ఏజ్ బార్ యువకుడిని ఆ ఒక్కటీ అడగొద్దు: అల్లరి నరేష్
మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో హీరో అల్లరి నరేష్ విలేకరులు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
అల్లరి నరేష్ నటించిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. స్టార్ రైటర్ అబ్బూరి రవి చిత్రానికి డైలాగ్స్ అందించారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో హీరో అల్లరి నరేష్ విలేకరులు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
ఈ సినిమాకి నాన్నగారి క్లాసిక్ సినిమా 'ఆ ఒక్కటీ అడక్కు' టైటిల్ పెట్టడం ఎలా అనిపించింది ?
-ఖచ్చితంగా బరువుగా వుంటుంది. ఆ సినిమాకి, దీనికి పోలిక పెడతారేమో అని కాస్త ఒత్తిడిగా అనిపించింది. అయితే ఆ సినిమాకి, ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. రకరకాల పేర్లు అనుకున్నప్పుడు.. ఒక సందర్భంలో సడన్ గా 'ఆ ఒక్కటీ అడక్కు'అని వచ్చింది. నిజానికి ఈ కథకి ఈ టైటిల్ యాప్ట్. ఇందులో హీరోకి ఏజ్ బార్ అయినప్పటికీ పెళ్లి కాదు. అందరూ తనని పెళ్లి ఎప్పుడు, పప్పు అన్నం ఎప్పుడు పెడుతున్నావ్ అంటే చిరాకుతో చెప్పే డైలాగ్ 'ఆ ఒక్కటీ అడక్కు'.
మళ్ళీ కామెడీ సబ్జెక్ట్ చేయడానికి కారణం ?
-అన్నీ సమాంతరంగా చేయాలనే అలోచనతోనే వున్నాను. నాంది, మారేడుమిల్లి, ఉగ్రం, నా సామిరంగా దేనికవే భిన్నమైన సినిమాలు. కామెడీ కథలు బాగా నచ్చితేనే చేయాలని భావించాను. ప్రేక్షుకుల అభిరుచి కూడా మారింది. కథలో కామెడీ వుంటేనే ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి సమయంలో మల్లి గారు ఈ కథతో వచ్చారు. నాకు చాలా నచ్చింది. పెళ్లి ని ఇప్పటివరకూ ఫన్ తో చూపించారు. ఐతే ఇందులో దాని వెనుక ఒక సమస్య, స్కామ్, పెళ్లి చుట్టూ జరుగుతున్న కోట్ల వ్యాపారంను వినోదాత్మకంగా చూపిస్తూనే మంచి సందేశం వుంటుంది. సినిమా అంతా ఎంటర్ టైనర్ గా వుంటుంది. చివరి రెండు రీళ్లలో ఎమోషనల్ టచ్ వుంటుంది.
కొత్త దర్శకుడు ఈ కథ చెప్పినపుడు ఎలా అనిపించింది?
-దర్శకుడు మల్లి ఈ కథ చెప్పినపుడు అందులోని పాయింట్ కి చాలా కనెక్ట్ అయ్యాను. నిజజీవితంలో జరిగిన చాలా సంఘటనలని పరిశోధించే ఈ కథని తయారు చేశారు. కథలో సహజత్వం వుట్టిపడుతుంది. కామెడీ లోనే చక్కని సందేశం వుంది. ప్రస్తుతం పెళ్లి చుట్టూ ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయనేది ఇందులో చూపించిన తీరు ప్రేక్షకులని ఆలోజింపచేసేలా వుంటుంది. మల్లి ఈ కథని చాలా బలంగా రాసుకున్నారు. దీనికి రచయితగా అబ్బూరి రవిగారు తోడయ్యారు. కామెడీ, ఎమోషన్ అద్భుతంగా రాశారు.
కామెడీ, మెసేజ్ ని ఎలా బ్యాలెన్స్ చేశారు ?
-సినిమా ఆద్యంతం నవ్వులు పంచినప్పటికీ చివర్లో ఎదో మంచి సందేశం వుండాలి. కితకితలు కామెడీ సినిమానే. కానీ అందులో చూపించిన 'ఇన్నర్ బ్యూటీ' సందేశం ప్రేక్షకులకు అద్భుతంగా కనెక్ట్ అయ్యింది. నాన్నగారి సినిమాల్లో కూడా అంతర్లీనంగా మంచి సందేశం వుంటుంది. ఈ సినిమాలో చూపించే సందేశం కూడా ప్రేక్షకులని కదిలించేలా వుంటుంది.
