కాదంటే కేంద్రంతో.. లేదంటే కావాల్సినోల్లతో... ఏపీలో వేడెక్కిన రాజకీయం..!
ఇదే ఇప్పుడు ఏపీలో సెగలు రేపుతోంది
కరవమంటే కప్పకు-వదల మంటే పాముకు కోపం అన్నట్టుగా ఏపీలో రాజకీయ పరిస్థితి మారిపోయిందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై ఎడతెగని చర్చలు సాగు తున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు మాత్రం ఈ బిల్లును ఎట్టి పరిస్తితిలోనూ ఆమోదించుకు ని తీరుతామని చెబుతోంది. అయితే.. ఇది కేంద్రం ఒక్క దాని పనే కాదు. కీలకమైన అన్ని రాష్ట్రాల్లోనూ ఈ బిల్లుపై తీర్మానం చేసి తీరాలి.
ఇదే ఇప్పుడు ఏపీలో సెగలు రేపుతోంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఇటు అధికారపార్టీ వైసీపీకి, అటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కూడా ఈ బిల్లు గుభిల్లు పుట్టిస్తోంది. ఎటు అడుగు వేయాలన్నా కూడా ఆచితూచి వేయాల్సి వస్తోంది.
ముఖ్యంగా గత రెండు ఎన్నికల నుంచి కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్న మైనారిటీ ముస్లిలు.. ఈ బిల్లును వ్యతిరేకించాలని తాజాగా సీఎం జగన్‌ను కలిసి విన్నవించారు. దీనిపై సీఎం జగన్ వారికి 'అలానే' అని హామీ ఇచ్చినా.. కేంద్రం ఇప్పటికే ఆమోదించాలన్న షరతు ఆయనను వెంటాడుతోంది.
ఇప్పటికే కేంద్ర మంత్రి రిజుజు వారం కిందట ఏపీకి వచ్చి సీఎం జగన్‌ను కలిసి.. బిల్లుపై స్పష్టమైన హామీ తీసుకుని వెళ్లారు. దీంతో కాదంటే.. కేంద్రానికి, కావాలంటే.. కావాల్సిన ముస్లిం మిత్రులకు ఇబ్బంది కలిగించినట్టేనని సీఎం జగన్ భావిస్తున్నారు. పోనీ.. వ్యవసాయ చట్టాల్లాగా చేద్దామన్నా కుదిరేలా కనిపించడం లేదు. దీంతో ఇప్పటికైతే.. మైనారిటీ మిత్రులకు సర్ది చెప్పారు. ఇక, టీడీపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
గత రెండు ఎన్నికల్లోనూ టీడీపీకి మైనారిటీ వర్గం అండగా లేకపోయినా.. మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులు ఇవ్వడం, షాదీ తోఫా తదితర పథకాలు అమలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు మైనారి వర్గంలో టీడీపీకి సానుకూలత వ్యక్తమవుతోంది. ఇది వచ్చే ఎన్నికల్లో మేలు చేస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ, ఇంతలోనే ఉమ్మడి పౌరస్మృతి బిల్లు వెంటాడుతోంది. తాజాగా ఈయనతోనూ మైనారిటీ నేతలు భేటీ అయ్యారు. బిల్లుకు మద్దతివ్వద్దన్నారు.
కానీ, చంద్రబాబుకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోరుకుంటున్న చంద్రబాబు ఇప్పడు దీనిని కాదనే సాహసం చేస్తే.. పొత్తులు ఫలించేనా? అనే సందేహం వెంటాడుతోంది. దీంతో ఈయన కూడా వారికి నచ్చజెప్పడం మామూలే అయిపోయింది. మొత్తానికి కాదంటే కేంద్రానికి.. కావాలంటే కావాల్సిన వారికి ఇబ్బంది తప్పేలా కనిపించడం లేదని ఇరు పార్టీల సీనియర్లు చెబుతున్నారు.