గన్ మిస్ ఫైర్.. స్టార్ హీరోకి గాయాలు
బాలీవుడ్ స్టార్ నటుడు గోవిందకు గన్ మిస్ ఫైర్ అవ్వడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.
బాలీవుడ్ స్టార్ నటుడు గోవిందకు గన్ మిస్ ఫైర్ అవ్వడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయన కాలులోకి బుల్లెట్ దూసుకు పోయిందట. వెంటనే వైద్యులు ఆ బుల్లెట్ ను తొలగించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో గోవింద సినిమాలు కాస్త తక్కువ అయ్యాయి. ఇలాంటి వార్తలతో ఆయన మీడియాలో చర్చనీయాంశం అవ్వడం ఆయన ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తుంది. సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున గోవింద ఆరోగ్యం గురించి చర్చ జరుగుతున్న సమయంలో ఆయన సన్నిహితుల నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.
ముంబైలోని ఆయన నివాసం నుంచి కోల్కతాకి వెళ్లేందుకు తన లైసెన్స్ రివాల్వర్ ను క్వారీ చేస్తున్న సమయంలో చేయి జారి కింద పడి మిస్ ఫైర్ అయింది. తుపాకీ కింద పడ్డ వెంటనే పేలి కాలి లోకి బుల్లెట్ దూసుకు పోయిందట. దాంతో వెంటనే వైద్యుల వద్దకు గోవిందను తీసుకు వెళ్లిన ఆయన వ్యక్తిగత సిబ్బంది చికిత్స చేయించారు. ప్రస్తుతం గోవింద ఆరోగ్య పరిస్థితి బాగుందని, రెండు మూడు వారాల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలియజేశారట. లైసెన్స్ రివాల్వర్ అవ్వడంతో పోలీసు కేసు ఏమీ లేదని తెలుస్తోంది.
మూడు దశాబ్దాలుగా బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి అన్ని భాషల ప్రేక్షకుల మన్ననలు పొందిన గోవింద కామెడీ సినిమాలకు మోస్ట్ వాంటెడ్ హీరో అన్నట్లుగా పేరు సొంతం చేసుకున్నారు. 2010 లో వచ్చిన మణిరత్నం రావణ్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను సైతం గోవింద మెప్పించాడు. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగు లో డబ్ అవ్వడంతో ఇక్కడ కూడా ఆయన సుపరిచితుడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే గోవింద కి బుల్లెట్ గాయం అనగానే అంతా అవాక్కయ్యారు.
అభిమానుల ఆందోళన నేపథ్యంలో స్వయంగా గోవింద సైతం మీడియాకు ఒక సందేశంను పంపించారు. ఆ సందేశంలో గోవింద మాట్లాడుతూ... నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, మీ అందరి ప్రేమ వల్ల నేను ఈ ప్రమాదం నుంచి బయట పడ్డాను. కాలు లో దిగిన బుల్లెట్ తొలగించారు అన్నారు. గోవింద కాలు లోకి బుల్లెట్ దిగడం పై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటూ ఫోన్ లో మాట్లాడి పరామర్శించినట్లు తెలుస్తోంది. పలువురు బాలీవుడ్ స్టార్స్ సైతం గోవిందకు ఫోన్ చేసి పరామర్శించినట్లు సమాచారం అందుతోంది.