భ‌ర్త‌తో విడాకుల పుకార్లకు ఐశ్వర్యరాయ్ చెక్!

ఐష్‌.. ఇటీవల అనేక పబ్లిక్ ఈవెంట్‌లలో రింగ్ లేకుండానే కనిపించింది. రెడ్డిట్‌లోని అభిమానులు ఇదంతా క‌నిపెడుతూనే ఉన్నారు.

Update: 2024-09-23 17:31 GMT

గ‌త కొంత‌కాలంగా ఐశ్వర్య రాయ్ - అభిషేక్ బచ్చన్ జంట విడాకులకు రెడీ అయ్యారంటూ పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఇప్ప‌టికే వారి మ‌ధ్య క‌ల‌త‌లు ఉన్నాయ‌నే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఐష్‌.. అభి ఇద్ద‌రూ విడివిడిగా క‌నిపిస్తుండ‌డం, ఐష్ కేవ‌లం ఆరాధ్య‌తోనే ఔటింగుల‌కు వెళ్ల‌డం చాలా సందేహాలకు తావిచ్చింది. అయితే ఐశ్వర్యరాయ్ త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారాన్ని ఖండిస్తూ ఒక్క మాట‌తో స‌మాధానం చెప్పొచ్చు. కానీ అలా చేయ‌లేదు. తాను మీడియాను ప‌ట్టించుకోను! అనే సిగ్న‌ల్ ఇస్తూ క‌నిపించింది.

ఎట్ట‌కేల‌కు పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్య రాయ్ త‌న‌దైన శైలిలో అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిచ్చింది. తన కుడి చేతికి ఉంగరం ధరించి కనిపించడంతో ఇది తన పెళ్లి ఉంగరం అని అభిమానులు నమ్ముతున్నారు. చాలా రూమ‌ర్ల త‌ర్వాత ఇది గుర్తించదగిన కీల‌క మలుపు. ఐష్‌.. ఇటీవల అనేక పబ్లిక్ ఈవెంట్‌లలో రింగ్ లేకుండానే కనిపించింది. రెడ్డిట్‌లోని అభిమానులు ఇదంతా క‌నిపెడుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ ఉంగరం దేనికి సింబాలిక్? అంటే.. ఈ అంద‌మైన‌ జంట ఇంకా కలిసి ఉన్నట్లు క‌న్ఫామ్ చేస్తోంది.

ప్ర‌తిష్ఠాత్మ‌క పారిస్ వీక్ లో అద్భుతమైన మ‌ల్టీక‌ల‌ర్డ్ కోట్ ధరించి ఐశ్వర్యరాయ్ తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి నడుస్తూ క‌నిపించింది. ఐశ్వ‌ర్యారాయ్ సాధారణ చిక్ పింక్ టీషర్ట్ - జీన్స్ ధరించింది. ఈ ప్రదర్శన ఈవెంట్‌కు చక్కటి వైబ్‌ని తెచ్చిపెట్టింది. తల్లీ-కూతుళ్ల సన్నిహిత బంధానికి ఇది సింబాలిక్‌.

పుకార్లు వెన‌క అస‌లు కార‌ణాలు:

అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల విలాసవంతమైన వివాహానికి ఈ జంట విడివిడిగా రావడం విడాకుల పుకార్లకు ఆజ్యం పోసింది. అభిషేక్ తన కుటుంబంతో రాగా, ఐశ్వర్య ఆరాధ్యతో విడిగా వచ్చింది. అదే సమయంలో అభిషేక్ విడాకుల గురించి ప్రస్తావించిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను లైక్ కొట్టాడు. ఇది ఊహాగానాలను మరింత తీవ్రతరం చేసింది.

ఐశ్వర్య లేదా అభిషేక్ ఈ పుకార్లను నేరుగా ప్రస్తావించక‌పోయినా కానీ, అటువంటి హై-ప్రొఫైల్ ఈవెంట్‌లో పెళ్లి ఉంగరం ధరించాలనే ఐష్‌ నిర్ణయం వారి సంబంధంపై సందేహాలను తొలగించాలనే కోరికను సూచిస్తుంది. ప్రస్తుతానికి పారిస్‌లో ఐశ్వర్య త‌న కుమార్తెతో క‌లిసి రెడ్ కార్పెట్ పై హైలైట్ గా నిలుస్తోంది.

Tags:    

Similar News