పవన్ అండగా రంగంలోకి దిగిన చంద్రబాబు

ఈ నేపధ్యంలో పవన్ కి అండగా చంద్రబాబు రంగంలోకి దిగడం ఇపుడు ఆసక్తిని రేపుతోంది.

Update: 2023-07-21 12:37 GMT

ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ ఒక్కరే వాలంటీర్ల విషయంలో తనదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. పోరాటం చేస్తున్నారు. గత పన్నెండు రోజులుగా వాలంటీర్ల ఇష్యూ మీద పవన్ ఎక్కడా తగ్గడంలేదు. అదే సమయంలో వాలంటీర్లు మీద ఉమెన్ ట్రాఫికింగ్ ఆరోపణలకు అడిషనల్ గా మరో సెన్సిటివ్ ఇష్యూని కూడా జోడించి ఆరోపణల డోస్ పెంచేశారు.

వాలంటీర్లు డేటా కలెక్ట్ చేస్తున్నారని, దాన్ని మూడు ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నారని పవన్ అంటున్నారు. వాలంటీర్లకు అధిపతి ఎవరు, డేటా కలెక్ట్ చేయమని ఎక్కడ నుంచి ఆదేశాలు వస్తున్నాయి. ప్రతీ ఇంట్లోకి వాలంటీర్లను ప్రవేశపెట్టి ఆ ఇంటి సమాచారం గుట్టుగా తెలుసుకోవడంలో ఉద్దేశ్యం ఏంటి అంటూ పవన్ ప్రశ్నలను తాజాగా సంధించారు. జగన్ నెల్లూరు సభలో పవన్ మీద విరుచుకు పడిన వెంటనే పవన్ నుంచి ఘాటైన కౌంటర్ ఇలా వచ్చింది.

ఇదిలా ఉండగా పవన్ వాలంటీర్ల వ్యవస్థ మీద ఆధారాలు లేని ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ ప్రభుత్వం ఆయనను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఇక కోర్టుకు కూడా వెళ్ళి మరీ పవన్ మీద పరువు నష్టం దావా కేసులో ఇరికించాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోంది.

ఈ నేపధ్యంలో పవన్ కి అండగా చంద్రబాబు రంగంలోకి దిగడం ఇపుడు ఆసక్తిని రేపుతోంది. పవన్ విషయంలో పరువు నష్టం కేసు పెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం అనుమతించడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. ప్రజల వ్యక్తిగత సమాచారం ఎక్కడికి పోతోంది అని ఆయన ప్రశ్నించారు. ఇలా డేటా చేరీ చేస్తున్న ప్రభుత్వం మీదనే కేసు పెట్టాలని బాబు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయడం విశేషం.

ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ తన పార్టీ వారినే ఈ విషయంలో పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. ఇక మిత్రపక్షంగా చెప్పుకుంటున్న బీజేపీ నుంచి ఈ కేసు విషయంలో పవన్ కి మద్దతుగా ప్రకటన వచ్చినట్లుగా లేదు. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అని పవన్ అన్నా కూడా ఏపీ బీజేపీ నుంచి మద్దతు వస్తుందనుకున్నా చిత్రంగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది.

ఇంకో వైపు వాలంటీర్ల మీద చంద్రబాబు దే కీలక పాత్ర అని తెర వెనక ఎల్లో మీడియా చంద్రబాబు ఉంటే బయట మాత్రం పవన్ ఉన్నారని జగన్ ఆరోపించారు. దానికి రుజువు అన్నట్లుగా పవన్ని చంద్రబాబు వెనకేసుకుని వచ్చారా అన్నదే చర్చగా ఉంది. మరో వైపు చూస్తే వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీకి కోరిక ఉంది.

జనసేన కూడా సుముఖంగా ఉందని అంటున్నారు. ఇపుడు బీజేపీతో జనసేన ఉన్నా ముందు ముందు టీడీపీతో పొత్తులు కుదురుతాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో సహజంగా పవన్ కి చంద్రబాబు అండగా ట్వీట్ చేసి ఉంటారని అంటున్నారు. పవన్ మీద కేసు పెట్టడాన్ని టీడీపీ తప్పు పట్టడం ద్వారా రేపటి రోజున పవన్ కి ఏమైనా అరెస్ట్ లాంటివి చేస్తే తాము ఆయన తరఫున జనసేన కి మద్దతుగా ఉండి పోరాటం చేస్తామని చెప్పకనే బాబు చెప్పారా అన్న చర్చ కూడా సాగుతోంది.

ఇంకో వైపు చూస్తే ఏపీలో జనసేన పోరాటానికి ఎంత కాదనుకున్నా బీజేపీ కంటే టీడీపీ మద్దతే కీలకం అని చెప్పడానికే బాబు ఈ ట్వీట్ వేసి ఉంటారని అంటున్నారు. ఏపీలో పటిష్టంగా బలంగా ఉన్న పార్టీ టీడీపీ. అందువల్ల పవన్ కి చంద్రబాబు నైతిక మద్దతు చాలా ముఖ్యమంగానే మారుతుందని అంటున్నారు.

ఇక పవన్ మీద కేసు పెట్టి కోర్టు దాకా కధ నడిపిస్తే ఏపీలో నేరుగా విపక్షంతోనే అది యుద్ధానికి దారి తీస్తుందని చంద్రబాబు కామెంట్స్ బట్టి అర్ధం అవుతోంది. ఇక పవన్ మీద కేసులు పెడితే కేంద్ర బీజేపీ కూడా కీలక సమయంలో రంగంలోకి తప్పనిసరిగా దిగి రావచ్చు అని అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే వైసీపీ సర్కార్ పవన్ మీద కేసులు పెట్టడం ద్వారా రాగల రాజకీయ పరిణామాలను ఊహించే ముందుకు అడుగులు వేస్తోందా అన్నది కూడా చర్చకు వస్తోంది. చూడాలి మరి ఏమి జరగనుందో.

Tags:    

Similar News