హీరోయిన్ ఫారియా అబ్దుల్లా గురించి ?
-మల్లి గారు ఈ కథ అనుకున్నప్పుడే హీరోయిన్ ఫారియా అయితే జోడి బావుంటుందని అనుకున్నారు. ఫారియాకి కథ చెప్పడం, కథ నచ్చి చేయడం జరిగింది. తను సెట్స్ కి వచ్చిన తర్వాత అందరూ మా ఇద్దరి హైట్ గురించి మాట్లాడుకున్నారు. తొలిసారి యాపిల్ బాక్స్ ఎత్తు లేకుండా చేసిన సినిమా ఇది( నవ్వుతూ). తను అద్భుతమైన నటి. మంచి డ్యాన్సర్. చిన్న చిన్న కౌంటర్లు కామికల్ గా ఇచ్చిన తీరు నన్ను సర్ ప్రైజ్ చేసింది. తనకి మంచి కామెడీ సెన్స్ వుంది. మా జోడి కూడా చాలా బావుటుంది.
చాలా రోజుల తర్వాత కామెడీ సినిమా చేయడం ఎలా అనిపించింది ?
-కామెడీ చేసి నవ్వించడం చాలా కష్టం. ఈ మధ్య కొంచెం ఫైట్లు చేసి బెండు తీరిపోయింది ( నవ్వుతూ). మళ్ళీ కామెడీ చేయడం చాలా హ్యాపీగా వుంది. మళ్ళీ కామెడీ సినిమా చేయడం హోమ్ గ్రౌండ్ లో ఆడినట్లుగా వుంది(నవ్వుతూ). కామెడీకి ఇదివరకటికంటే ఆదరణ పెరిగింది. సామజవరగమన, డీజే టిల్లు లాంటి హ్యుమర్ వున్న సినిమాలు బాగా వర్క్ అవుట్ అవుతున్నాయి. కంటెంట్, హ్యుమర్ బావుంటే ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు.
నాన్న గారి 'ఆ ఒక్కటీ అడక్కు'లో బాల నటుడిగా చేశారు కదా మళ్ళీ ఆ టైటిల్ తో హీరోగా చేయడం ఎలా అనిపించింది ?
-సమ్మర్ హాలీడేస్ కి నాన్నగారు షూటింగ్ లో వుంటే వైజాగ్ వెళ్లాను. అప్పుడు ఏమీ తెలీదు. నటించమంటే చేసేశాను. తర్వాత సినిమాల్లోకి వచ్చాను. ఈ రోజు అదే టైటిల్ తో సినిమా చేయడం ఫుల్ సర్కిల్ లా అనిపించింది. ఇప్పుడు చాల మంది అది ఈవీవీ గారి సూపర్ హిట్ టైటిల్ తెలుసా?అంటే.. నాకే కొంచెం టెన్షన్ వస్తుంది. అయితే టైటిల్ తప్పా ఆ సినిమాకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇందులో హీరో క్యారెక్టర్ చాలా గమ్మత్తుగా వుంటుంది. మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్ లో పని చేస్తుంటాడు. అందరికీ పెళ్లిళ్ళు చేస్తుంటాడు కానీ తనకి పెళ్లి కాదు. అది ఇంకా ఫస్ట్రేషన్ (నవ్వుతూ)
గతంలో మీ నుంచి ఏడాదికి కనీసం మూడు సినిమాలు ఉండేవి ?
-ఈసారి వస్తాయి అండీ. ఇప్పటికే నా సామిరంగ వచ్చింది. మే3న ఈ సినిమా వస్తుంది. బచ్చల మల్లి జులై లేదా ఆగస్ట్ లో రావచ్చు. డిసెంబర్ లో మరో సినిమా వచ్చే అవకాశం వుంది.
డైరెక్షన్ ఎప్పుడు చేస్తారు ?
-ప్రస్తుతం నా ద్రుష్టి నటనపైనే వుంది. దర్శకత్వం చేసే ఆలోచనలు ప్రస్తుతానికి లేవు. అందరూ సుదిగాడు 2 కోసం అడుగుతున్నారు. ఓ ఐడియా వచ్చింది. అది రాస్తున్నా.
