#మీటూ వేవ్.. ఆమెకు అనసూయ మద్ధతు
పలువురు సోషల్ మీడియా ద్వారా బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. 21 ఏళ్ల అతడి సహాయకురాలు ఆరోపణలు చేయడంతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఆరోపణలపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. పలువురు సోషల్ మీడియా ద్వారా బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నటి పూనమ్ కౌర్, గాయని చిన్మయి, ఇతర టాలీవుడ్ తారలు బాధితురాలికి మద్దతుగా నిలిచారు.
తాజాగా నటి కం యాంకర్ అనసూయ కూడా బాధితురాలికి సంఘీభావం తెలుపుతూ.. జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ వివాదంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ``మహిళలకు సానుభూతి అవసరం లేదు. అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం వారికి ఉండాలి. మీకు లేదా మీకు తెలిసిన వారికి అలాంటి వేధింపులు ఎదురైతే మాట్లాడండి. మీకు మద్దతు లభిస్తుంది. నేను బాధితురాలితో కలిసి పనిచేశాను. పుష్ప సెట్స్‌లో ఆమెను రెండు మూడు సార్లు చూశాను, చాలా ప్రతిభావంతురాలు. ఈ పరిస్థితి ఆమె సామర్థ్యాన్ని తగ్గించలేదు. అయితే మౌనంగా బాధపడటం వల్ల ప్రయోజనం ఉండదు. నా కార్యాలయంలో ఎవరైనా అలాంటి సవాళ్లను ఎదుర్కొంటే, నేను ఎల్లప్పుడూ స్పందిస్తాను. ఈ కేసులో బాధితురాలికి న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఫిల్మ్ ఛాంబర్ - WIC సభ్యులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పరిశ్రమలో ఏ స్త్రీకి మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆశిస్తున్నాను`` అని అనసూయ రాశారు.
వెతుకుతున్న పోలీస్:
కొరియోగ్రాఫర్ పై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు పరారీలో ఉన్న కొరియోగ్రాఫర్ కోసం గాలింపు ప్రారంభించారని కథనాలొస్తున్నాయి. ఫిర్యాదు అందిన అనంతరం అతడు అందుబాటులో లేరని సమాచారం. అతడి ఆచూకీ తెలుసుకున్న నార్సింగి పోలీసులు నెల్లూరుకు ఒక బృందాన్ని పంపించారని, అతడికి నోటీసులు జారీ చేశారని, త్వరలో అరెస్ట్ జరిగే అవకాశం ఉందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.