ఫ్యామిలీ ఆర్థిక దివాళాపై ఓపెనైన హీరో
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ బచ్చన్ తన కష్ట కాలం గురించి, తన కుటుంబ ఆర్థిక దివాళా పరిస్థితుల గురించి గుర్తు చేసుకున్నారు.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు అభిషేక్ బచ్చన్. రెఫ్యూజీ అనే సినిమాతో సినీ ఆరంగేట్రం చేసిన అతడు తన తండ్రి లెగసీని ముందుకు తీసుకెళ్లడంలో తడబడ్డాడు. అమితాబ్ మెగాస్టార్ గా అజేయమైన కెరీర్ ని సాగిస్తే, అందుకు భిన్నంగా అభిషేక్ బచ్చన్ కెరీర్ ఆరంభమే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కానీ చివరికి అతడు నిలదొక్కుకోలేక చాలా ఆపసోపాలు పడ్డాడు. ఇటీవల అడపాదడపా మంచి సినిమాల్లో నటిస్తున్నాడు. తన నటనకు పేరొస్తుంది.. కానీ సినిమా బిజినెస్ చేయదు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ బచ్చన్ తన కష్ట కాలం గురించి, తన కుటుంబ ఆర్థిక దివాళా పరిస్థితుల గురించి గుర్తు చేసుకున్నారు. తాను హీరోగా మొదలైనప్పుడు రెండేళ్ల పాటు దర్శకులు ఎవరూ అవకాశాలు ఇవ్వక పక్కన పెట్టేసారని, ఆ కష్ట కాలంలోనే తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరానని అభిషేక్ చెప్పారు. నాన్న అప్పులు చేసి వ్యాపారం ప్రారంభించి దివాళా తీసాక, ఆర్థికంగా మరింత నలిగిపోయామని తెలిపారు. చివరికి బట్టలు కూడా కొనుక్కోలేని దుస్థితి తలెత్తిందని, ఇప్పుడు ఇవన్నీ చెబితే ఆశ్చర్యపోతారని, వింతగా ఉంటుందని కూడా అన్నారు.
ఓసారి ఫిలింఫేర్ వేడుకకు వెళ్లేప్పుడు తనకు బట్టల్లేకపోవడంతో, చాలా ఇబ్బంది పడ్డానని కూడా అభిషేక్ వెల్లడించాడు. ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలి నాన్న? అని తన తండ్రి అమితాబ్ ని ప్రశ్నించానని కూడా అభి గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో బట్టలు ఎరువిచ్చేవారు కాదు.. కొత్తవి కొనుక్కోమని సలహా ఇచ్చేవారు. అపుడెపుడో చెల్లి పెళ్లికి కొనుక్కున్న ఒకే ఒక్క డ్రెస్ ఉంటే ఇలాంటి సమయాల్లో వేసుకునేవాడిని అని కూడా గుర్తు చేసుకున్నాడు. అవార్డుల వేడుకకు జీన్స్, టీషర్ట్స్ లో వెళితే బావుండదు.. గనుక సూట్ వేసుకుని వెళ్లానని నాటి స్మృతుల్ని గుర్తు చేసుకున్నాడు. అభిషేక్ బచ్చన్ నటించిన ఘూమర్ ఇటీవలే విడుదలై క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. ఇందులో అభి నటినకు మంచి పేరొచ్చింది.