మూవీ రివ్యూ: : '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'

Update: 2021-01-29 09:16 GMT
చిత్రం ; ''30 రోజుల్లో ప్రేమించడం ఎలా'

నటీనటులు: ప్రదీప్ మాచిరాజు-అమృత అయ్యర్-పోసాని కృష్ణమురళి-శరణ్య ప్రదీప్-హేమ-శుభలేఖ సుధాకర్-జబర్దస్త్ మహేష్-వైవా హర్ష-భద్రం తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర
నిర్మాత: ఎస్వీ బాబు
రచన-దర్శకత్వం: ఫణి ప్రదీప్ (మున్నా)

యాంకర్ గా మంచి స్థాయిని అందుకున్న ప్రదీప్ మాచిరాజు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ కూడా చేశాడు. అతను హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. గత ఏడాది మార్చిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడి.. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి హీరోగా ప్రదీప్ కు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నిచ్చేలా ఉందో చూద్దాం పదండి.

కథ:

అర్జున్ (ప్రదీప్ మాచిరాజు).. అక్షర (అమృత అయ్యర్) ఒకే కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులు. పక్క పక్క ఇళ్లల్లోనే ఉండే వీళ్లిద్దరికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. పరస్పరం చూడగానే చిరాకు పడిపోతుంటారు. అలాంటి వీళ్లిద్దరూ కొన్ని అనూహ్య పరిస్థితుల మధ్య ఒకరి శరీరంలోకి ఒకరు ప్రవేశించాల్సిన పరిస్థితి వస్తుంది. గత జన్మలో ప్రేమికులై ఉండి అర్ధంతరంగా ప్రాణాలు వదిలిన ఈ జంట.. మళ్లీ ఈ జన్మలో కలవడం కోసమే ఇలా జరిగిందని  ఓ స్వామీజీ సెలవిస్తాడు. ఐతే ఒకరినొకరు అసహ్యించుకునే అర్జున్.. అక్షర ఎలా ప్రేమలో పడి తిరిగి తమ తమ శరీరాల్లోకి వెళ్లారన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

హాలీవుడ్లో ఏదైనా కొత్త కాన్సెప్ట్ తో ఓ సినిమా వస్తే చడీచప్పుడు లేకుండా ఆ ప్లాట్ ఎత్తేయడం.. దానికి మనవైన పాత్రలు.. కథనం జోడించి వడ్డించడం మన దర్శకులకు అలవాటే. కొత్త దర్శకుడు మున్నా కూడా అదే పని చేశాడు. ‘ఇట్స్ ఎ బాయ్ గర్ల్ థింగ్’ అనే హాలీవుడ్ సినిమా కాన్సెప్ట్ తీసుకున్న అతను.. అంతటితో ఆగకుండా తెలుగులో వచ్చిన ‘ప్రాణం’.. ‘ఆనందం’ లాంటి సినిమాల నుంచి కూడా స్ఫూర్తి పొందాడు. అన్నీ కలిపి ఒక కిచిడీ సినిమాను తయారు చేశాడు. ఐతే ప్లాట్ ఎక్కడిదన్నది పక్కన పెడితే.. ఒకరిని ఒకరు ద్వేషించుకున్న అబ్బాయి, అమ్మాయి ఒకరి శరీరాల్లోకి ఒకరు ప్రవేశించడం.. తమవి కాని శరీరాలతో అవతలి వాళ్లను ఇబ్బంది పెట్టడం అనే కాన్సెప్ట్ ఆసక్తికరంగానే అనిపిస్తుంది. దీన్నుంచి బోలెడంత వినోదం పండించొచ్చు. థ్రిల్ చేయొచ్చు. కానీ ఆ అవకాశాన్ని మున్నా వాడుకోలేదు. రొటీన్ ట్రీట్మెంట్ తో ఈ కాన్సెప్ట్ మీద అసలు ఆసక్తే లేకుండా చేశాడు. అనవసరపు హడావుడి.. అరిగిపోయిన కాలేజీ సన్నివేశాలు.. కొన్ని చోట్ల మితిమీరిన మెలో డ్రామాతో ఏ దశలోనూ ఎంగేజ్ చేయలేకపోయిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ప్రేక్షకులకు శిరోభారంగానే మిగులుతుంది.

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’.. అనే సినిమా గురించి ప్రేక్షకులకు తెలియడానికి, దీని గురించి చర్చ జరగడానికి కారణం.. నీలి నీలి ఆకాశం పాటనే. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ఎంత పాపులరైందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ పాటంత బాగా ఉంటుందీ సినిమా అంటూ చిత్ర బృందం ప్రచారం చేసుకుంది. సినిమా ఆరంభంలోనే ఆ పాట రావడంతో ప్రేక్షకులకు ఒక హై వస్తుంది. కానీ సినిమాలో ‘ది బెస్ట్’ అనదగ్గది ఈ పాట మాత్రమే అన్నట్లుగా ముందే దీన్ని ప్లేస్ చేసినట్లున్నారు. తొలి పావు గంటలో ఈ పాటతో పాటు ఫ్లాష్ బ్యాక్ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తుంది కానీ.. ఆ తర్వాత వర్తమానంలోకి వచ్చాకే ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ విసిగించడం మొదలవుతుంది. కాలేజీ సన్నివేశాలు ప్రేక్షకులను చాలా ఏళ్లు వెనక్కి తీసుకెళ్తాయి. సిల్లీ జోకులతో సాగే ఈ తరహా కాలేజీ సీన్లు పదేళ్ల కిందటే మొహం మొత్తేశాయి. హీరో ప్రదీప్ తన వంతుగా కొంచెం చలాకీగా నటించి కామెడీ పండించే ప్రయత్నం చేసినా.. సన్నివేశాల్లో బలం లేకపోవడంతో కాలేజీ ఎపిసోడ్లన్నీ తేలిపోయాయి. ఇక ఇంటర్వెల్ దగ్గర కథలో ట్విస్టుతో మళ్లీ కొంత ఆసక్తి పుడుతుంది. శుభలేఖ సుధాకర్ పాత్ర, దేవత మహిమ తాలూకు సెటప్ అంతా కూడా కృత్రిమంగా అనిపించినప్పటికీ.. కథలో మలుపు ద్వితీయార్ధం ఆసక్తి రేకెత్తిస్తుంది.