'పెళ్లి' అనేది యూనివర్సల్ పాయింట్ కదా.. ఈ సినిమా మిగతా భాషల్లో చేసే ఆలోచన ఉందా ?
-నిజానికి రాజీవ్ గారికి ఈ ఆలోచన వుంది. బాలీవుడ్ లో చేయాలని అనుకున్నారు. అయితే ఇక్కడ ఫ్రూవ్ చేసుకుకొని అక్కడ చేసే అవకాశం వుంది.
నిర్మాత రాజీవ్ గురించి ?
-రాజీవ్ గారు చాలా మంచి నిర్మాత. ఆయనకి యానిమేషన్ కంపెనీ వుంది. ఛోటా భీమ్ తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఇది ఆయనకు తొలి సినిమా అయినప్పటికీ సినిమాపై ఆయనకు పూర్తి అవగాహన వుంది. చాలా పాషన్ వున్న నిర్మాత. అలాంటి నిర్మాత మన ఇండస్ట్రీకి అవసరం. అలాంటి నిర్మాతకు సక్సెస్ వస్తే నాలుగు సినిమాలు చేస్తారు. నాలుగు కుటుంబాలు బ్రతుకుతాయి.
జామీ లివర్ గురించి ?
-యంగ్ కోవై సరళ లాంటి పాత్ర కావాలన్నపుడు జామి లివర్ ని ఎంపిక చేశాం. తను అద్భుతమైన ఆర్టిస్ట్. తను సోషల్ మీడియాలో చేసే కామెడీ వీడియోలు అదిరిపోతాయి. ఈ సినిమా తనకి కలిసొచ్చి తెలుగులో మరిన్ని చిత్రాలు చేస్తుందని ఆశిస్తున్నాను.
ఈ వారం మీ సినిమాతో పాటు దాదాపు నాలుగు సినిమాలు వస్తాయి కదా.. దిన్ని ఎలా చూస్తారు ?
-సమ్మర్ సినిమాల సీజన్. ఈ సమ్మర్ లో పెద్దగా సినిమాలు రాలేదనే చెప్పాలి. 'ఆ ఒక్కటీ అడక్కు' మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఫ్యామిలీ అంతా చూసి సరదాగా ఎంజాయ్ చేసే సినిమా. మంచి సీజన్ లో వస్తుంది. అన్ని సినిమాలు బాగా ఆడాలి. అందులో నా సినిమా కూడా వుండాలని కోరుకుంటున్నాను.
ఈవీవీ బ్యానర్ మళ్ళీ ఎప్పుడు మొదలుపెడతారా?
-కథలు వింటున్నా అండీ. ఆ బ్యానర్ లో చేయదగ్గ కథ కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాను. 'ఎవడిగోల వాడిది' లాంటి సినిమా చేయాలని నా కోరిక.
ఇంకా ఎలాంటి జోనర్ సినిమాలు చేయాలని వుంది ?
-అన్నీ రకాలు సినిమాలు చేయాలి. డార్క్ హ్యుమర్ వున్న కథలు చేయడానికి కూడా ఇష్టపడతాను. ప్రేక్షకులు ఇప్పుడు కథలో నుంచి పుట్టిన కామెడీని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి కథలపై ద్రుష్టిపెడుతున్నాను. అలాగే 'పుష్పక విమానం' లాంటి మూకీ సినిమా చేయాలని వుంది.అలాగే 'జోకర్' లాంటి క్యారెక్టర్ చేయాలని వుంది. మనం నవ్వుతుంటే ఆడియన్స్ భయపడాలి.
ఏ హీరోలతో కలిసి పని చేయాలని వుంది ?
వెంకటేష్ గారితో కలసి చేయాలని వుంది. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. ఆయన నేను కలసి ఫుల్ లెంత్ కామెడీ సినిమా చేస్తే బావుటుందని భావిస్తున్నాను. అలాగే అందరి హీరోలతో చేయాలని వుంటుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారితో ఒక్క సీన్ అయిన షేర్ చేసుకోవాలని వుంటుంది.
కొత్తగా చేస్తున్న సినిమాలు ?
-బచ్చల మల్లి షూటింగ్ జరుగుతోంది. మరో రెండు ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యాను. త్వరలోనే చెబుతాను.