ఎవరీ జార్వో.. భారత క్రికెట్‌ లో ఏంటి గోల?

ఏకంగా భారత క్రికెటర్లు ధరించే జెర్సీలాంటిదాన్నే వేసుకుని మ్యాచు జరుగుతున్నప్పుడు ఏకంగా గ్రౌండ్‌ లోకి వచ్చేస్తున్నాడు.

Update: 2023-10-11 11:03 GMT

భారత క్రికెట్‌ లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అభిమాని సుధీర్‌ కుమార్‌ గురించి అందరికీ తెలిసిందే. సచిన్‌ ఆడుతున్నప్పుడు భారత్‌ ఆడే ప్రతి మ్యాచ్‌ కు సుధీర్‌ హాజరై జాతీయ జెండాను ధరించి ప్రేక్షకుల్లో సందడి సందడి చేసేవాడు. భారత్‌ క్రికెట్‌ టీమ్‌ ఎక్కడకు వెళ్తే అక్కడ సుధీర్‌ కుమార్‌ కనిపిస్తుండేవాడు. గుండుతో శరీరం మొత్తం జాతీయ జెండా రంగులేసుకుని జాతీయ జెండాను ఊపుతూ సుధీర్‌ చేసే సందడిని కెమెరాలు కూడా బంధించేవి.

ఇప్పుడు ఇదే కోవలో ఒక వ్యక్తి భారత్‌ ఆడే మ్యాచులకు హాజరవుతూ సందడి చేస్తున్నాడు. ఏకంగా భారత క్రికెటర్లు ధరించే జెర్సీలాంటిదాన్నే వేసుకుని మ్యాచు జరుగుతున్నప్పుడు ఏకంగా గ్రౌండ్‌ లోకి వచ్చేస్తున్నాడు.

టీమ్‌ ఇండియా ఆడే మ్యాచ్‌ లకు అనుకోని అతిథిలా వచ్చేస్తున్నాడు. ఏకంగా భారత జెర్సీను వేసుకుని ఆటగాళ్లతో కలిసిపోతున్నాడు. దీంతో పోలీసులు కూడా అతడు క్రికెటర్‌ అనుకుని వదిలేస్తున్నారు. ఇలా భారత్‌ ఆడుతున్న మ్యాచ్‌ ల్లో ప్రత్యక్షమవుతున్న అతడి పేరు.. జార్వో.

తాజాగా ప్రపంచ కప్‌ క్రికెట్‌ లో భాగంగా భారత్‌ – ఆస్ట్రేలియా మధ్య చెన్నైలో జరిగిన మ్యాచ్‌ కు కూడా జార్వో హాజరు కావడం గమనార్హం. ఆసీస్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు భారత్‌ ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు జార్వో మైదానంలోకి ప్రవేశించాడు. భారత జెర్సీతో అడుగుపెట్టేశాడు. పెవిలియన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ పిలుస్తున్నా వినిపించుకోకుండా ముందుకే దూసుకుపోయాడు. కేఎల్‌ రాహుల్, సిరాజ్‌ అతడిని అడ్డుకున్నారు. ఈలోపు అప్రమత్తమైన గ్రౌండ్‌ సిబ్బంది అతడిని బలవంతంగా బయటకు నెట్టాల్సి వచ్చింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

జార్వో తాను సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ అని చెబుతున్నాడు.తన వీడియోలను భారత పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ కూడా ఇష్టపడతాడని జార్వో చెబుతుండటం గమనార్హం. "జార్వో, నీ వీడియోను ఇష్టపడతా. కానీ, ఇప్పుడు మాత్రం దీనిని ఆపేసేయ్‌" అని ఆసీస్‌తో మ్యాచ్‌ సందర్భంగా విరాట్‌ తనతో చెప్పినట్లు జార్వో సోషల్‌ మీడియాలో వీడియోను షేర్‌ చేశాడు.

విరాట్‌తో సంభాషించినట్లు జార్వో పేర్కొన్నాడు. మరోవైపు జార్వో చర్యలపై ఇంటర్నేషన్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచకప్‌ లోని మిగతా మ్యాచ్‌లకు జార్వో హాజరు కాకుండా నిషేధం విధించింది. ఈ మేరకు కీలక ప్రకటన జారీ చేసింది. భారత అధికార యంత్రాంగం ఆ మేరకు అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐసీసీ సూచించింది.

Tags:    

Similar News