జాతీయ అవార్డ్ అందుకున్న తొలి తెలుగు నటుడికి దీవెనలు
అల్లు అర్జున్ తన తండ్రిని కౌగిలించుకుని, ముద్దు ద్వారా తన ప్రేమను వ్యక్తపరచడమే కాకుండా ఎంతో వినయంగా తన తండ్రి పాదాలను తాకి ఆశీర్వాదాలను కోరుతున్న ఈ వీడియో అంతర్జాలంలో సునామీ సృష్టిస్తోంది.
100ఏళ్లు పైబడిన భారతీయ సినిమా చరిత్రలో 90ఏళ్లు పైగానే తెలుగు సినిమా మనుగడ సాగించింది. ఎంతో గొప్ప కీర్తిని ఘడించి ఎత్తులకు ఎదిగింది. ఇది మహోన్నతమైన ఎదుగుదల. అసాధారణమైన ప్రజ్ఞకు సింబాలిక్. అయితే ఇన్ని సంవత్సరాల్లో ఎందరో లెజెండరీ స్టార్లు తెలుగు సినీపరిశ్రమను ఏలారు. వందలాది సినిమాలు చేసారు. ఇండస్ట్రీని శాసించారు.. కానీ ఎవరూ సాధించలేనిది ఈరోజు అల్లు అర్జున్ సాధించాడు. నిజానికి లెజెండరీ నటులతో బన్నీని పోల్చడానికి ఇది సరైన సమయం కాదు. కానీ అతడు తనకంటూ ఒక యూనిక్ స్టైల్ ని ఆపాదించుకుని మేటి హీరోగా ఎదిగాడనేది సముచితం. ఇంతింతై అన్న చందంగా నేడు టాలీవుడ్ నుంచి ఫైనెస్ట్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. జాతీయ స్థాయిలో ఇప్పుడు బన్నీకి మార్కెట్ ఉంది. పుష్పరాజ్ గా అతడు సాధించుకున్న ఘనత ఇది.
పుష్ప: ది రైజ్ లో అతడి అత్యుత్తమ నటనకు 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో గౌరవనీయమైన 'ఉత్తమ నటుడు' అవార్డు దక్కింది. ఈ శుభతరుణంలో బన్నీలోని ఉద్వేగం దాగలేదు. అతడు కన్నీటిపర్యంతమయ్యాడు. ఆనందభాష్పాలు అతడి కళ్లలోంచి ఉప్పొంగాయి. తన శ్రమకు తగ్గ ప్రతిఫలమిది. తనను జాతీయ స్థాయిలో గుర్తించారు. ఇలాంటి సమయంలో తన అజేయమైన విజయాల వెనక ఉన్న తన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ ని అతడు ఘాడంగా హత్తుకున్నాడు. ప్రేమగా చిక్ పై ఒక పెక్ ఇచ్చాడు. బహిరంగంగా తన ఎమోషన్ ని బన్ని ప్రదర్శించాడు. ఇక ఇదే వేదికగా తన భార్య స్నేహకు ఒక హగ్ ఇచ్చిన బన్ని.. తన వారసులు అర్హ-అయాన్ లను హగ్ చేసుకుని ఈ సెలబ్రేషన్ ని పతాక స్థాయికి చేర్చాడు. ఇక తన దర్శకుడు సుకుమార్ ని కనీసం కొన్ని నిమిషాల పాటు హగ్ లో టైటప్ చేసాడంటే అతడు సుక్కూని ఎంతగా ప్రేమిస్తాడో అభిమానిస్తాడో అర్థం చేసుకోవచ్చు.
అమితానందంలో అల్లు అర్జున్ తన తండ్రిని కౌగిలించుకుని, ముద్దు ద్వారా తన ప్రేమను వ్యక్తపరచడమే కాకుండా ఎంతో వినయంగా తన తండ్రి పాదాలను తాకి ఆశీర్వాదాలను కోరుతున్న ఈ వీడియో అంతర్జాలంలో సునామీ సృష్టిస్తోంది. పరిశ్రమలో అపారమైన అనుభవం ఉన్న అల్లు అరవింద్ ఈరోజు ఒక జాతీయ ఉత్తమ నటుడికి తండ్రి. ఇక తన తండ్రి తనకు ఎంతో ఇచ్చాడని ఇంత గొప్ప స్టాటస్ ని ఇచ్చి ఈరోజు తనను హీరోగా నిలబెట్టాడని బన్ని చాలా సందర్భాల్లో వేదికలపైనే మురిసిపోయాడు. తాను తన బాధ్యతల్ని నెరవేరుస్తానని హీరోగా సత్తా చాటుతానని కూడా అన్నాడు. ఇప్పుడు ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకుని మనసుల్ని గెలుచుకున్నాడు. తన తండ్రి గారితో అరుదైన ఆనంద క్షణాలకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అభిమానులు అల్లు అర్జున్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు. పుష్ప 1 తో జాతీయ పురస్కారం దక్కించుకున్నాడు. పుష్ప 2తో అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ క్రిటిక్స్- గోల్డెన్ గ్లోబ్స్ పురస్కారాలు అందుకుంటాడేమో చూడాలి.