వైసీపీ ఎమ్మెల్యే ఆస్తుల వేలానికి బ్యాంకు నోటీసులు

ఆగస్టు 18న ఆయన ఆస్తులను వేలం వేస్తున్నట్లుగా కెనరా బ్యాంకు నోటీసులు జారీ చేసింది.

Update: 2023-07-21 05:00 GMT

అప్పు చెల్లించలేదని బ్యాంకులు నోటీసులు ఇవ్వటం సర్వసాధారణం. అయితే.. అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేకు అలాంటి నోటీసులు రావటం కాస్తంత అరుదనే చెప్పాలి. ఎందుకంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పించి.. ఈ చర్యకు బ్యాంక్ అధికారులు ముందుకు రారన్న మాట వినిపిస్తూ ఉంటుంది.అలాంటిది ఏపీ అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఆస్తుల్ని వేలం వేసేందుకు కెనరా బ్యాంకు నోటీసులు ఇవ్వటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్ లో.. ఇలాంటి పరిస్థితి సదరు ఎమ్మెల్యేకు ఎందుకు వచ్చిందన్న విషయంలోకి వెళ్లినప్పుడు అయ్యో.. అనుకోకుండా ఉండలేం. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? వేలానికి నోటీసులు ఇచ్చే వరకు విషయం ఎందుకు వెళ్లిందన్నది చూస్తే..

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే హామీగా ఉన్న మెసర్స్ ఏఎస్ఆర్ ఇంజినీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ తీసుకున్న భారీ రుణం గడువు లోపు చెల్లించని కారణంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం ఈ సంస్థ మెసర్స్ సాయిసుధీర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన తీసుకున్న రుణాలు టైంకు చెల్లించని కారణంగా ఆగస్టు 18న ఆయన ఆస్తులను వేలం వేస్తున్నట్లుగా కెనరా బ్యాంకు నోటీసులు జారీ చేసింది.

మెసర్స్ సాయిసుధీర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీకి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి.. ఆయన సతీమణి అపర్ణారెడ్డి.. తండ్రి వెంకటరామిరెడ్డి డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు సదరు కంపెనీ తీసుకున్న రుణం ఏప్రిల్ 30 నాటికి వడ్డీతో సహా రూ.908 కోట్లుగా ఉన్నట్లు బ్యాంకు చెబుతోంది. కంపెనీ ఆస్తులతో పాటు.. తీసుకున్న రుణానికి హామీదారుగా ఎమ్మెల్యే ఉన్నందున ఆయన ఆస్తుల్ని కూడా కలిపి వేలం వేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆయనకు ఏపీ.. తెలంగాణ.. కర్ణాటక రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయి. నిజానికి కంపెనీని ప్రారంభించిన సమయంలో ఎమ్మెల్యే.. ఆయన తండ్రి మాత్రమే డైరెక్టర్లుగా ఉన్నారు. మధ్యలో ఎమ్మెల్యే వైదొలిగి.. ఆయన సతీమణి డైరెక్టర్ అయ్యారు. ఇంతకీ.. ఇలాంటి పరిస్థితి ఎమ్మెల్యేకు ఎందుకు ఎదురైందన్న విషయాన్ని మీడియా ఆయన్ను అడిగినప్పుడు.. దిమ్మ తిరిగే షాకింగ్ నిజాన్ని చెప్పుకొచ్చారు.

తాను తెలంగాణ.. కర్ణాటక రాష్ట్రాల్లో పలు కాంటాక్టు పనులు చేశామని.. వాటికి సంబంధించిన బిల్లులు క్లియర్ కాకపోవటంతో సకాలంలో వడ్డీలు చెల్లించలేదని చెప్పుకొచ్చారు. బిల్లుల చెల్లింపులో జాప్యం.. చివరకు ఇంతటి ఇబ్బందికర పరిస్థితికి కారణమైందని చెప్పాలి.

Tags:    

Similar News