శ్రీదేవి ఆస్కార్ గెలుచుకు వచ్చేది!
ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిల్ హుస్సేన్ శ్రీదేవితో ఇంగ్లీష్ వింగ్లీష్ కోసం పని చేసిన అనుభవం గురించి చెప్పాడు
అతిలోక సుందరి శ్రీదేవికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఉత్తరాది-దక్షిణాది రెండు చోట్లా అగ్ర కథానాయికగా దశాబ్ధాల పాటు అత్యున్నత హోదాను కొనసాగించిన మేటి కథానాయిక శ్రీదేవి. పరిశ్రమ అగ్ర హీరోలందరి సరసనా నటించింది. అయితే శ్రీదేవి 1990ల చివరలో నటనకు విరామం తీసుకుంది. 2012 డ్రామెడీ 'ఇంగ్లీష్ వింగ్లీష్'తో తిరిగి నటనలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో తన సహనటుడు ఆదిల్ హుస్సేన్ శ్రీదేవితో తన అనుభవాలను వివరించాడు. సెట్‌లో దివంగత నటి శ్రీదేవిని మొదటిసారి కలుసుకున్నానని.. ఒకానొక కారణానికి ఆమె కళ్లలో నీళ్లు తిరిగినట్లు వెల్లడించాడు.
ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిల్ హుస్సేన్ శ్రీదేవితో ఇంగ్లీష్ వింగ్లీష్ కోసం పని చేసిన అనుభవం గురించి చెప్పాడు. ఇది తన మూడవ సినిమా అని, క్లాసిక్ మూవీ 'సద్మా'లో శ్రీదేవి పనితీరు తనపై ఎంతటి ప్రభావం చూపిందో కూడా తెలిపాడు. తాను ఒకటిన్నర రోజులు తినలేకపోయానని చెప్పాడు.''గౌరీ - బాల్కీ ఆమెకు నన్ను పరిచయం చేశారు. సీనియర్ నటి తన పెద్ద అందమైన కళ్లతో నన్ను చూసింది. నేను మాటల సందర్భంలో శ్రీదేవి నటించిన 'సద్మా'ను చూసి ఏమీ తినలేకపోయానని చెప్పాను ... అది విన్న తర్వాత, ఆమె కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి. ఎందుకో తెలియదు. శ్రీదేవి తడికళ్లు నన్ను బాధించాయి. ఆ తర్వాత మేము రిహార్సల్స్‌లో బిజీ అయ్యాము..'' అని ఆదిల్ తెలిపాడు. ఆమె సున్నిత మనస్కురాలు అని, ఆమెను హాలీవుడ్ లెజెండ్ మెరిల్ స్ట్రీప్‌తో పోల్చవచ్చని ఆదిల్ చెప్పాడు. దివంగత నటికి పాశ్చాత్య కథలను ఆఫర్ చేసి ఉంటే ఆస్కార్‌ను గెలుచుకునే అవకాశం ఉండేదని ఆదిల్ అన్నారు.
జాన్వీ కపూర్ - శ్రీదేవి మధ్య పోలికలపైనా ఆదిల్ మాట్లాడాడు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో అతడు ఇలా అన్నాడు, ''జాన్వీ తన తల్లి నుండి చాలా లక్షణాలను వారసత్వంగా పొందిందని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. శ్రీదేవి లెగసీని కొనసాగించడం ఎవరికైనా చాలా పెద్ద పని. కానీ ఎవరైనా చేయగలిగితే అది బహుశా జాన్వీ కావచ్చు. యువనటి కష్టపడి పని చేస్తే చాలు. నిజానికి జాన్వీ చాలా అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తోంది'' అని అన్నారు. ఇంగ్లీషు వింగ్లీష్ చిత్రానికి గౌరీ షిండే దర్శకరచయిత. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే గాక వాణిజ్యపరంగా విజయవంతమైంది.