అమీర్ ఖాన్ అంతటి దేశభక్తుడా..?

Update: 2017-04-07 06:31 GMT
బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఎవరి సినిమాలైనా పాకిస్థాన్లో భారీగా రిలీజ్ చేస్తుంటారు. అక్కడ వసూళ్లు కూడా భారీగానే ఉంటాయి. అమీర్ ఖాన్ సినిమాలన్నా అక్కడి జనాలు బాగా ఆసక్తి చూపిస్తారు. ఐతే గత ఏడాది భారత్-పాకిస్థాన్ సంబంధాలు బాగా దెబ్బ తినడం.. సరిహద్దుల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పాక్ నటులు భారతీయ సినిమాల్లో నటించకుండా ఇక్కడ నిషేధం పడితే.. పాకిస్థాన్లో ఇండియన్ సినిమాలు రిలీజవ్వకుండా వాళ్లు బ్యాన్ వేశారు. ఐతే ఈ మధ్యే పాకిస్థాన్లో ఇండియన్ సినిమాలపై నిషేధం ఎత్తేశారు. దీంతో అమీర్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘దంగల్’ను అక్కడ రిలీజ్ చేయడానికి మార్గం సుగమమైంది.

కాకపోతే ‘దంగల్’లోని ఓ సన్నివేశం విషయంలో చిక్కొచ్చి పడింది. అందులో ఒక చోట హీరోయిన్ పోటీలో గెలిచాక భారత జాతీయ గీతం వినిపిస్తుంది. పాకిస్థాన్ థియేటర్లలో భారత జాతీయ గీతం వినిపిస్తే బాగోదు కనుక దాన్ని ఎడిట్ చేయాలని అంటుండగా.. అమీర్ ఖాన్ అందుకు ఒప్పుకోవట్లేదట. సినిమా పాకిస్థాన్లో విడుదల కాకపోయినా పర్వాలేదు ఆ సీన్ మాత్రం అలాగే ఉండాల్సిందే అని అమీర్ ఖాన్ పట్టుబడుతున్నట్లు సమాచారం. దీనిపై నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో అమీర్ ఖాన్ లో ఇంత దేశభక్తి ఉందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. గత ఏడాది మత అసహనం మీద చేసిన వ్యాఖ్యలతో అమీర్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. అప్పట్నుంచి దిద్దుబాటు చర్యల్లో తలమునకలై ఉన్నాడు అమీర్. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తూ మోడీకి మద్దతు పలికిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. ఐతే ఇప్పుడు ‘దంగల్’ సినిమా విషయంలో అమీర్ వైఖరే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ నిర్ణయం వల్ల కోట్లు పోయే పరిస్థితి ఉన్నా అమీర్ రాజీ పడట్లేదంటే అభినందనీయమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News