.. 0 కప్ లు..
టీమిండియా బ్యాటింగ్ సూపర్ స్టార్లు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియన్ మధ్య వచ్చే ఐపీఎల్ సీజన్ లో పోటీ జరగనుంది. ముంబై ఇండియన్స్ కు ఐదు టైటిళ్లు సాధించిపెట్టిన రోహిత్.. ఈసారి కేవలం ఆటగాడిగా బరిలో దిగనున్నాడు. 16 సీజన్లుగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకే ఆడుతున్న కోహ్లి కెప్టెన్ గానూ వ్యవహరించిన కోహ్లి.. ఒక్కసారి కూడా టైటిల్ అందుకోలేకపోయాడు. అయితే, దీనికిభిన్నంగా బ్యాటింగ్ లో రాణించారు. ఐపీఎల్ లో ఓవరాల్ స్కోర్ లో రోహిత్ కంటే కోహ్లి చాలా ముందున్నాడు. వీరి మధ్య 1000 పరుగుల గ్యాప్ ఉంది.
రోహిత్ vs కోహ్లి
లీగ్ ఓవరాల్ స్కోర్ లో ఓపెనర్ గా సాధించిన పరుగుల్లో రోహిత్ కంటే కోహ్లి 1000 పరుగులు ముందున్నాడు. 2018కు ముందు రోహిత్ మాత్రమే ఓపెనర్ గా ఉన్నాడు. కోహ్లి ఆ సీజన్ నుంచే ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నాడు. రోహిత్ ముంబై తరఫున ఓపెనింగ్ 71 ఇన్నింగ్స్‌లో 1,744 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 127.1 కాగా, సగటు 24.91. మొత్తం 75 సిక్సర్లు కొట్టి 8 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు. ఇక కోహ్లి బెంగళూరుకు 55 ఇన్నింగ్స్ లో 1,861 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 131.9 కాగా, సగటు 37.22 మాత్రమే. 50 సిక్సర్లు కొట్టాడు. 14 అర్ధ సెంచరీలు, 3 సెంచరీలు వచ్చాయి.
అన్నింట్లోనూ కోహ్లినే..
కోహ్లి ఐపీఎల్ లో తప్ప మరెక్కడా ఓపెనింగ్ చేయడు. రోహిత్ మాత్రం ఐపీఎల్ సహా మూడు ఫార్మాట్లలోనూ భారత్ కు రెగ్యులర్ ఓపెనర్. కాగా, పరుగులు, భారీ స్కోర్లు, స్ట్రైక్ రేట్, సగటులోనూ లీగ్ లో కోహ్లి కాస్త ముందున్నాడు. మరోవైపు ఈ సీజన్ లో రోహిత్ కెప్టెన్ కాదు. ఒత్తిడి లేకుండా చెలరేగి.. పరుగుల వరద పారిస్తాడేమో చూడాలి. ప్రాక్టీస్ లో దుమ్మురేపుతున్నాడు. కాగా, కోహ్లి ఇటీవల ఇంగ్లండ్ సిరీస్ కు దూరంగా ఉన్నాడు. తాజాగా బెంగళూరు జట్టుతో కలిశాడు. ఇలా విరామం నుంచి తిరిగి వచ్చినప్పుడల్లా భారీ స్కోర్లు నమోదు చేస్తుంటాడు. చూద్దాం. .ఈసారి ఇద్దరి మధ్య సమరం ఎలా ఉంటుందో?