మణిపూర్ నగ్న వీడియో.. రాజస్థాన్ మంత్రిపై వేటు!
ఈ సందర్భంగా రాజస్థాన్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి రాజేంద్ర సింగ్ గుధా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెగల ఘర్షణతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా జరుగుతున్న గొడవల్లో ఇప్పటికే వందలాది మంది మరణించారు. భారీ ఎత్తున హింస, గృహదహనాలు, లూటీలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో మే 4 నాటి ఘటనగా చెప్పబడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
ఇద్దరు మహిళలను నగ్నంగా ఒక గుంపు ఊరేగించడం, వారి శరీర భాగాలను అసభ్యంగా తాకుతూ సెల్ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ సైతం స్పందించారు. యావత్ భారతావని ఈ అమానుష ఘటనపై సిగ్గు పడాలని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ప్రధాన నిందితుడితో సహా నలుగురిని అరెస్టు చేశారు.
కాగా ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది. వివిధ రాష్ట్రాల్లో మహిళలు, ప్రతిపక్ష పార్టీలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరాయి. జాతీయ మహిళా కమిషన్ ఇప్పటికే మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. చర్యలు తీసుకోకపోతే తామే రంగంలోకి దిగుతామని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
మరోవైపు మణిపూర్ ఘటన రాజస్థాన్ లో ఒక మంత్రి పదవి పోవడానికి కారణమైంది. ప్రస్తుతం రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాజస్థాన్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి రాజేంద్ర సింగ్ గుధా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాల గురించి ఆయన రాజస్థాన్ అసెంబ్లీలో మాట్లాడారు. పనిలో పనిగా రాజస్థాన్ లోనూ మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు.
మణిపూర్ గురించి మాట్లాడే ముందు మన రాష్ట్రంలో మహిళల గురించి మాట్లాడితే బాగుంటుందని అన్నారు. మన మహిళల రక్షణకు మనమేం చర్యలు తీసుకున్నామో చర్చించాలన్నారు. అంతేకాకుండా మన ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ లో మహిళలపై అకృత్యాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. మణిపూర్ గురించి మాట్లాడే ముందు మన సంగతి మనం చూసుకోవాలన్నారు.
అంతే... ఆయన ఇలా మాట్లాడిన గంటల వ్యవధిలోనే ఆయన మంత్రి పదవి పోయింది. మంత్రిగా ఉంటూ సొంత ప్రభుత్వాన్ని తప్పుబడుతూ రాజేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్ర సింగ్ ను మంత్రి పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేశారు.
రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి పదవిని పోగొట్టుకున్న రాజేంద్ర సింగ్ గుధా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల సహాయ మంత్రిగా ఉన్నారు. ఈ ఏడాది చివరలో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.