పండుగ రోజున 'ఆ అమ్మాయి' ముచ్చట్లు వినాల్సిందే!

Update: 2022-08-31 01:30 GMT
సుధీర్ బాబు - కృతి శెట్టి జంటగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ - బెంచ్ మార్క్ స్టూడియోస్ వారు నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముస్తాబైంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలతో ఇంద్రగంటి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాడు. సెప్టెంబర్ 16వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో థియేటర్లలో దింపేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్  వేగం పెంచారు. అందులో భాగంగా 'వినాయక చవితి' స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఉంది. అందుకు సంబంధించిన 'ప్రోమో' రన్ అవుతోంది. ఇంద్రగంటి ... సుధీర్ బాబు .. కృతి శెట్టి వినాయకుడిని పూజించి, ఆ తరువాత ఇంటర్వ్యూలో పాల్గొన్నట్టుగా చూపించారు. పూజకి సంబంధించిన అలంకరణతో .. సంప్రదాయబద్ధమైన వస్త్రాలతో .. వినాయకుడికి ఇష్టమైన పిండివంటలతో పండుగ వాతావరణాన్ని తీసుకుని రావడంలో సక్సెస్ అయ్యారు.

ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ, యాంకర్ గా  ఈ కార్యక్రమాన్ని నడిపించడం విశేషం. అనసూయ వలన ఈ కార్యక్రమానికి మరింత నిండుదనం .. పండుగదనం వచ్చాయి. చూడటానికి ఫ్రేమ్ చాలా కలర్ ఫుల్ గా కనిపించింది. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' కథకు ఎలా బీజం పడింది? ... ఆ కథకి సుధీర్ బాబు - కృతి శెట్టి ఎలా కుదిరారు? అనే విషయం మొదలు అనేక అంశాలను ఇంద్రగంటి ఈ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా కనిపిస్తోంది.

ఈ సినిమాలో సుధీర్ బాబు దర్శకుడి పాత్రలో  కనిపిస్తే, కృతిశెట్టి డాక్టర్ గా కనిపిస్తుంది. రియల్ లైఫ్ లోను తాను డాక్టర్ కావాలనుకున్నాననీ, అలాంటి తనకి డాక్టర్ గా నటించే ఛాన్స్ రావడం ఆనందాన్ని కలిగించిందని కృతి శెట్టి చెప్పుకొచ్చింది. చాలా మితంగా మాట్లాడే ఇంద్రగంటి ఈ సినిమాలోని 'కొత్త్త కొత్తగా' పాటను హమ్ చేయడం కొత్తగా అనిపిస్తుంది.  

పూర్తి ఇంటర్వ్యూ 'వినాయకచవితి' స్పెషల్ గా మధ్యాహ్నం 12:06 నిమిషాలకి పలకరించనుంది. శ్రీనివాస్ అవసరాల ... వెన్నెల కిశోర్ .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.   
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News