'సీతా పయనం'.. విశ్వక్ తో ఆగిపోయిన సినిమా ఇదేనా?
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా చాలా గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పెట్టబోతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో ‘సీతా పయనం’ అనే కొత్త చిత్రాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా చాలా గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పెట్టబోతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో ‘సీతా పయనం’ అనే కొత్త చిత్రాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇదొక ట్రైలింగ్విల్ మూవీ. ఒకేసారి తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో తెరకెక్కించనున్నారు. శ్రీరామ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుంది. ఇది మీ హృదయాలను తాకే బ్యూటిఫుల్ ఎమోషనల్ జర్నీ' అని మేకర్స్ పేర్కొన్నారు. మూడు భాషల్లోనూ టైటిల్ పోస్టర్లు రిలీజ్ చేసారు. ఇందులో హీరో హీరోయిన్లుగా ఎవరు నటిస్తారనేది తెలియలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.
1981లో 'సింహాద మరి సైన్య' అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అర్జున్.. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించారు. 'మా పల్లెలో గోపాలుడు'(1985) చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేసారు. తన యాక్టింగ్ తో, రియల్ స్టంట్స్ తో టాలీవుడ్ లోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు.. యాక్షన్ కింగ్ గా ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, గాయకుడిగానూ అలరించారు.
అర్జున్ సర్జా 1992లో 'సేవగన్' అనే తమిళ్ మూవీతో డైరెక్టర్ గా మారారు. ఇప్పటి వరకూ 12 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2014లో 'జై హింద్' మూవీకి సీక్వెల్ గా 'జై హింద్ 2' అనే త్రిభాషా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది తెలుగులో 'అభిమన్యు' పేరుతో రిలీజ్ అయింది. చివరగా ఆయన దర్శకత్వంలో 2018లో 'సొల్లి విడవ' అనే ఓ తమిళ సినిమా వచ్చింది. ఆ తర్వాత అర్జున్ క్యారక్టర్ ఆర్టిసుగా బిజీ అయిపోయారు. ఆరేళ్ళ విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు ‘సీతా పయనం’ సినిమాతో దర్శకత్వ బాధ్యతలు చేపట్టడానికి రెడీ అయ్యారు. అయితే గతంలో విశ్వక్ సేన్ హీరోగా అర్జున్ ప్రకటించిన సినిమా ఇదేనా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
అర్జున్ దర్శకత్వంలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ జోడీగా ఓ సినిమా ప్లాన్ చేశారు. పవన్ కళ్యాణ్ తో సహా టాలీవుడ్ లోనే సినీ ప్రముఖులందరినీ అతిథిలుగా పిలిచి, గ్రాండ్ గా సినిమాని ప్రారంభించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దర్శక హీరోల మధ్య తలెత్తిన అభిప్రాయాలు భేదాల కారణంగా ఆగిపోయింది. దీంతో అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి.. విశ్వక్ కమిట్‌మెంట్ లేని యాక్టర్ అని, అతన్ని తన సినిమా నుంచి తొలగించానని, అతనితో సినిమాలు చేసే నిర్మాతలు ఆలోచించుకోవాలని అనడం అప్పట్లో కొన్నాళ్లపాటు హాట్ టాపిక్ గా నడిచింది.
అర్జున్ సంచలన ఆరోపణలపై హీరో విశ్వక్ సేన్ కూడా స్పందించాడు. తనంత కమిటెడ్ ప్రొఫెషనల్ నటుడు ఉండడని, కళ్లు మూసుకుని కాపురం చేయలేకనే తాను ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు. విశ్వక్ ప్లేస్ లో మరో హీరోని తీసుకొని సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్తానని అర్జున్ ఆ సమయంలో ప్రకటించారు. ఒకరిద్దరు టాలీవుడ్ హీరోల పేర్లు తెర మీదకు వచ్చాయి కానీ, ఏదీ నిజం లేదు. అసలు ఆ ప్రాజెక్ట్ గురించి ఊసేలేదు. అయితే ఇన్నాళ్లకు మళ్ళీ అర్జున్ తన డైరెక్షన్ లో ‘సీతా పయనం’ చిత్రాన్ని అనౌన్స్ చేయడంతో.. విశ్వక్ సేన్ తో క్యాన్సిల్ అయిన సినిమా ఇదేనా? లేదా మరేదైనా కొత్త కథతో చేస్తున్న సినిమానా? అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. మరి త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.