ఉలికిపాటు: గాఢ నిద్ర వేళ.. జైపూర్ లో భూకంపం!
జైపూర్ తో సహా రాజస్థాన్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది.
ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గాఢ నిద్రలో ఉన్న వేళలో.. ఒక్కసారిగా భూమి ప్రకంపించటంతో ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. ఒక్కసారి ఉలిక్కిపడిన ప్రజలకు భూమి ప్రకంపనలు చోటు చేసుకున్న వైనం భయాందోళనలకు గురి చేస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల వేళలో భూమి కంపించినట్లుగా గుర్తించారు.
నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచిన ప్రజలు పలువురు.. ఆందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయానికి గురయ్యారు. రిక్టర్ స్కేల్ మీద 4.4 గా నమోదైనట్లుగా నేషనల్ సిస్మాలజీ సెంటర్ పేర్కొంది.
పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే.. ఈ భూప్రకంనల కారణంగా ఎలాంటి ప్రాణ.. ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు చెబుతున్నారు.
జైపూర్ తో సహా రాజస్థాన్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. గురువారం తెల్లవారుజామున ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలోని నొగోపాలోనూ భూమి ప్రకంపించటం.. దాని తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 3.6 ఉండటం తెలిసిందే.
జైపూర్ లో చోటు చేసుకున్న భూప్రకంపనలపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజె ట్విటర్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో జైపూర్ తో సహా పలు ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లుగా వెల్లడించారు.