ఛాన్సిస్తే బాలీవుడ్‌ని ఏక తాటిపైకి తెస్తాను: అక్షయ్ కుమార్
వారి మధ్య స్నేహం, గొప్ప సత్సంబంధాలున్నాయి. ఒకరి సినిమాలకు ఒకరు మద్ధతుగా నిలుస్తారు.
తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోల ఐక్యత ఇతర పరిశ్రమలకు ఒక స్ఫూర్తి. దక్షిణాది పరిశ్రమల యునిటీ గురించి ఇప్పుడు బాలీవుడ్ లో చర్చ సాగుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్, ప్రభాస్, చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ .. ఇంకా పెద్ద హీరోలంతా ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉంటారు. వారి మధ్య స్నేహం, గొప్ప సత్సంబంధాలున్నాయి. ఒకరి సినిమాలకు ఒకరు మద్ధతుగా నిలుస్తారు. అలాగే ఇరుగు పొరుగు పరిశ్రమ స్టార్లతోను టాలీవుడ్ స్టార్లు సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇతరుల సినిమాలకు ప్రచార సాయానికి కూడా మన స్టార్లు వెనకాడరు. అయితే ఈ మంచి లక్షణాల గురించి బాలీవుడ్ అగ్ర హీరోలు ప్రశంసిస్తున్నారు.
అయితే టాలీవుడ్ తరహాలో హీరోల మధ్య సత్సంబంధాలు బాలీవుడ్ లో కొరవడ్డాయా? అంటే.. అవుననే అభిప్రాయపడ్డారు ఖిలాడీ అక్షయ్ కుమార్. దశాబ్ధాలుగా బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న అక్షయ్ ఈ మాట అన్నారు. దీనిని బట్టి అక్కడ పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. స్టార్ల మధ్య సఖ్యత లేకపోవడం కూడా నెగెటివిటీని పెంచుతుంది. సినిమా కంటెంట్ బావున్నా పది మంది మౌత్ పబ్లిసిటీ మంచిగా చేస్తేనే విజయం దక్కే రోజులివి. అలా కాకుండా శత్రుత్వంతో ఇతరులను టార్గెట్ చేస్తే అలాంటి చోట మేలు జరగదు. ఇదే అభిప్రాయం ఇంచుమించు అక్షయ్ నోటి నుంచి వ్యక్తమైంది.
ఐఎండిబితో ఇంటర్వ్యూలో అక్షయ్ మాట్లాడుతూ.. పరిశ్రమలో ఐక్యత లేకపోవడంపై తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పారు. బాలీవుడ్ కోసం ఏదైనా మార్చే అవకాశం వస్తే మీరు ఏం చేస్తారు? అన్న ప్రశ్నకు అక్షయ్ స్పందించారు. ''మా పరిశ్రమలో ఏదైనా మార్చే అవకాశం నాకు వస్తే, మరింత ఐక్యత కోసం అందరినీ ఓ చోటికి తీసుకొస్తాన''ని అక్షయ్ అన్నారు. మేం ఒకే కుటుంబం లాంటివాళ్ళం కానీ.. కొన్నిసార్లు ఒంటరిగా పని చేస్తున్నామని నాకు అనిపిస్తుంది. మేం విడిపోతున్నాం. కలిసి పని చేస్తే, ఒకరికొకరు మద్దతు ఇస్తే, ఒకరి విజయాలను మరొకరు సెలబ్రేట్ చేసుకుంటే, సవాళ్లను ఎదుర్కొనేందుకు ఒకటిగా కలిసి వస్తే అది పరిశ్రమపై చాలా మంచి ప్రభావాన్ని చూపుతుంది.. అని అన్నారు.
గతంలో ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ యాక్షన్ స్టార్ అజయ్ దేవగన్ కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసారు. దక్షిణాది చిత్ర పరిశ్రమల ఐక్యతను ప్రశంసించిన దేవగన్.. వారంతా ఒకరికోసం ఒకరు కలిసి ఉండటం నాకు నిజంగా నచ్చుతుందని అన్నారు. నిజాయితీగా చెప్పాలంటే ముంబై చిత్ర పరిశ్రమలో ఇది మనకు లేదు! అని వ్యాఖ్యానించారు.
అక్షయ్ నటించిన స్కై ఫోర్స్ ఈనెల 24న థియేటర్లలో విడుదలైంది. రాజకీయాలు, జాతీయ వాదానికి అతీతంగా దేశభక్తి కథతో ఈ సినిమా తెరకెక్కిందన్న ప్రశంసలు కురిసాయి. బాక్సాఫీస్ వద్ద ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.