కెమెరా ముందు నుంచి.. మళ్లీ బాక్సింగ్ రింగ్ లోకి మహా బలుడు

పైన చెప్పుకొన్నదంతా బాక్సింగ్ మహా బలుడుగా పేరుగాంచిన మైక్ టైసన్ గురించి.

Update: 2024-03-08 14:30 GMT

పురుషుల్లో కానీ.. మహిళల్లో కానీ.. అప్పటి మొహమ్మద్ అలీ నుంచి మొన్నటి నిఖత్ జరీన్ వరకు.. బాక్సింగ్ చరిత్రలో ఎందరో స్టార్లు పుట్టి ఉండొచ్చు..కానీ అతడు మాత్రం చాలా ప్రత్యేకం. ఎంతో పేరు ప్రఖ్యాతులు.. అంతకుమించి వివాదాలు.. లైంగిక ఆరోపణలు.. మత మార్పిడి.. ప్రత్యర్థి చెవి కొరకడం.. వ్యక్తిగత జీవితంలోనూ దుందుడుకు నిర్ణయాలు.. చివరకు సినిమాల్లో నటన.. ఇవన్నీ ఒకే ఒక్క అథ్లెట్ విషయంలో జరిగాయి.

అతడు లైగర్..

పైన చెప్పుకొన్నదంతా బాక్సింగ్ మహా బలుడుగా పేరుగాంచిన మైక్ టైసన్ గురించి. అతడికి ఇప్పుడు 57 ఏళ్లు మాత్రమే. కానీ, జీవితంలోనే అనేక కోణాలు. తెలుగువారికి దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమా ‘లైగర్’ ద్వారా కూడా పరిచయం అయిన టైసన్.. హెవీ వెయిట్ బాక్సింగ్ మాజీ చాంపియన్. మొహమ్మద్ అలీ స్థాయి బాక్సర్ గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాల్సిన వాడు వివాదాలతో పతనమయ్యాడు. ఇవాండర్ హోలీఫీల్డ్ చెవి కొరికి బాక్సింగ్ చరిత్రలో మాయని మచ్చను తనపై వేసుకున్నాడు. అయితే కెరీర్ ఆసాంతం ఎంద‌రో బాక్స‌ర్ల‌ను మ‌ట్టికరిపించిన చరిత్ర కూడా టైస‌న్‌ కు ఉంది. అతడు ప్రొఫెషనల్ బాక్సింగ్ కు దూరమై 20 ఏళ్లకు పైగానే అవుతోంది. అలాంటివాడు మళ్లీ ఇప్పుడు రింగ్ లోకి దిగనున్నాడు.

30 ఏళ్లు చిన్నవాడైన యూట్యూబర్ తో

మైక్ టైసన్ అంటే మహా పిడిగుద్దులు. అతడు మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ప్రత్యర్థులు బరిలో దిగేందుకే వణికిపోయేవారు. అలాంటి టైసన్ ఇప్పుడు.. త‌న కంటే 30 ఏళ్లు చిన్న‌వాడైన, యూట్యూబ‌ర్‌ గా పాపుల‌ర్ అయి బాక్స‌ర్‌ అవ‌తార‌మెత్తిన జేక్ పాల్‌ తో తలపడనున్నాడు. పాల్‌ కు పంచ్ ప‌వ‌ర్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. కొన్నేళ్ల నుంచి పాల్ బాక్స‌ర్‌ గా ఎదిగిన తీరు అద్భుతమని కొనియాడుతూనే.. ప‌సిపిల్లాడైన అత‌డు అనుభ‌జ్ఞుడినైన, ఆల్‌ టైమ్ గ్రేటెస్ట్ బాక్స‌ర్ అయిన తనకు ఏమాత్రం పోటీ ఇస్తాడో చూడాలి.. అని టైసన్ కవ్వించే వ్యాఖ్యలు చేశాడు.

ఎగ్జిబిషన్ మ్యాచ్ లో..

టైసన్, జేక్ పాల్ ఎగ్జిబిష‌న్ మ్యాచ్‌ లో తలపడనున్నారు. వీరి బౌట్ జూలై 20న జ‌రుగుతుంది. టెక్సాస్‌ లోని స్టేడియం దీనికి వేదిక. ఈ పోరాటాన్ని ప్ర‌ముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్ ప్రసారం చేయ‌నుంది. కాగా, దిగ్గ‌జ బాక్స‌ర్ అయిన టైస‌న్ తెలుగువారికి సుపరిచితుడే. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ‘లైగ‌ర్' సినిమాలో ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ, అనన్య పాండే న‌టించిన ఈ సినిమా పరాజయం పాలైంది. కాగా, టైసన్ కొన్ని హాలీవుడ్ సినిమాల్లోనూ నటించాడు.

Tags:    

Similar News