ఇంటర్వెల్ మలుపు తర్వాత వచ్చే సన్నివేశాలపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తికి తగ్గట్లు ద్వితీయార్ధం నడవదు. ఈ సన్నివేశాలను కొంచెం సటిల్ గా డీల్ చేసి ఉంటే మంచి వినోదం పండేదే. కానీ దర్శకుడు లౌడ్ నరేషన్ తో.. అవసరం లేని హడావుడితో ఆ సన్నివేశాలను గోల గోలగా మార్చేశాడు. హైపర్ ఆదిని తీసుకొచ్చి చేయించిన సన్నివేశాలతో సినిమా స్థాయి ఇంకా పడిపోతుంది. హీరో హీరోయిన్ల సమస్య తీరిపోవడానికి ఏం జరగాలన్నది పెద్ద ట్విస్టు లాగా చివరి వరకు దాచి ఉంచినా.. మధ్యలో కథ నడిచే తీరుతో ఆ విషయం ముందే ప్రేక్షకులకు అర్థమైపోతుంది. హీరో హీరోయిన్లు ఒకరి వైపు ఒకరు టర్న్ అయ్యే సన్నివేశాలు రొటీన్ గా అనిపిస్తాయి. లీడ్ పెయిర్ మధ్య ముందు విపరీతమైన గొడవ.. ఆ తర్వాత వాళ్లు ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులయ్యే క్రమం.. ‘ఆనందం’ సినిమాను గుర్తుకు తెస్తుంది. కానీ అందులో మాదిరి ఇక్కడ ఏ దశలోనూ వారి మధ్య ప్రేమ భావనలే కనిపించవు. ప్రేక్షకులు కూడా దాన్ని ఫీలవరు. ఒక ప్రేమకథ చూస్తున్నామన్న భావనే ప్రేక్షకులకు కలగకపోవడం ‘30 రోజుల్లో..’ ఉన్న ప్రధాన బలహీనత. లీడ్ క్యారెక్టర్ల మధ్య సరైన కెమిస్ట్రీ కనిపించదు. అలాగే ఆ పాత్రలతో ప్రేక్షకులకు కనెక్షనూ ఏర్పడదు. ముగింపులో కూడా మెరుపులేమీ లేకపోవడంతో ‘30 రోజుల్లో..’ ప్రేక్షకులకు ఎలాంటి ప్రత్యేక అనుభూతీ కలిగించదు.

నటీనటులు:

హీరోగా తన అరంగేట్రానికి ప్రదీప్ మాచిరాజు కొంచెం భిన్నమైన కథనే ఎంచుకోవడం అభినందనీయమే. తన వంతుగా అతను బాగానే పెర్ఫామ్ చేశాడు. ముఖ్యంగా కామెడీ సీన్లలో తన చలాకీ తనం చూపించాడు. ఎమోషనల్ సీన్లలో పర్వాలేదనిపించాడు. కానీ అతణ్ని దర్శకుడే సరిగా ఉపయోగించుకోలేదు. అతడి వాక్చాతుర్యానికి, కామెడీ టైమింగ్ కు తగ్గ సన్నివేశాలు రాయలేదు. హీరోయిన్ అమృత అయ్యర్ బాగా చేసింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె ప్రదీప్ ను డామినేట్ చేసింది. కానీ గ్లామర్ పరంగా అమృతకు యావరేజ్ మార్కులు పడతాయి. శుభలేఖ సుధాకర్ కథను మలుపు తిప్పే పాత్ర చేశాడు కానీ.. ఆయన పాత్ర, నటన కృత్రిమంగా అనిపిస్తాయి. వైవా హర్ష.. భ్రదమ్ ఆశించిన స్థాయిలో నవ్వించలేకపోయారు. పోసాని తండ్రి పాత్రలో తనకు అలవాటైన రీతిలో నటించాడు. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం:

అనూప్ రూబెన్స్ సినిమాను నిలబెట్టడానికి తన వంతుగా మంచి ప్రయత్నమే చేశాడు. ‘నీలి నీలి ఆకాశం..’ వినసొంపుగానే కాక కనువిందుగానూ అనిపిస్తుంది. ఇదేరా స్నేహం.. నీకో దండం పాటలు కూడా ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం కూడా ఓకే. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం ఫ్లాష్ బ్యాక్ నడిచే తొలి పావు గంటలో ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత మామూలుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి. కొత్త దర్శకుడు మున్నా ఏ రకంగానూ మెప్పించలేకపోయాడు. కాన్సెప్ట్ కొత్తగా అనిపించినా.. అది హాలీవుడ్ సినిమా నుంచి తీసుకున్నది. మంచి కథనం జోడించి నేర్పుగా తీయాల్సిన ఆ కాన్సెప్ట్ ను కంగాళీ చేసేశాడనిపిస్తుంది. అతడి నరేషన్ స్టైల్ ఆకట్టుకోదు. కామెడీ అయినా.. మెలో డ్రామా అయినా ‘అతి’గా అనిపిస్తాయి.

చివరగా: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. గోల గోల!

రేటింగ్-2/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News