ప్రపంచ కప్ లో టాప్-10 స్కోరర్లు వీరే.. మనోళ్లు ముగ్గురు
లీగ్ దశ పూర్తయింది కాబట్టి ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్ ఎవరా అని చూస్తే.. టీమిండియా స్టార్ పేరు కనిపిస్తోంది.
వన్డే ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్ దశకు వచ్చేసింది. ఎన్ని జట్లు పాల్గొన్నా.. సెమీ ఫైనల్స్ కు చేరేది నాలుగు జట్లే. అందులోనూ ఈసారి సెమీస్ కు ఊహించని విధంగా దక్షిణాఫ్రికా రావడంతో కాస్త ఆసక్తి పెరిగింది. ఇంగ్లండ్ ఇంటి దారి పట్టడం సంచలనంగా మారింది. పాకిస్థాన్ ఫెయిల్యూర్ చర్చనీయాంశమైంది. అఫ్ఘానిస్థాన్ ప్రదర్శన అదరహో అనిపించింది. కాగా, భారత్ అంటేనే బ్యాట్స్ మెన్ ఫ్రెండ్లీ పిచ్ లు. అందుకే మన దేశంలో ప్రపంచ కప్ అంటే పరుగుల వరద పారుతుందని భావించారు. కొన్ని మైదానాలు మినహా మిగతాచోట్ల ఇది నిరూపితమైంది. ఇక బ్యాట్స్ మెన్ సైతం చెలరేగిపోయారు.
టాపర్ అతడే..
పది జట్లు పాల్గొంటున్న ప్రస్తుత ప్రపంచ కప్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్నది. అంటే లీగ్ దశలో ప్రతి జట్టూ మిగతా 9 జట్లతో మ్యాచ్ లు ఆడతాయి. మరోవైపు టీమిండియా 9కి 9 మ్యాచ్ లలోనూ గెలిచి అజేయంగా నిలిచి రికార్డు నెలకొల్పింది. లీగ్ దశ పూర్తయింది కాబట్టి ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్ ఎవరా అని చూస్తే.. టీమిండియా స్టార్ పేరు కనిపిస్తోంది. తొలి మ్యాచ్ నుంచే చెలరేగుతూ వస్తున్న కింగ్ విరాట్ కోహ్లి 9 మ్యాచ్ లలో 594 పరుగులు చేశాడు. ఇక దక్షిణాఫ్రికా డాషింగ్ ఓపెనర్ క్వింటన్ డికాక్ 591 పరుగులతో అతడి వెంటనే ఉన్నాడు. అనూహ్యంగా న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ను ఓపెన్ చేస్తూ భారీగా పరుగులు చేస్తున్న రచిన్ రవీంద్ర 565, టీమిండియా కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 503 పరుగులు కొట్టారు. ఆస్ట్రేలియా ఓపెనర్ వార్నర్ 499, దక్షిణాఫ్రికా వన్ డౌన్ బ్యాట్స్ మన్ డసెన్ 442 పరుగులు సాధించారు. ఆసీస్ కు కొన్ని మ్యాచ్ లలో ఓపెనింగ్ చేసి ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ మారిన మిచెల్ మార్ష్ 426 పరుగులు, టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్ మన్ శ్రేయస్ అయ్యర్ 421 పరుగులు చేశారు. న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్ డారెల్ మిచెల్ 418 పరుగులు, ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ 404 రన్స్ కొట్టారు.
9 మంది సెమీస్ ఆడనున్నారు
ఈ 10 మందిలో 9 మంది సెమీఫైనల్స్ ఆడనుండడం విశేషం. ఇంగ్లండ్ ఓపెనర్ మలన్ మాత్రమే మిస్ అయ్యాడు. ఇక కోహ్లి, డికాక్ లలో టాపర్ అయ్యేది ఎవరో చూడాలి. వీరిద్దరినీ అధిగమించే అవకాశం రచిన్ కు ఎక్కువగా ఉంది. రోహిత్ కూ చాన్సునా.. కోహ్లి, డికాక్ పూర్తిగా విఫలమవ్వాలి. వార్నర్ కూ ఇంతే. డసెన్, మార్ష్, అయ్యర్ టాప్ -5లో నిలిచే వీలుంది. మొత్తమ్మీద కోహ్లి, రోహిత్, అయ్యర్..ఈ టీమిండియా బ్యాటర్లు ముగ్గురు టాప్10లో ఉండడం గమనార్హం. దక్షిణాఫ్రికాకు చెందిన ఇద్దరు (డికాక్, డసెన్), ఆసీస్ బ్యాటర్లు ఇద్దరు (వార్నర్, మార్ష్), న్యూజిలాండ్ బ్యాటర్లు ఇద్దరు (రచిన్, మిచెల్) టాప్10లో నిలవడం విశేషం.
చివరకు నంబర్ 1 ఎవరో?
టాప్ 10లోని 9 మంది సెమీఫైనల్స్ ఆడనున్నారు. భారత్ గనుక ఫైనల్స్ చేరితే కోహ్లి, రోహిత్, అయ్యర్ కు మరో మ్యాచ్ ఆడే అవకాశం దక్కుతుంది. న్యూజిలాండ్ గెలిస్తే రచిన్, డారెల్ మిచెల్ ఇంకో మ్యాచ్ అదనంగా ఆడతారు. ఇక రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఇందులో ఆసీస్ గెలిస్తే వార్నర్, మిషెల్ మార్ష్ కు, దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే డికాక్, డసెన్ కు తమ స్కోర్లను పెంచుకునే మార్గం దొరుకుతుంది. వీరందరిలో ఎవరు నంబర్ 1 అవుతారో తేలాలంటే.. వచ్చే ఆదివారం వరకు ఆగాలి.