ఆరు నెలల్లో రిటైర్మెంట్ అంటున్న పేర్ని నాని..మ్యాటరేంటో..?
ఆరు నెలలలో తాను రిటైర్ అయ్యేవాడిని అని తనకు ప్రతిష్టలు ఇమేజ్ వంటివి ఉండవని అన్నారు తమ ప్రభుత్వం ఉంటే మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేగా తప్పులు ఉంటే సరిచేయవద్దా అని ఆయన ప్రశ్నించారు.
పేర్ని నాని. రాజకీయాల మీద ఆ మాత్రం అవగాహన ఉన్న వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు అది. ఆయన సెటైర్లకు పెట్టింది పేరు. నాని వెటకారం డాట్ కం అని కూడా ముద్దుగా పిలుస్తారు. ఆయన నోటి వెంట వెటకారం మాటలు చాలానే వస్తాయి.
ఆయన జగన్ కి అత్యంత నమ్మకస్తుడు. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు నాని కూడా నాడు వచ్చారు. మచిలీపట్నం నుంచి 2004, 2009లలో కాంగ్రెస్ తరఫున గెలిచిన నాని అనంతరం వైసీపీలో చేరి 2019లో గెలిచి మంత్రి కూడా అయ్యారు. టోటల్ వైఎస్సార్ ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టపడే పేని నాని జగన్ కి ఎపుడూ రక్షణ కవచంగా పనిచేస్తూ వస్తారని పేరు.
జగన్ కోసం గొంతు చించుకుని ముందు వరసలో ఉండే వారిలో నాని ఒకరు. మరి అలాంటి పేర్ని నాని టోన్ మారింది అని అంటున్నారు. ఆయన తాజాగా జరిగిన ఉమ్మడి క్రిష్ణా జిల్లా పరిషత్ సమావేశంలో చేసిన ఘాటు వ్యాఖ్యలే దానికి నిదర్శనం. జెడ్పీ మీటింగ్ కి ఏలూరు జిల్లా నుంచి మొత్తం 32 మంది జిల్లా అధికారులు హాజరైనా పేర్ని నాని మాత్రం నానా యాగీ చేశారు అని అంటున్నారు.
ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జెడ్పీ మీటింగ్ కి హాజరు కాకపోవడం పట్ల నాని ఫైర్ అయ్యారు. కలెక్టర్ మీటింగ్ కి హాజరు కాకపోవడమేంటి అని మండిపడ్డారు. ఇలాగే అధికారులు నిర్లక్షం వహిస్తే తాను ఏకంగా జగన్ ఇంటి ముందే ధర్నా చేస్తాను అని హెచ్చరించారు. అది అక్కడితో ఆగలేదు పేర్ని నాని వెళ్ళి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిశారు.
ఏలూరు కలెక్టర్ హాజరు కావడంలేదని ఫిర్యాదు చేశారు. జెడ్పీ మీటింగ్ కి కలెక్టర్లు తప్పనిసరిగా హాజరు కావాల్సిందే అని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తామని జవహర్ రెడ్డి హామీ ఇచ్చారని పేర్ని నాని మీడియాతో చెప్పారు. ఇదిలా ఉండగా తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదని వ్యవస్థలో లోపాలు ఉంటే సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాను అంటున్నారు.
ఆరు నెలలలో తాను రిటైర్ అయ్యేవాడిని అని తనకు ప్రతిష్టలు ఇమేజ్ వంటివి ఉండవని అన్నారు తమ ప్రభుత్వం ఉంటే మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేగా తప్పులు ఉంటే సరిచేయవద్దా అని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి చూస్తే నాని టోన్ అయితే మారుతోంది అని అంటున్నారు.
దానికి కారణం ఆయన కుమారుడు కిట్టుకు వైసీపీ టికెట్ మచిలీపట్నం నుంచి ఇవ్వడానికి అధినాయకత్వం అంగీకరించడంలేదు అన్న దానితోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి చూస్తే పేర్ని నాని వ్యవహారం వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ నే నివ్వెరపరుస్తోంది అని అంటున్నారు. మరో వైపు కొడాలి నాని మౌనం వల్లభనేని వంశీ సైలెంట్ గా ఉండడం వంటివి చూస్తే ఉమ్మడి క్రిష్ణా జిల్లా వైసీపీలో ఏదో తేడా కొడుతోంది అని అంటున్నారు.