బైక్ వెనుక తాళ్లు కట్టి.. భార్యను ఊరంతా ఈడ్డుకెళ్లిన అమానుషం ఎక్కడంటే?
షాకింగ్ ఉదంతం ఒకటి రాజస్థాన్ లో చోటు చేసుకుంది. భార్య విషయంలో ఒక భర్త అత్యంత అమానుషంగా వ్యవహరించిన వైనం వెలుగు చూసింది.
షాకింగ్ ఉదంతం ఒకటి రాజస్థాన్ లో చోటు చేసుకుంది. భార్య విషయంలో ఒక భర్త అత్యంత అమానుషంగా వ్యవహరించిన వైనం వెలుగు చూసింది. తన సోదరి ఇంటికి వెళతానని చెప్పిన దానికి తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు భర్త.. ఆమెను బైక్ వెనుక తాళ్లతో కట్టేసి.. ఊరంతా ఈడ్చుకెళ్లిన అనాగరిక ఘటన సంచలనమైంది. రాజస్థాన్ లోని నాగౌర్ కు చెందిన 32 ఏళ్ల ప్రేమ్ రామ్ మేఘ్ వాల్ కు బాధిత మహిళతో వివాహమైంది.
తాజాగా ఆమె జైసల్మేర్ లో ఉన్న సోదరి ఇంటికి వెళ్లాలనుకుంది. దీనిపై భార్యభర్తలు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర వాగ్వాదం జరిగిన వేళ.. మద్యం తాగి ఉన్న ప్రేమ్ కుమార్ తన భార్యను తాళ్లతో కట్టేసి.. ఆ తాడును బైక్ కు కట్టేశాడు. అనంతరం ఊరంతా ఈడ్చుకెళ్లి రాక్షస ఆనందాన్ని పొందాడు. ఈ దారుణ ఉదంతాన్ని పలువురు వీడియో తీశారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో.. ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భార్య కాళ్లకు తాళ్లు కట్టేసి.. మట్టి రోడ్ మీద ఊరంతా ఈడ్చుకెళ్లిన ఉదంతంపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధిత మహిళ భర్త మీద ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదట. ప్రస్తుతం ఆమె జైసల్మార్ లోని తన సోదరి ఇంట్లో ఉంటోంది. వైరల్ అయిన వీడియో ఆధారంగా నిందితుడ్ని అరెస్టు చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు. అయితే.. ఇంత దారుణ హింసకు గురైనప్పటికీ భర్త మీద సదరు బాధిత భార్య ఫిర్యాదు చేయకపోవటం కొసమెరుపుగా చెబుతున్నారు.