పవన్‌ పై డిఫమేషన్... పిటిషన్‌ ను వెనక్కి పంపిన కోర్టు!

వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

Update: 2023-07-26 03:57 GMT

వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా ఉమన్ ట్రాఫికింగ్ కి పాల్పడేవారికి వాలంటీర్లే ఇన్ ఫార్మర్లు అనే స్థాయిలో పవన్ విమర్శలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ దిష్టి బొమ్మలు దహనం చేయడం, ఆయన ఫోటోలు చెప్పులతో కొట్టడం వంటివి చేశారు. ఇదే సమయంలో పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు కూడా నమోదయ్యాయి.

ఈ సమయంలో వాలంటీర్లు, ఆ వ్యవస్థకు పరువు నష్టం కలిగేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వి జయవాడ సిటీ సివిల్‌ కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు ఒక మహిళా వాలంటీర్ తన ప్రతిష్ఠకు పరువు నష్టం కలిగేలా పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.

అయితే ఈ పిటిషన్ ను విజయవాడ సిటీ సివిల్ కోర్టు వెనక్కి పంపించింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపే భౌగోళిక విచారణాధికారం ఈ కోర్టు పరిధిలోకి ఎలా వస్తుందో స్పష్టత ఇవ్వాలని పేర్కొంది. అంతే కాకుండా ఆ వ్యాఖ్యలు నిర్దిష్టంగా ఫిర్యాదురాలి ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయనేందుకు సరైన ఆధారాలు సమర్పించాలని సూచించింది.

కాగా... జనసేన వారాహి యాత్ర రెండో దశ సందర్భంగా ఏలూరులో నిర్వహించిన సభలో పవన్ కల్యాణ్... వాలంటీర్ల ప్రతిష్ఠకు పరువు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ పెనుదుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ పవన్ కు నోటీసులు జారీచేసింది.

ఈ సమయంలో విజయవాడ శాంతినగర్‌ కు చెందిన రంగవల్లి అనే మహిళా వాలంటీరు విజయవాడ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌/ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్‌ 499, 500, 504, 505 తదితర సెక్షన్ల కింద శిక్షించాలని కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై విజయవాడ కోర్టు ఈమేరకు నిర్ణయం తీసుకుంది.

ఈ పిటిషన్ అనంతరం... మ‌హిళ‌ల అక్రమ ర‌వాణాకు పాల్పడుతున్నట్టుగా త‌మ‌పై ప‌వ‌న్ అనుచిత వ్యాఖ్యలు చేశార‌ని.. అవి త‌మ‌ను మాన‌సికంగా కుంగదీశాయని.. ఈ సందర్బంగా తమకు న్యాయం చేయాలని మహిళా వాలంటీర్‌ విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో భర్త చనిపోయి పిల్లలతో జీవిస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఈ సమయంలో పవన్ చేసిన హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యాఖ్యల తర్వాత పరిస్థితి మారిపోయిందని ఆమె తెలిపారు. పవన్ ట్రాఫికింగ్ వ్యాఖ్యల తర్వాత తనను చుట్టుపక్కల వారు ప్రశ్నించారని.. నిస్వార్ధంగా సేవ చేస్తున్న మాపై నిందలు వేశారని ఆమె తెలిపారు. అనంతరం పవన్‌ ను చట్టపరంగా శిక్షించాలి అని డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News