చెన్నై వర్సెస్ గుజరాత్... చిదంబరం స్టేడియంలో గణాంకాలు, రికార్డులివే!
ఇదే సమయంలో దీపక్ చాహర్ ప్రమాదకరమైన మాక్స్ వెల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ లో మొదటి రెండు స్థానాల్లోనూ నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఈరోజు ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా 7వ మ్యాచ్ జరగనుంది. ఈ రసవత్తర పోరాటానికి చిదంబరం స్టేడియం సిద్ధమైంది. ఈ తాజా సీజన్ లో ఇప్పటికే ఈ రెండు జట్లూ తమ తమ ఓపెనింగ్ మ్యాచ్ లను గెలుచుకున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ని ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ లోనే ఓడించగా... ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబైని గుజరాత్ మట్టికరిపించింది! ఇందులో ప్రధానంగా... చెన్నై సూపర్ కింగ్స్ కోసం ముస్తాఫీజర్ రెహ్మాన్ అద్భుతమైన స్పెల్ ను అందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... కోహ్లీ, డూప్లెస్సిస్, పాటిదార్, గ్రీ వంటి కీలక వికెట్లు తీసుకున్నాడు.
ఇదే సమయంలో దీపక్ చాహర్ ప్రమాదకరమైన మాక్స్ వెల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోపక్క ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడుతున్న రచిన్ రవీంద్ర 15 బంతుల్లో 37 పరుగులతో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. ఇదే సమయంలో శివమ్ దూబే - రవీంద్ర జడేజా ద్వయం పటిష్టమైన హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో గేమ్ కు సరైన ముగింపు అందించింది. ఇలా ఫస్ట్ విక్టరీలో చెన్నై నుంచి సూపర్ స్టార్లు తెరపైకి వచ్చారు!
ఇక గుజరాత్ విషయానికొస్తే... సాయి సుదర్శన్ (45), శుభ్ మాన్ గిల్ (31) బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మరోపక్క పేస్ డిపార్ట్‌మెంట్ సమిష్టిగా 8 వికెట్లు సాధించింది. ఇందులో భాగంగా... అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్ చెరో రెండు వికెట్లు తీశారు. స్పిన్ ద్వయం సాయి కిషోర్ - రషీద్ ఖాన్ మిడిల్ ఓవర్లలో వికెట్లు పెద్దగా తీయకపోయినా పొదుపుగానే బౌలింగ్ చేశారు.
ఇక ఐపీఎల్ లో ఇప్పటివరకూ చెన్నై, గుజరాత్ జట్లు ఐదు సార్లు తలపడగా... గుజరాత్ మూడు సార్లు, చెన్నై రెండు సార్లు విక్టరీ సాధించాయి.
ఇక చిదంబరం స్టేడియంలో గణాంకాలు, రికార్డులు విషయనికొస్తే... ఈ వేదికపై పేసర్లు కీలక భూమిక పోషించారు. ఇందులో భాగంగా ఆడిన 77 మ్యాచ్ లలోనూ పేసర్లు 506 వికెట్లు తీయగా.. స్పిన్నర్లు 331 వికెట్లు తీసుకున్నారు. ఇదే సమయంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలు 46 సార్లు గెలవగా.. ఛేజింగ్ జట్లు 31సార్లు గెలిచాయి.