ఐష్ కార్ యాక్సిడెంట్: ఎర్ర‌బ‌స్సు డ్రైవ‌ర్‌ని చెంప దెబ్బ కొట్టి బౌన్స‌ర్ ఓవ‌రాక్ష‌న్!

దీంతో కార్ పై గీత‌లు ప‌డ్డాయి మిన‌హా అక్క‌డి నుంచి వెళ్లేందుకు ఇబ్బంది ప‌డేంత డ్యామేజీ జ‌ర‌గ‌లేదు.;

Update: 2025-03-27 04:41 GMT
Aishwarya car accident by bus

ముంబైలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ కారును ఎర్ర‌ బస్సు ఢీకొట్టిన ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సంఘటన అభిమానులను కంగారు పెట్టింది. కార్‌లో ఉన్న ఐశ్వ‌ర్యారాయ్ కి ఏమైనా అయిందా? అంటూ ఆరాలు తీసారు. కానీ ఎవ‌రూ ఊహించినంత పెద్ద ప్ర‌మాదం కాదు ఇది. ఐశ్వ‌ర్యారాయ్ అస‌లు ఆ కారులోనే లేర‌ని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాదు.. అస‌లు ఎర్ర‌బ‌స్సు ఐష్ కార్ ని బ‌లంగా ఢీకొట్ట‌లేదు. కేవ‌లం వెన‌క భాగంలో ర‌బ్ చేసింది. దీంతో కార్ పై గీత‌లు ప‌డ్డాయి మిన‌హా అక్క‌డి నుంచి వెళ్లేందుకు ఇబ్బంది ప‌డేంత డ్యామేజీ జ‌ర‌గ‌లేదు. అందుకు సంబంధించిన దృశ్యాలు కూడా వీడియోలో క‌నిపించాయి.

పాపుల‌ర్ మీడియా క‌థ‌నం ప్రకారం.. జుహు తారా రోడ్‌లోని అమితాబ్ బచ్చన్ బంగ్లా సమీపంలో ఐష్ కార్ చిన్న‌పాటి ప్ర‌మాదానికి గురైంది. అయితే ఇది ఘర్షణకు దారితీసింది. ఆ సమయంలో ఒక బౌన్సర్ ఎర్ర‌ బస్సు డ్రైవర్‌ను చెంపదెబ్బ కొట్టినట్లు సమాచారం. తరువాత బంగ్లాలోని సిబ్బంది క్షమాపణలు చెప్పారు. క్ష‌మాప‌ణ చెప్ప‌డంతో ఎర్ర‌ బ‌స్సు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయ‌కూడదని నిర్ణయించుకున్నాడు. అలా ఆ గొడ‌వ స‌ద్ధుమ‌ణిగింది.

బెస్ట్ బస్సు (నంబర్ 8021, రూట్ 231) గా పిలుస్తున్న ఈ ఎర్ర బ‌స్సు జుహు బస్ డిపో నుండి బయలుదేరి అమితాబ్ బచ్చన్ నివాసానికి సమీపంగా వెళుతోంది. దారిలో ఉన్న లగ్జరీ కారు (MH02-GG-5050) ను లైట్‌గా తాకింది. డ్రైవర్ బస్సు ఆపాడు.. కానీ బంగ్లా నుండి ఒక బౌన్సర్ వచ్చి అతడిని చెంపదెబ్బ కొట్టాడని తెలుస్తోంది. డ్రైవర్ 100 కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చినప్పుడు బంగ్లా సూపర్‌వైజర్ బౌన్సర్ చేసిన పనికి క్షమాపణలు చెప్పాడు. క్షమాపణ చెప్పిన తర్వాత డ్రైవర్ చట్టపరమైన చర్య తీసుకోకూడదని నిర్ణయించుకుని శాంటాక్రూజ్ స్టేషన్‌కు వెళ్లాడు. చివ‌రికి ఈ ఎపిసోడ్ లో బౌన్స‌ర్ ఓవ‌రాక్ష‌న్ హైలైట్ అయింది.

ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఇటీవ‌ల మ‌ళ్లీ న‌టిగా బిజీ అవుతున్నారని స‌మాచారం. చివరిసారిగా మణిరత్నం దర్శకత్వం వహించిన రెండు పొన్నియిన్ సెల్వన్ చిత్రాలలో నందిని పాత్ర‌లో కనిపించిన సంగ‌తి తెలిసిందే. ప‌న్నియ‌న్ సెల్వ‌న్ రెండు భాగాలు క‌లిపి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 800 కోట్లకు పైగా వసూలు చేశాయి. 2018 మ్యూజికల్ కామెడీ మూవీ `ఫ్యాన్నీ ఖాన్`లోను న‌టించింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఐష్ త‌న త‌దుప‌రి సినిమాల గురించి ప్ర‌క‌టించాల్సి ఉంది.

ఐష్ కార్ అని ఎలా గుర్తించారు?

ఐశ్వ‌ర్యారాయ్ కార్ యాక్సిడెంట్ అంటూ మీడియాలు చాలా అతి చేయ‌డం ఈ ఘ‌ట‌న‌లో బ‌య‌ట‌ప‌డింది. ఒక మీడియా ఛానల్ క‌థ‌నం ప్రకారం.. ప్ర‌మాద స‌మ‌యంలో ఐశ్వర్య కారు దగ్గర ప్రజలు గుమిగూడారు కానీ అందులో ఐష్ క‌నిపించ‌లేదు. కానీ అది ఐశ్వ‌ర్యారాయ్ కార్ అని ఎలా గుర్తించారు? అంటే....

ఐశ్వర్య రాయ్ బచ్చన్ వాహనాల(కార్ కానీ ఇంకేదైనా) లైసెన్స్ ప్లేట్లపై `5050` అని ఉండటం వల్ల వాటిని గుర్తించడం సులభం అయింది. ముంబైలో ప్రమాదానికి గురైంది ఐశ్వర్య కార్ అని ఫోటోగ్రాఫ‌ర్లు గుర్తించడంలో ఈ ఫ్యాన్సీ నంబర్ సహాయపడింది.

Tags:    

Similar News