పవన్ విషయంలో టీడీపీ తేల్చుకోలేకపోతోందా...?

అంటే కచ్చితంగా బీజేపీతో పవన్ కలసి వెళ్తారు అన్నది తేలిపోతున్న విషయం. మరి టీడీపీ విషయమే లెక్క తేలడంలేదు.

Update: 2023-07-25 08:40 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మిత్రుడా లేక రేపటి రోజున ప్రత్యర్ధిగా మారుతారా. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ పెద్దలకు ఏమీ అర్ధం కాక తేల్చుకోలేకపోతున్నారు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ సినీ సెలెబ్రిటీ ఆయన సభలకు జనాలు విరగబడి వస్తారు. మరో వైపు చూస్తే బలమైన సామాజికవర్గానికి చెందిన వారు.

ఇవన్నె ప్లస్ పాయింట్స్ గా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటి అంటే పవన్ ఈ రోజుకు ఒక్క మాట కూడా టీడీపీని విమర్శించడంలేదు. చంద్రబాబుతో ఇప్పటికి రెండు మూడు సార్లు కలసి వచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చమని అంటున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా కూడా ఆయన ఇటీవల ఢిల్లీ వెళ్ళి వచ్చిన తరువాత బీజేపీకి మరింత దగ్గర అయిపోయారు. ఏపీలో ఎండీయే సర్కార్ రావాల్సిందే అని అంటున్నారు.

అంటే కచ్చితంగా బీజేపీతో పవన్ కలసి వెళ్తారు అన్నది తేలిపోతున్న విషయం. మరి టీడీపీ విషయమే లెక్క తేలడంలేదు. ముందు పొత్తులకు ఓకే అనుకుంటే సీట్ల సంగతి చూసుకోవచ్చు అన్నది టీడీపీ భావన అయితే సీట్ల లెక్క తేల్చిన తరువాతనే పొత్తు అన్నది జనసేన నుంచి వినిపిస్తున్న మాటగా ఉంది.

ఈ మధ్యనే మాజీ మంత్రి హరిరామజోగయ్య జనసేన అధినాయకత్వానికి ఒక సూచన చేసినట్లుగా చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 75 సీట్లకు తక్కువ కాకుండా జనసేన పొత్తులలో తీసుకోవాలన్నది ఆయన సూచనగా ఉంది. అంటే ఏపీలో మొత్తం 175 సీట్లలో జనసేన వాటా ఇది అన్న మాట.

అంత ఎక్కువ సీట్లు కాకపోయినా జనసేన అయితే 50 సీట్లకు తగ్గేది లేదు అన్నది ఒక కచ్చితమైన మాటగా ఉంది అని అంటున్నారు. వారాహి రెండు విడతల యాత్రతో జనసేన గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది అని ఆ పార్టీ భావిస్తోంది. పైగా ఉత్తరాంధ్రా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న 68 సీట్లలో నలభై దాకా సీట్లలో తాము బలంగా ఉన్నామని అంటోంది. దక్షిణ కోస్తాలో మరో పది సీట్లను తీసుకుని యాభైకి పోటీకి దిగాలన్నదే జనసేన ఆలోచన అంటున్నారు.

అదే కనుక జరిగితే ఏపీలో టీడీపీ అన్ని సీట్లు ఇస్తుందా అన్నది డౌట్. టీడీపీ అయితే గరిష్టంగా పాతిక దాకా సీట్లు ఇచ్చే చాన్స్ అయితే ఉంది మరి ఈ లెక్కలకు పొంతన కుదరకపోతే జనసేన బీజేపీ కలసి పోటీ చేస్తే ప్రత్యర్ధిగా మారితే అపుడు సంగతేంటి అన్నది మాత్రం టీడీపీ ఈ రోజు దాకా ఆలోచించుకోలేదని అంటున్నారు.

నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయం అంటున్నారు. రాజకీయాలో మిత్రులు శత్రువులు ఎవరూ శాశ్వతంగా ఉండరు. రాజకీయం మారినపుడు పక్కన ఉన్న వారే శత్రువులు అవుతారు. ఆ టైం లో జనసేన మీద విమర్శలు ఒక్కసారిగా చేసినా ఫలితం ఎంతవరకూ ఉంటుంది అన్నదే టీడీపీలో చర్చగా ఉంది. మరి మిత్ర పక్షం కాకపోయినా ఫ్రెండ్లీ కాంపిటేషన్ గా ఎన్నికలకు వెళ్తారా అలాగైనా క్యాడర్ కి అయోమయం ఉంటుంది అది వర్కౌట్ అయ్యే సూచనలు ఉండవని కూడా ఆలోచిస్తున్నారుట.

ఏది ఏమైనా కూడా జనసేన విషయంలో మాత్రం ఈ రోజుకీ టీడీపీ పొలిటికల్ గా ఒక క్లారిటీకి రాకపోవడం ఆ పార్టీకి ఇబ్బందే అంటున్నారు. మరి టీడీపీ ఈ విషయంలో తొందరలో అయినా తన స్టాండ్ ని కచ్చితంగా చూసుకుని ముందుకు వెళ్తుందేమో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News