నూజివీడులో ఈ అన్నల్ని ఏం చేసినా తక్కువే.. ఎంత దారుణానికి ఒడికట్టారంటే?

ఇంటర్ చదువుతున్న ఆమెకు వరుసకు అన్నలు సంతోష్.. ప్రదీప్ లు. శనివారం కాలేజీ నుంచి బయటకు వచ్చిన బాధితురాలిని ఫాలో అయ్యారు.

Update: 2025-02-17 04:47 GMT

బంధాలు.. అనుబంధాలు అన్నవి అంతకంతకూ లేకుండా పోతున్నాయి. కనురెప్పల మాదిరి చెల్లెలు వరుస అయ్యే అమ్మాయిని కాపాడాల్సిన అన్నలే.. ఆమె పాలిట కీచకులుగా మారిన సంచలనం నూజివీడులో చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా నూజివీడులో చోటు చేసుకున్న ఈ అరాచకం గురించి విన్నోళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. వరుసకు అన్నలన్న నమ్మకానికి జీవితానికి సరిపడా షాక్ ను ఇచ్చిన వైనం గురించి తెలిస్తే ఒళ్లు మండక మానదు.

శనివారం సాయంత్రం జరిగిన ఈ దారుణ ఉదంతం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో పోలీసులు ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. నిందితుడ్ని వైద్య పరీక్షలకు పంపని వైనాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. పోలీసులు వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం.. నూజివీడు ప్రభుత్వ కాలేజీలో బాధితురాలు చదువుతోంది.

ఇంటర్ చదువుతున్న ఆమెకు వరుసకు అన్నలు సంతోష్.. ప్రదీప్ లు. శనివారం కాలేజీ నుంచి బయటకు వచ్చిన బాధితురాలిని ఫాలో అయ్యారు. మాయమాటలు చెప్పి ఆమె దగ్గరున్న పుస్తకాల్ని మరో అమ్మాయికి అప్పజెప్పి తమతో బండి మీద తీసుకెళ్లారు. అనంతరం అజరయ్యపేటలో ఉన్న సమాధుల వైపు తీసుకెళ్లారు.

అప్పటికే వారిద్దరు మద్యం మత్తులో ఉండటం.. గంజాయి కూడా తాగి ఉంటారన్న అనుమానం వ్యక్తమవుతోంది. వారి తీరు తేడాగా ఉండటం.. తాను ఇంటికి వెళతానన్న ఒప్పుకోకపోవటం ఒక ఎత్తు.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నంలో వారితో పోరాడి.. అక్కడి నుంచి ఆమె తప్పించుకుంది. అనంతరం ఇంట్లో వారికి వారిద్దరి గురించి చెప్పటంతో వారు పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో వరుసకు అన్నలైన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. మద్యం మత్తులో ఉన్న వారిని వైద్య పరీక్షలకు ఎందుకు పంపలేదన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News