పవన్ని కోర్టు దాకా..వైసీపీ మాస్టర్ ప్లాన్ ?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ణి కోర్టు దాకా నడిపించాలని వైసీపీ మాస్టర్ స్కెచ్ వేస్తోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ణి కోర్టు దాకా నడిపించాలని వైసీపీ మాస్టర్ స్కెచ్ వేస్తోంది. పవన్ వారాహి యాత్రలో వైసీపీ మీద ముఖ్యంగా జగన్ మీద వ్యక్తిగతంగా ఎన్నో తీవ్ర విమర్శలు చేశారు. అయితే అవన్నీ రాజకీయ విమర్శలుగానే కొట్టుకుపోతాయి. కాబట్టి వాటికి వేరే సభలలో కౌంటర్ ఇవ్వడం మినహా వేరే మార్గం లేదు.
అయితే పవన్ సీఎం జగన్ని పట్టుకుని రౌడీ అనేశారు. గళ్ల చొక్కా పచ్చ లుంగీ వేయిస్తామని అన్నారు. ఆయన జగ్గూ భాయ్ అని కూడా సంభోదించారు. జగన్ అంటూ ఏక వచన సంభోదన చేశారు. ఇవన్నీ వైసీపీ ఏ మాత్రం సహించలేకపోతోంది అని అంటున్నారు.
ఇక ఇటీవల కొత్త సభా సంఘాన్ని కూడా స్పీకర్ తమ్మినేని సీతారాం నియమించారు. సభా సంఘం ప్రభుత్వంలో ఉన్న వారి మీద ఎవరైనా దారుణమైన ఆరోపణలు చేస్తే వారికి నోటీసులు ఇచ్చి పిలిపించి విచారిస్తుంది. అలా పవన్ సీఎం జగన్ మీద ఏకవచన ప్రయోగంతో చేసిన దారుణ కామెంట్స్ మీద చేయాలని కూడా వైసీపీలో కొంత తర్జన భర్జన జరిగినట్లుగా చెప్పుకున్నారు.
అయితే ఆ విషయం అలా ఉండగానే ఇపుడు ఏకంగా పవన్ని కోర్టు మెట్లు ఎక్కించాలని వైసీపీ భావిస్తోంది అని అంటున్నారు. ఏపీలో వాలంటీర్ల మీద పవన్ దారుణమైన వ్యాఖ్యలే చేశారు. వారు వ్యక్తిగత డేటాను సేకరించి సంఘ విద్రోహక శక్తులకు చేరవేస్తున్నారు అని ఫలితంగా ఏపీలో ఉమెన్ ట్రాఫికింగ్ పెద్ద ఎత్తున సాగుతోందని, పదహారు వేల పై చిలుకు మహిళలు మిస్ అయ్యారంటూ పవన్ ఏలూరు సభలో చాలా పెద్ద విమర్శలు చేశారు.
దాని మీద ఏపీ మహిళా కమిషన్ పవన్ కి నోటీసులు ఇచ్చింది. పది రోజుల వ్యవధిలో సమాధానం చెప్పమని కోరింది. అయితే పది రోజులు పై దాటినా పవన్ లైట్ తీసుకున్నారు కానీ జవాబు అయితే ఇవ్వలేదు. ఇక పవన్ క్షమాపణ చెప్పాలని ఏపీ అంతా వాలంటీర్లు రెండు మూడు రోజులు ఆందోళన చేసినా కూడా పవన్ నుంచి స్పందన లేదు. పైగా వాలంటరీర్లు ఆందోళన చేయలేకపోయారు.
ఇపుడు చూస్తే పవన్ కామెంట్స్ ని వైసీపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది అని అంటున్నారు. దీని మీద కోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. పవన్ దురుద్దేశ్య పూర్వకంగానే ఈ కామెంట్స్ చేశారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఏ ఆధారాలు లేకుండా వాలంటీర్ల వ్యవస్థ మీద ఈ రకంగా మాట్లాడడం వల్ల వాలంటీర్ల ఆత్మ గౌరవం దెబ్బ తింది అని ప్రభుత్వం భావిస్తోంది.
అదే విధంగా గ్రామ, వార్డు సచివాలయాల పరువు తీసేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని ఇవన్నీ తీవ్ర అభ్యంతరకరమైన విషయం అని భావిస్తోంది. ఇక వాలంటీర్లు కూడా పవన్ కామెంట్స్ మీద ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వం తన మానసపుత్రికగా ఏర్ర్పాటు చేసిన ఈ వ్యవస్థ మీద ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తే తగిన చర్యలు ప్రభుత్వం నుంచి ఉంటాయా అన్న దాని మీద వారు ఎదురుచూస్తున్నారు అంటున్నారు.
ఒక విధంగా వాలంటీర్లు డీ మోరలైజ్ అయ్యారని చెబుతున్నారు. గ్రామాలలో వారు అంతా ఆత్మీయంగా తిరిగే చోట ఈ విధంగా వారిని సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలు అంటకట్టి కామెంట్స్ చేయడం అంటే తట్టుకోలేని విషయం అంటున్నారు. దాంతో ప్రభుత్వం న్యాయపరంగానే పవన్ మీద చర్యలకు ఉపక్రమించాలని చూస్తోంది అంటున్నారు.
దాని కోసం తమ వ్యవస్థల మీద ఏ ఆధారం లేకుండా పవన్ కామెంట్స్ చేశారు అంటూ ప్రభుత్వం స్వయంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుందని అంటున్నారు. దీంతో త్వరలోనే ప్రభుత్వం ఈ అంశం మీద కోర్టుకి వెళ్తుందని అంటున్నారు. కోర్టులో ఈ కేసు విచారణ జరిగితే పవన్ కి కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు ఎవరు ఆయనకు చెవిలో చెప్పారు అన్నది అక్కడ చెప్పాల్సి ఉంటుందని ఈ విషయంలో ఆధారాలు ఏమి ఉన్నాయి అన్నది కూడా తెలుస్తుంది అంటున్నారు. మొత్తానికి పవన్ని రాజకీయంగానే కాకుందా న్యాయపరంగా ఎదుర్కోవడానికే వైసీపీ రెడీ అయింది అని అంటున్నారు.
సాధారణంగా ప్రభుత్వ వ్యవస్థల మీద దారుణమైన విమర్శలు చేస్తే న్యాయపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అధారాలు చూపకపోతే చర్యలు కూడా ఉంటాయని నిపుణులు అంటున్నారు. మరి జనసేన వద్ద ఆధారాలు ఏమైనా ఉంటే కూడా బయటపడుతుంది అని అంటున్నారు.