అసలైన ప్రపంచ కప్ మ్యాచ్ రేపే.. ఎందుకు చూడాలంటే..

కానీ, మన జట్టు ఒక్కదాంట్లోనూ ఓడిపోకుండా వస్తుండగా, దక్షిణాఫ్రికా మాత్రం నెదర్లాండ్స్ వంటి చిన్న జట్టు చేతిలో పరాజయం పాలైంది.

Update: 2023-11-04 17:30 GMT

భారత్ ఏకైక వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ లీగ్ దశ 80 శాతంపైగానే పూర్తయింది. సెమీఫైనల్స్ కు చేరే జట్లలో మూడు జట్లు ఏవో దాదాపు తెలిసిపోయింది. ఇక నాలుగో జట్టు ఏదో తేలాల్సి ఉంది. ఆ బెర్తు కోసం పోరు హోరాహోరీగానే ఉంది. దీనిని కైవసం చేసుకునేందుకు ఏ జట్టుకా జట్టు ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ప్రపంచ కప్ లో హైలైట్ అనదగ్గ మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా-పాకిస్థాన్, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ లు చూసి ఉండొచ్చు. కానీ, వాటిని మించిన అసలు మ్యాచ్ రేపు జరగనుంది.

భారత్ –దక్షిణాఫ్రికా ఎవరిది పైచేయి?

ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం టీమిండియా దక్షిణాఫ్రికాను ఎదుర్కొననుంది. లీగ్ దశలో మొత్తం 9 మ్యాచ్ లకు గాను మన జట్టుకు ఇది 8వది. అటు దక్షిణాఫ్రికాకూ 8వ మ్యాచే. కానీ, మన జట్టు ఒక్కదాంట్లోనూ ఓడిపోకుండా వస్తుండగా, దక్షిణాఫ్రికా మాత్రం నెదర్లాండ్స్ వంటి చిన్న జట్టు చేతిలో పరాజయం పాలైంది. పాకిస్థాన్ చేతిలో చావు తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా గెలిచింది. ఇక.. ఆ జట్టు స్పిన్ కు పెట్టింది పేరైన అఫ్గానిస్థాన్ తో ఆడాల్సి ఉంది. టీమిండియా మాత్రం నెదర్లాండ్స్ తో తలపడాల్సి ఉంది. బలాబలాల రీత్యా చూస్తే ఆదివారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో రోహిత్ శర్మ సేనదే పైచేయి. కానీ, ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా మాంచి దూకుడు మీదుంది. కాబట్టి హోరాహోరీ పోరు తథ్యం.

టాస్ గెలిస్తే బ్యాటింగ్

ప్రస్తుత ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసిన ప్రతిసారీ భారీ స్కోర్లు కొడుతోంది. ఓపెనర్ డికాక్, డసెన్, మార్క్ రమ్, క్లాసెన్, మిల్లర్.. ఇలాంటి భీకర బ్యాట్స్ మెన్ తో 350 పరుగులను అవలీలగా చేస్తోంది. అయితే, ఛేజింగ్ కు వచ్చేసరికి మాత్రం తేలిపోతోంది. నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో 245 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. పాకిస్థాన్ మీద 270 పరుగుల లక్ష్యం ఎదురైనప్పుడూ ఇంతే ఒత్తిడికి లోనైంది. అంటే.. దీన్నిబట్టి దక్షిణాఫ్రికా మీద టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ ఎంచుకోవాలి. కనీసం 300 పరుగులు చేసినా చాలు.. ఆ జట్టును ఒత్తిడికి గురిచేయొచ్చు.

టాస్ ఓడితే..

దక్షిణాఫ్రికాపై టీమిండియా టాస్ ఓడితే.. దక్షిణాఫ్రికానే బ్యాటింగ్ ఎంచుకుంటే చేసేదేముంది? ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు కట్టడి చేయడమే. అందులోనూ డికాక్, డసెన్ లను ముందుగా ఔట్ చేయాలి. మార్క్ రమ్, క్లాసెన్ కట్టిపడేయాలి. ఎలాగూ భారత పేస్ బౌలింగ్ త్రయం బుమ్రా, షమి, సిరాజ్ అత్యంత దూకుడు మీద ఉన్నారు కాబట్టి.. సఫారీలకు కళ్లెం వేసేయాలి. ఆపై స్పిన్నర్ కుల్దీప్ తన మాయాజాలం చాటాలి. జడేజా స్పిన్ తో చిక్కులు కలిగించాలి. అనంతరం ఛేజింగ్ లో మాత్రం భారత కెప్టెన్ రోహిత్ శర్మదే మొదటి భారం. అతడు సహజ శైలిలో దూకుడుగా ఆడి దక్షిణాఫ్రికా పేస్ ను తుత్తునియలు చేస్తే ఆపై కోహ్లి, అయ్యర్, రాహుల్ మిగతా పనిని పూర్తిచేస్తారు.

అతడితో ప్రమాదమే సుమీ?

దక్షిణాఫ్రికాకు ప్రధాన బలహీనత ఆ జట్టు కెప్టెన్ బవుమా. కేవలం కెప్టెన్ అయినందుకు మాత్రమే అతడు జట్టులో కొనసాగుతున్నాడంటే ఆశ్చర్యం లేదు. ఇక సఫారీల స్పిన్ కూడా బలహీనమే. కేశవ్ మహరాజ్ వంటివారున్నా భారత బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టేంత స్థాయి వారికిలేదు. మరోవైపు షంషీని తుది జట్టులోకి తీసుకుంటారో లేదో తెలియదు. కాగా, భారత్ కు మరో ముప్పు ఎవరంటే.. దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ మార్కో జాన్సన్. ఆరు అడుగుల 7 అంగుళాల పొడగరి అయిన జాన్సన్ ను దక్షిణాఫ్రికా వ్యూహాత్మకంగా ప్రయోగిస్తోంది. అతడితో తొలి ఓవర్లను వేయిస్తూ ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతోంది. జాన్సన్ తన ఎత్తును సద్వినియోగం చేసుకుంటూ బ్యాట్స్ మెన్ ను కట్టిపడేస్తున్నాడు. బ్యాటింగ్ లో 7వ స్థానంలో దిగుతూ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. జాన్సన్ ను గనుక కట్టడి చేస్తే టీమిండియాకు పెద్ద ప్రమాదం తప్పినట్లే. ఈ లెక్కలన్నీ ఉన్నందునే ఆదివారం నాటి టీమిండియా-దక్షిణాఫ్రికా మ్యాచ్ ను తప్పక చూడాలని చెబుతున్నారు.

Tags:    

Similar News