'ఆట్టం' అందుకే జాతీయ ఉత్తమ చిత్రంగా!
దక్షిణాది పరిశ్రమ నుంచి కాన్సెప్ట్ ఆధారంగా సినిమాలు చేసే ఒకే ఒక్క పరిశ్రమ మలయాళ ఇండస్ట్రీ. ప్రయోగాలు అక్కడ కొత్త కాదు
దక్షిణాది పరిశ్రమ నుంచి కాన్సెప్ట్ ఆధారంగా సినిమాలు చేసే ఒకే ఒక్క పరిశ్రమ మలయాళ ఇండస్ట్రీ. ప్రయోగాలు అక్కడ కొత్త కాదు. నిరంతరం ప్రయోగాత్మక చిత్రాలు వస్తూనే ఉంటాయి. స్టార్ హీరోలు సైతం అలాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించడానికి ఎంతో ఇష్టపడతారు. కథ నచ్చితే పాత్రతో సంబంధం లేకుండా పరకాయ ప్రవేశం చేస్తారు. అందుకే మలయాళ పరిశ్రమ అవార్డుల పరిశ్రమగా పేరు గాంచింది.
ఏటా విడుదల చేసే జాతీయ అవార్డుల్లో అగ్ర స్థానం వాళ్లదే అనడంలో అతి శయోక్తి లేదు. కథలో సందేశం..పాత్రల్లో వాస్తవికత..ప్రతీది మిగతా పరిశ్రమల నుంచి మలయాళ ఇండస్ట్రీని వేరు చేస్తోంది. తాజాగా 70వ జాతీయ అవార్డు వేడుకల్లో `ఆట్టం` ఉత్తమ జాతీయ చిత్రంగా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఈసినిమా జాతీయ అవార్డులకంటే ముందే వివిధ అంతర్జాతీయ వేదికలపైనా మెరిసింది.
ది ఇండియన్ ఫిల్మ్ పెస్టివల్ ఆఫ్ లాస్ ఎంజెల్స్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ పెస్టివల్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ వేదికలపై ఆట్టం ప్రదర్శించారు. 1954 లో వచ్చిన 12 యాంగ్రీమెన్ హాలీవుడ్ టెలివిజన్ కార్యక్రమం ఆధారంగా దీన్ని రూపొందించారు. ఈ సినిమా కథేంటి అంటే? కేరళలో ఓ నాటక బృదం. అందులో 12 మంది. అంతా మధ్యతరగతి వారే. అవకాశం వచ్చినప్పుడల్లా వీధి నాటకాలు వేస్తుంటారు.
వీళ్ల నాటకాన్ని మెచ్చిన ఓ విదేశీ బృందం తమ రిసార్స్ట్ లో అతిధ్యం ఇస్తుంది. ఈ సందర్భంగా అంతా మత్తులో తేలుతుంటారు. ఈ సమయంలో ఒకరు కిటీకి పక్కనే పడుకున్న అంజలి తో అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తాడు. ఆ 12 మందిలో ఎవరు ఆ పని చేసారు? ఈ క్రమంలో కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది? మనిషిని అవసరం అనేది ఎంతకు దిగజార్తుంది? అవసరం ఉన్నప్పుడు ఒకలా? అవసరం లేనప్పుడు మరోలా మనిషి ఎందుకు మారతాడు? వంటి అంశాల్ని కథలో చర్చించారు.
ప్రతీ మనిషిలో కొన్ని వ్యక్తిత్వాలుంటాయి. అవి సందర్భాన్ని బట్టి బయట పడుతుంటాయి. నిజమైన క్యారెక్టర్ ఉన్న వాడు ఎలా ఉంటాడు? క్యారెక్టర్ లేని వ్యక్తి ఎలా ఉంటాడు? అన్నది కథలో ఎంతో చక్కగా వివరించారు. కాన్సెప్ట్ చిన్నదే అయినా దర్శకుడు ఆవిష్కరించిన తీరు బాగుంటుంది. అందుకే జాతీయ అవార్డు వరించింది.