టి20 ప్రపంచ కప్.. సెమీస్ లో టీమిండియా ప్రత్యర్థి ఎవరో తెలుసా?

టి20 ప్రపంచ కప్ లో భారత్ గ్రూప్ ఎ టాపర్ గా సెమీస్ చేరితే.. గ్రూప్ బిలో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ను ఎదుర్కొనాల్సి ఉంటుంది.

Update: 2024-06-24 11:19 GMT

అమెరికా-కరీబియన్ దీవులు ఆతిథ్యం ఇస్తున్న టి20 ప్రపంచ కప్ మధ్యలోకి వచ్చింది. అమెరికాలో మ్యాచ్ లు తక్కువ స్కోర్లతో సాగి కాస్త నిరుత్సాహపరిచినా, ఫలితాలు మాత్రం ఆసక్తి కలిగించాయి. ఇక ప్రస్తుతం సూపర్ 8 దశ కూడా చివరకు చేరింది. మరో రెండు మ్యాచ్ లు (భారత్-ఆస్ట్రేలియా), (బంగ్లాదేశ్-అఫ్ఘానిస్థాన్) మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నాలుగు జట్లూ గ్రూప్-ఎలో ఉన్నాయి. గ్రూప్-బిలో సోమవారం ఉదయం జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ ను ఓడించిన దక్షిణాఫ్రికా సెమీఫైనల్స్ కు వెళ్లింది. ఆదివారం అమెరికాను చిత్తు చేసిన ఇంగ్లండ్ కూడా సెమీస్ బెర్తు దక్కించుకుంది. ఈ గ్రూప్ లో దక్షిణాఫ్రికానే టాపర్.

గ్రూప్-ఎలో ఎవరో?

గ్రూప్-ఎలో ఇంకా ఎవరికీ సెమీస్ బెర్తులు ఖాయం కాలేదనే చెప్పొచ్చు. భారత్ మాత్రం దాదాపు దగ్గరగా ఉంది. ఆస్ట్రేలియాను ఓడించిన అఫ్ఘానిస్థాన్ సెమీస్ రేసులో నిలిచింది. బంగ్లాదేశ్ దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. కానీ, అఫ్ఘాన్ ను ఓడించే సత్తా ఉన్న జట్టు ఇది. సోమవారం భారత్ గనుక ఆసీస్ పై నెగ్గితే టేబుల్ టాపర్ గా సెమీస్ కు వెళ్తుంది. ఓడిపోయినా.. మెరుగైన రన్ రేట్ ఉన్నందున రెండో స్థానంలో నిలుస్తుంది. అప్పుడు అఫ్ఘాన్ గనుక బంగ్లాపై నెగ్గినా ఫలితం ఉండదు.

ఇంగ్లండ్ తోనే సమరం..

టి20 ప్రపంచ కప్ లో భారత్ గ్రూప్ ఎ టాపర్ గా సెమీస్ చేరితే.. గ్రూప్ బిలో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ను ఎదుర్కొనాల్సి ఉంటుంది. గ్రూప్ ఎలో టీమిండియా రెండో స్థానానికి పరిమితం అయితే గ్రూప్ బి టాపర్ దక్షిణాఫ్రికాతో తలపడాల్సి వస్తుంది.

ఫైనల్లో ఆసీస్ ఎదురైతే?

ఆస్ట్రేలియా సోమవారం మ్యాచ్ లో భారత్ ను ఓడిస్తే.. గ్రూప్ ఎ టాపర్ గా గ్రూప్ బి రెండో ప్లేస్ లోని ఇంగ్లండ్ తో మొదటి సెమీస్ లో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో ఆసీస్, రెండో సెమీస్ లో భారత్ గెలిస్తే ఫైనల్లో మరోసారి ఈ రెండు జట్లూ ఎదురవుతాయి. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ లోనూ ఈ రెండు జట్లూ ఢీకొన్న సంగతి తెలిసిందే.

దీనికీ చాన్సుంది..

భారత్ ఆస్ట్రేలియాను ఓడించి, బంగ్లాను అఫ్ఘాన్ ఓడిస్తే అప్పుడు సెమీస్ లో భారత్ ఇంగ్లండ్ తో ఆడుతుంది. అఫ్ఘాన్ దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది.

Tags:    

Similar News