ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో అరవింద సమేత వీరేంద్ర సెహ్వాగ్

భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఓపెనర్ ఎవరంటే మారుమాట లేకుండా వచ్చే పేరు వీరేంద్ర సెహ్వాగ్. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన భారత తొలి ఓపెనర్, వన్డేల్లో డబుల్ సెంచరీ ఘనతలు అతడి సొంతం.

Update: 2023-11-13 15:30 GMT

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్ లో కొత్తగా ముగ్గురు క్రికెటర్లను చేర్చింది. ప్రపంచ మేటి ఆటగాళ్లను క్రమక్రమంగా చేర్చుకుంటూ వెళ్లే ఈ ఫేమ్ లో ఇప్పటికే భారత క్రికెటర్లు చాలా మందికి చోటు దక్కింది. తాజా జాబితాలో డాషింగ్ ఓపెనర్ కు స్థానం లభించింది. భారత క్రికెట్ చరిత్రను మలుపుతిప్పిన ఆ క్రికెటర్ కు ఇది సముచిత గౌరవమే. కాగా, ఈ సారి మరో విశేషం ఏమంటే.. భారత తొలి తరం మహిళా క్రికెటర్ కూ హాల్ ఆఫ్ ఫేమ్ గా నిలిచారు. శ్రీలంక క్రికెట చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్ మన్ గా, ప్రపంచ మేటి బ్యాట్స్ మన్ గా అందరికీ తెలిసిన ఆటగాడికీ స్థానం లభించింది.

‘‘వీరుడా’’.. మళ్లీ పుట్టాలిరా

భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఓపెనర్ ఎవరంటే మారుమాట లేకుండా వచ్చే పేరు వీరేంద్ర సెహ్వాగ్. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన భారత తొలి ఓపెనర్, వన్డేల్లో డబుల్ సెంచరీ ఘనతలు అతడి సొంతం. టెస్టుల్లో మొత్తం రెండు ట్రిపుల్ సెంచరీలు కొట్టాడు సెహ్వాగ్. ఇప్పటికీ (కరుణ్ నాయర్ తప్ప) మరో టీమిండియా బ్యాట్స్ మన్ ఎవరూ ట్రిపుల్ సెంచరీ మార్క్ ను చేరుకోలేకపోయారంటేనే వీరూ ఎంత గ్రేటో తెలిసిపోతోంది. కాగా, టెస్టుల్లోనూ తనదైన శైలిలో ఆడుతూ సెంచరీల మీద సెంచరీలు కొట్టిన సెహ్వాగ్.. మొత్తం 104 మ్యాచ్ లలో 8586 పరుగులు చేశాడు. 251 వన్డేల్లో 8273 పరుగులు సాధించాడు. 19 టి20ల్లో 394 పరుగులు కొట్టాడు. ఎన్ని రన్స్ అనేది లెక్క కాకుండా, సెహ్వాగ్ ఆడిన విధానమే టీమిండియా చరిత్రలో అతడిని మేటి బ్యాట్స్ మన్ గా నిలిపింది. మరీ ముఖ్యంగా సెంచరీ, డబుల్ సెంచరీ ముంగిట కూడా సిక్స్ కు ప్రయత్నించడం సెహ్వాగ్ ప్రత్యేకతను చాటుతోంది. అందుకే అతడు రిటైర్మెంట్ ప్రకటించాక.. ‘‘వీరుడా మళ్లీ పుట్టాలిరా’’ అని అభిమానులు కోరుకున్నారు.

డయానా.. ఇండియా క్రికెట్ క్వీన్

ఇప్పుడంటే మిథాలీ రాజ్, మంధాన, హర్మన్ ప్రీత్ తదితర మహిళా క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. కానీ , తొలి తరం భారత మహిళా క్రికెటర్ ఎవరంటే.. ఎవరికీ తెలియకపోవచ్చు. ఆమెనే.. డయానా ఎడుల్జీ. భారత మహిళా క్రికెట్ కు డయానాను ట్రయల్ బ్లేజర్ గా పేర్కొంటారు. మహిళలు చదువుకోవడమే ఎక్కువని భావించే 1970ల్లో క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్న ఎడుల్జీ, టీమిండియాకు 1976-91 కాలంలో ప్రాతినిధ్యం వహించారు. 20 టెస్టుల్లో 404 పరుగులు, 63 వికెట్లు, 34 వన్డేల్లో 211 పరుగులు, 46 వికెట్లు తీశారు. కుడిచేతి వాటం బ్యాటింగ్, ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన ఎడుల్జీ మహారాష్ట్రకు చెందినవారు. రిటైరయ్యాక బీసీసీఐలో పలు బాధ్యతలు నిర్వర్తించారు.

మ్యాడ్ మాక్స్ అరవింద

భారత క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ఎలాగో.. శ్రీలంక క్రికెట్ లో అరవింద డిసిల్వా అలాగన్నమాట. లంక 1996 ప్రపంచ కప్ గెలవడంలో అరవింద పాత్ర అత్యంత కీలకం. డాషింగ్ బ్యాట్స్ మన్ గా ప్రపంచానికి తెలిసిన అతడు.. 93 టెస్టుల్లో 6361 పరుగులు 29 వికెట్లు, 308 వన్డేల్లో 9284 పరుగులు, 106 వికెట్లు తీశాడు. దూకుడైన ఆటతో పాటు ఉపయుక్తమైన స్పిన్ తో జట్టుకు ఎంతో ఉపయోగపడ్డ అరవిందను మ్యాడ్ మాక్స్ గా అందరూ పిలిచేవారు. భారత్ తో జరిగిన 1996 సెమీఫైనల్లో ఒక పరుగుకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన అరవింద 14 ఫోర్లతో 47 బంతుల్లోనే 66 పరుగులు చేసి లంకను నిలబెట్టాడు. ఆస్ట్రేలియాతో ఫైనల్లోనూ సెంచరీ కొట్టి.. ప్రపంచ కప్ ఫైనల్ లో సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్ మన్ గా రికార్డులకెక్కాడు. ఇప్పుడు ఈ ముగ్గురికీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు కల్పించిన ఐసీసీ వారికి సముచిత గౌరవం ఇచ్చింది.

కొసమెరుపు: ప్రభుత్వం అతిగా జోక్యం చేసుకుంటోందంటూ.. మూడు రోజుల కిందట శ్రీలంక సభ్యత్వాన్ని రద్దు చేసిన ఐసీసీ.. తాజాగా ఆ దేశ అత్యున్నత క్రికెటర్ అరవింద డిసిల్వాను హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చి గౌరవించింది. లంకను ఈ విధంగా ఓదార్చింది.

Tags:    

Similar News