కమిటీ కుర్రోలు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..

మొదటి వారంలోనే 1.63 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్ర ప్రదర్శన నిర్మాతలను ఎంతగానో సంతోషపరిచింది.

Update: 2024-08-10 10:12 GMT

మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోలు అందరూ కూడా వారికంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా కూడా సొంతంగా అవకాశాలు అందుకుంటున్నారు. ఇక నిహారిక కూడా సోలోగా తన టాలెంట్ ను నిరూపించుకునే విదంగా అడుగులు వేస్తోంది. నిహారిక కొణిదెల తన తొలి నిర్మాణ చిత్రం 'కమిటీ కుర్రోళ్ళు' తో మంచి విజయం అందుకున్నారు.

 

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రంలో 11 మంది కొత్తవారిని టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయడం విశేషం. ఆగస్టు 9 విడుదలైన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకుల మనసులను కట్టిపడేస్తోంది. యువత, ప్రేమ, స్నేహం వంటి అంశాలపై దృష్టి పెట్టిన ఈ సినిమా అందరికీ నచ్చేలా తెరకెక్కింది.

90వ దశకంలో గోదావరి జిల్లాల్లోని అందమైన పచ్చని పొలాలు, గోదావరి నది పరిసరాల్లో చిత్రీకరించిన ఈ చిత్రం ప్రేక్షకులను పాత జ్ఞాపకాలలోకి తీసుకెళ్లింది. అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి మంచి స్పందన పొందిన ఈ చిత్రం, మొదటి వారంలోనే 1.63 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్ర ప్రదర్శన నిర్మాతలను ఎంతగానో సంతోషపరిచింది.

సినిమా కథ, నటీనటుల ప్రదర్శనలు, సంగీతం, సినిమాటోగ్రఫీ వంటి అన్ని అంశాల్లో ప్రేక్షకులు సినిమా‌ను ఆదరించారు. ఈ చిత్రానికి దర్శకుడిగా బాధ్యతలు నిర్వహించిన యధు వంశి తన మొదటి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన నేటితరం యువతకు దగ్గరైన స్నేహబంధాన్ని మూడు జాతరల నేపథ్యంలో ఆవిష్కరించి, ప్రేక్షకులకు మంచి కథ అందించారు.

అనుదీప్ దేవ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆహ్లాదకరమైన పాటలు చిత్రానికి మరింత బూస్ట్ ఇచ్చాయి. గోదావరి అందాలను అద్భుతంగా చిత్రీకరించి ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లారు. వెంకట సుభాష్ చీర్ల, కొండల్ రావు అద్దగల రచించిన సంభాషణలు అద్భుతంగా మలచబడ్డాయి. సాయి కుమార్, గోపరాజు రమణ, శ్రీలక్ష్మి వంటి అనుభవజ్ఞుల నటనతో పాటు, నూతన నటీనటులందరూ ఆకట్టుకున్నారు.

డిస్ట్రిబ్యూటర్ వంశి నందిపాటి 'కమిటీ కుర్రోళ్ళు' చిత్రాన్ని విస్తృతంగా విడుదల చేయడం ద్వారా ప్రేక్షకులకు ఆ సినిమా అనుభవం పొందడానికి విస్తృతమైన అవకాశం కల్పించారు. ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందడమే కాకుండా, కొత్తవారికి కూడా ఒక మంచి ప్లాట్‌ఫారమ్‌ను అందించింది. 'కమిటీ కుర్రోళ్ళు' చిత్రం నిహారిక కొణిదెలకు నిర్మాణ రంగంలో ఒక మంచి ఆరంభం కావడంతో పాటు, టాలీవుడ్‌లోని నూతన నటీనటులకు బలమైన పునాది అందించింది.

Tags:    

Similar News