జిగ్రా టీజర్: ఒక చెల్లి కర్తవ్యం ధైర్యం సాహసం కథతో
ఇప్పుడు వీటన్నిటికీ భిన్నంగా ఆలియా భట్ మరో వైవిధ్యమైన పాత్రలో నటించబోతోంది. వాసన్ బాలా తదుపరి చిత్రం జిగ్రాలో ప్రధాన పాత్రలో నటించనుంది.
కెరీర్ ఆద్యంతం వైవిధ్యమైన పాత్రల్లో అవకాశాలు అందుకోవడం.. వాటితో మెప్పించడం కొందరికే చెల్లుతుంది. ఆ కొందరిలో ఆలియాభట్ పేరు ఉంది. గంగూభాయి కథియావాడి (వేశ్య)గా నటించినా లేదా గల్లీబోయ్ లో ప్రేమికురాలిగా నటించినా ఆలియా నటనలో వైవిధ్యం విలక్షణత యువతరాన్ని ఎంతగానో అలరించాయి. రాజీలో ఎమోషనల్ గాళ్ పాత్రతో రక్తి కట్టించింది. ఆర్.ఆర్.ఆర్ లో సీతగాను ఉద్విగ్నమైన పాత్రలో నటించి మెప్పించింది.
ఇప్పుడు వీటన్నిటికీ భిన్నంగా ఆలియా భట్ మరో వైవిధ్యమైన పాత్రలో నటించబోతోంది. వాసన్ బాలా తదుపరి చిత్రం జిగ్రాలో ప్రధాన పాత్రలో నటించనుంది. కరణ్ జోహార్ తో కలిసి ఈ చిత్రాన్ని ఆలియా స్వయంగా నిర్మిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ఆద్యంతం ఒక ప్రత్యేకమైన టెక్నిక్ తో మనసుపై ఘాడమైన ముద్రను వేసింది. ఒకే ఒక్క డైలాగ్ తో టీజర్ ని ముగించారు. ఆ డైలాగ్ లోనే థీమ్ దాగి ఉంది.
ఒక సింపుల్ వీడియోలో అలియా భట్ అలా నగరంలో రోడ్ పై వెళుతూ ఓచోట ఆగుతుంది. బ్యాక్‌ప్యాక్ ని భుజానికి తగిలించి అలా వీధిలో నిలబడిన ఆలియా లుక్ ఒక కాలేజ్ అమ్మాయిని తలపిస్తోంది. ఒక ఉద్విగ్నమైన పండుగ వాతావరణంలో తన సోదరుడికి రాఖీని కట్టే చెల్లెలి బాధ్యతను ఈ డైలాగ్ లో ఆవిష్కరించారు. తన సోదరుడికి ఎలాంటి హాని జరగకుండా కాపాడటం తన కర్తవ్యమని, సోదరుడిని అన్నివిధాలా కాపాడతానని ప్రతిజ్ఞ చేస్తుంది. అన్నా చెల్లెళ్ల ప్రేమ.. అనుబంధం.. ధైర్యం నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠ కలిగించే చిత్రమిది. దేబాశిష్ ఇరెంగ్‌బామ్ ఈ చిత్రానికి రచయిత. తారాగణం వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అలియా భట్, సోమెన్ మిశ్రా సంయుక్తంగా నిర్మించారు. అచింత్ ఠక్కర్ సంగీతం అందిస్తున్నారు. స్వప్నిల్ ఎస్. సోనావానే ఛాయాగ్రాహకుడు. జిగ్రా 27 సెప్టెంబర్ 2024న విడుదలవుతుంది.