అవన్నీ అవాస్తవాలు.. కొట్టి పారేసిన అభిరామ్
అభిరామ్ దగ్గుబాటి పరిచయం అవసరం లేదు. డా.డి.రామానాయుడు మనవడు, నిర్మాత సురేష్ బాబు కుమారుడు, హీరో రానా దగ్గుబాటి సోదరుడిగా అతడు సుపరిచితం.
అభిరామ్ దగ్గుబాటి పరిచయం అవసరం లేదు. డా.డి.రామానాయుడు మనవడు, నిర్మాత సురేష్ బాబు కుమారుడు, హీరో రానా దగ్గుబాటి సోదరుడిగా అతడు సుపరిచితం. అయితే అభిరామ్ దగ్గుబాటి రకరకాల కారణాలతో వార్తల్లో వ్యక్తి అయ్యాడు. తన నేపథ్యం దృష్ట్యా అభిరామ్ నటుడిగాను రంగ ప్రవేశం చేసాడు. తేజ దర్శకత్వం వహించిన అహింస సినిమాతో హీరోగా మారాడు. అయితే అభిరామ్ నటుడిగా కంటే తమ వ్యాపారాలను చూసుకునేవాడు కావాలని ఇంట్లోవాళ్లు భావించినట్టు కథనాలొచ్చాయి. అభిరామ్ కి వ్యాపారాన్ని చూసుకోవడం మంచిదని సురేష్ బాబు సూచించారని మీడియాలో కథనాలొచ్చాయి. అభిరామ్ ఇప్పటికే కొన్ని చిత్రాలకు ప్రొడక్షన్ వైపు పని చేసాడు. తాత రామానాయుడుతో కలిసి పలు చిత్రాలకు పని చేసిన అనుభవం ఉంది. అదే పనిని అతడు కొనసాగిస్తాడని భావించినా కానీ అతడు హీరో అయ్యాడు.
కానీ తొలి చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఇక రకరకాల వివాదాలు అతడికి ఇబ్బందికర పరిస్థితిని తెచ్చినా కానీ ఇప్పుడు అతడు తాను మారిన మనిషిగా ఎంతో పరిణతితో వ్యవహరిస్తున్నాడని కూడా కథనాలొస్తున్నాయి. తాజా ఇంటర్వ్యూలో అతడు నటనకు కొంత గ్యాప్ ఇచ్చినట్టు తెలిపాడు. నటుడిగా రాణించాలంటే దానికి ఇంకా పరిణతి కావాలని అందుకు సమయం కావాలని దర్శకనిర్మాతల్ని కోరినట్టు వెల్లడించాడు. ఈలోగానే తాను వ్యాపారంలో రాణించాలని భావిస్తున్నట్టు కూడా వెల్లడించాడు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు రైటర్స్ కేఫ్ పేరుతో హైదరాబాద్ లో ఒక కేఫ్ ని దగ్గుబాటి అభిరామ్ ప్రారంభించాడు. సినీరంగంలో రాణించాలనుకునే ఔత్సాహిక రచయితలకు అవకాశం కల్పించడం కోసమే తన ప్రయత్నమని అభిరామ్ తెలిపాడు.
జీవితం అంత సులువుగా ఉండదు. తాతయ్య (రామానాయుడు) చనిపోయిన తర్వాత జీవితం విలువ తెలిసింది. ఇకపై బాధ్యతగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నా కాళ్లపై నేను నిలబడాలనుకున్నా. అందుకే ఈ కేఫ్ ప్రారంభించా. నాపై వివాదాలు వచ్చినప్పుడు కుటుంబసభ్యులతో కూర్చొని మాట్లాడిన రోజులున్నాయి.. అని కూడా అభిరామ్ తెలిపారు.
అహింస సినిమాలో నటించాక హీరోగా అవకాశాలొచ్చినా ...నటుడిగా నేనింకా ఎంతో నేర్చుకోవాలని అర్థమైంది. అందుకే ఇంకాస్త సమయం కావాలని దర్శక నిర్మాతలకు చెప్పాను. ప్రేమకథా చిత్రాల్లో అవకాశాలొస్తే నటిస్తాను.. అని కూడా వెల్లడించాడు. కుటుంబసభ్యులు తనని దూరంగా పెట్టారంటూ సాగుతున్న ప్రచారంపైనా స్పందిస్తూ.. అవన్నీ అవాస్తవాలని అభిరామ్ కొట్టిపారేసినట్టు ప్రముఖ తెలుగు మీడియా కథనంలో వెల్లడించింది.