జైల్లో ద‌ర్శ‌న్‌కి 32 ఇంచీల టీవీ ఏర్పాటు

ఇప్పుడు ద‌ర్శ‌న్ ఉంటున్న‌ సెల్‌లో 32 అంగుళాల టెలివిజన్ ని కూడా ఏర్పాటు చేసార‌ని గుట్టు తెలిసింది.

Update: 2024-09-07 10:30 GMT

అభిమాని రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఆరోపణలపై క‌న్న‌డ హీరో జైలుకెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో విచార‌ణ సాగుతుండ‌గానే, అత‌డికి జైలు అధికారుల ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయ‌డం గురించి స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతోంది. ఇంత‌కుముందు అత‌డు జైలులో స‌హ‌చ‌రుల‌తో కుర్చీలో ఠీవిగా కూచుని పొగ తాగుతున్న ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడు ద‌ర్శ‌న్ ఉంటున్న‌ సెల్‌లో 32 అంగుళాల టెలివిజన్ ని కూడా ఏర్పాటు చేసార‌ని గుట్టు తెలిసింది.

శనివారం తెల్లవారుజామున జైలు అధికారులు దీనిని ఆమోదించిన‌ట్టు తెలిసింది. IANS వివ‌రాల‌ ప్రకారం.. దర్శన్ తన కేసు గ‌రించి, జైలు వెలుపల జరిగే పరిణామాలకు సంబంధించిన వార్తలను తెలుసుకోవ‌డానికి టీవీని అభ్యర్థించాడు. బయటి ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి అత‌డు ఆసక్తిగా ఉన్నాడు. గ‌త వారం టీవీ కోసం అభ్యర్థించాడు. తన అభ్యర్థనలో ద‌ర్శ‌న్ తన కేసులో ఛార్జిషీట్‌కు సంబంధించిన వార్తలను వినాల‌ని భావిస్తున్న‌ట్టు పేర్కొన్నాడు.

ఇక‌పోతే జైలులో ద‌ర్శ‌న్ విలాసాల గురించి మీడియాలో చ‌ర్చ‌లు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇదివ‌ర‌కూ రౌడీషీటర్‌ సహా మరో ముగ్గురితో జైలు పచ్చిక బయళ్లలో తిరుగుతున్న ఫోటో వైరల్‌గా మారడంతో దర్శన్‌ను ఇటీవల బళ్లారి జైలుకు తరలించారు. ఫోటోలో దర్శన్ ఒక తోటలో సిగరెట్ - కాఫీ మగ్ పట్టుకుని ఉన్నట్లు క‌నిపించారు. జైలు నుంచి వీడియో కాల్‌లో దర్శన్ మాట్లాడిన మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ‌రోవైపు కన్నడ నటుడు దర్శన్ తూగుదీపతో పాటు మరో 16 మందిపై బెంగళూరు పోలీసులు బుధవారం చార్జిషీట్ దాఖలు చేశారు. 3,991 పేజీల ఛార్జిషీట్ (ఏడు వాల్యూమ్‌లు - 10 ఫైళ్లతో) 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించారు.

దర్శన్‌పై హత్య, కుట్ర, కిడ్నాప్, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి అభియోగాలు మోపారు. ఈ నేరంలో పవిత్ర గౌడ అస‌లు పాత్ర‌ధారి అని ఫోరెన్సిక్ ఆధారాలు ఆమె ప్రమేయాన్ని నిర్ధారించాయని ఛార్జిషీట్ పేర్కొంది.

పవిత్ర గౌడ తన పాదరక్షలతో రేణుకాస్వామిని కొట్టినట్లు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. గౌడ పాదరక్షలపై రేణుకాస్వామి రక్తపు మరకలు ఉన్నాయని, డీఎన్‌ఏ మ్యాచింగ్‌ ద్వారా నిర్ధారించారు. రేణుకాస్వామి హత్యకు పవిత్రే ప్రధాన కారణమని, ఆమె ఇతర నిందితులను ప్రేరేపించి.. వారితో కలిసి కుట్ర చేసి నేరంలో పాల్గొందని విచారణలో రుజువయ్యిందని ఛార్జ్ షీట్ పేర్కొంది.

Tags:    

Similar News