నవదీప్ ముందస్తు బెయిల్.. ఎందుకంటే?
టాలీవుడ్లో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ పేరు చర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్లో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ పేరు చర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తనను ఏ-29గా పేర్కొన్న పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు నవదీప్. అయితే ఆ పిటిషన్ విచారణను మంగళవారానికి వాయిదా వేసిన న్యాయస్థానం.. ఈనెల 19వరకు నవదీప్‌ను అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ పిటిషన్ పై కౌంటరు దాఖలు చేయాలని పోలీసులకు నోటీసులు కూడా జారీ చేసింది.
అయితే కోర్టుకు వెళ్లిన నవీదీప్.. అక్కడ ఈ విధంగా తన విన్నపాన్ని తెలిపారు. తనపై పోలీసులు చేసిన వ్యాఖ్యల్ని, అలాగే మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఓ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం, నిందితుడి వద్ద ఉన్న ఒక మెసేజ్ ఆధారంగా తనను కేసులో ఇరికించారని, తాను మాదకద్రవ్యాలను వినియోగించలేదన్నారు. పైగా తాను ఎక్కడికీ పారిపోలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానని స్పష్టత ఇచ్చారు.
"నేను డ్రగ్స్ వినియోగించలేదు. ఆ ఆరోపణలను నిరూపించడానికి మెడికల్ ఎవిడెన్స్ కూడా ఏమీ లేవు. సరైన విచారణ లేకుండానే, మీడియాలో నాపై తప్పుడు సమాచారం ప్రచారం అవుతోంది. ఈ ప్రచారం నా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. అలాగే నా కెరీర్‌కు నష్టం కలిగిస్తుంది. ఈ కేసులో నన్ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను." అని నవదీప్ తన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. కోర్టుకు ఆయనిచ్చిన స్టేట్మెంట్ బట్టి చూస్తే.. నవదీప్ తన కెరీర్‌పై ఎటువంటి ఎఫెక్ట్ ఉండకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ అప్లై చేసినట్లు అర్థమవుతోంది. చూడాలి మరి 19వ తేదీ విచారణలో నవదీప్‌కు అనుకూలంగా తీర్పు వస్తుందో లేదా అనేది.
ఇకపోతే నవదీప్ చివరిసారిగా 2021లో మోసగాళ్లు చిత్రంలో కనిపించారు. రీసెంట్గా వెబ్‌సిరీస్‌లో నటించారు. ఈ మధ్యే న్యూస్ సెన్స్, మాయా బజార్ ఫర్ సేల్ వంటి సిరీస్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈగల్, లవ్ మౌలి అనే చిత్రాల్లో నటిస్తున్నారు. లవ్ మౌలి ప్రమోషన్లు కూడా తాజాగా మొదలైయ్యాయి. ఇప్పుడు కోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో ఆయన తన సినిమా ప్రచారాన్ని సాఫీగా చేసుకోవచ్చు.
మరోవైపు ఈ డ్రగ్స్ కేసు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేసి మరీ కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే కేసులో నిందుతులుగా ఉన్న వారికి అదుపులోకి తీసుకుంటామని చెబుతున్నారు.