టికెట్ల పై జగన్ కసరత్తు... మైనస్‌లు.. ప్లస్‌లు ఇవే..!
అదేసమయంలో బీసీలు, ఎస్సీలకు కూడా జనరల్ టికెట్ లు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు.
వైసీపీలో టికెట్ల పర్వం ప్రారంభమైనట్టు సమాచారం. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యే లను పలు దఫాలుగా హెచ్చరించిన సీఎం జగన్.. ప్రజల్లో ఉండాలని సూచించారు. అయితే.. ఇవన్నీ ఎలా ఉన్నా.. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేర్పులు జోరుగా చేసే అవకాశం కనిపిస్తోందని సీనియర్లు చెబుతున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ఆయన టికెట్లపై కసరత్తు ప్రారంభించినట్టు చెబుతున్నారు.
''ఉన్న వారికి అందరికీ టికెట్లు ఇస్తారో లేదో తెలియదు. కానీ, కసరత్తు అయితే.. ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉన్నాయా.? లేవా? అని కాదు. ప్రజల్లో ఎవరికి బలం ఉంది? అనే విషయాన్ని మాత్రమే ఇప్పుడు పరిగణనలోకి తీసుకుంటున్నారు. తొలి దశంలో ప్రజల్లో మద్దతు ఉన్న నాయకులకు ప్రాధాన్యం ఇస్తారు'' అని తాడేపల్లికి చెందిన కీలక నాయకుడు , గుంటూరుకు చెందిన నేత చూచాయగా చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం మూడు రకాలుగా వైసీపీ నేతలను ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. ఒకటి ప్రజల్లో మద్దతు ఉండడం.. రెండు ఆర్థికంగా బలమైన నాయకులు కావడం, మూడు సామాజిక వర్గం పరంగా.. పేరు ఉండడం. ఈ మూడు కూడా అత్యంత ప్రదానమేనని అంటున్నారు.
వీటిలో రెండు బాగుండి మూడో ది సరిగా లేకపోయినా.. టికెట్ ఖాయమనే వాదన కూడావినిపిస్తుండడం గమనార్హం. అదేసమయంలో ఈ దఫా 35 శాతం నుంచి 40 శాతం వరకు మహిళలకే ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికలను ప్రతిపక్షాలు సీరియస్‌గా తీసుకున్నాయి. అభివృద్ధి, రాజధాని, అప్పులు అనే మూడు కాన్సెప్టులను ప్రజల్లోకితీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాయి. అయితే, దీనికి విరుగుడుగా.. మహిళా అస్త్రాన్ని ప్రయోగించేందుకు వైసీపీ రెడీ అవుతున్నట్టు మరోవర్గం చెబుతోంది
ఎన్నికల్లో 40 శాతం వరకు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారారాష్ట్రంలో మహిళా ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకొనేందుకు కసరత్తులో ఎక్కువగా మహిళల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అదేసమయంలో బీసీలు, ఎస్సీలకు కూడా జనరల్ టికెట్ లు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.