అమీర్ సినిమాపై ‘బాహుబలి’ ఎఫెక్ట్?

Update: 2017-05-09 07:15 GMT
అమీర్ ఖాన్ సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలవ్వాల్సిందే. కొత్త రికార్డులు నమోదవ్వాల్సిందే. అమీర్ నెలకొల్పిన రికార్డులు మళ్లీ అమీరే వచ్చి బద్దలు కొట్టాలి. గత దశాబ్ద కాలం నుంచి ఇండియన్ సినిమాలో నడుస్తున్న ఆనవాయితీ ఇది. త్రీ ఇడియట్స్.. ధూమ్-3.. పీకే.. దంగల్.. ఇలా ఎప్పటికప్పుడు తన కొత్త సినిమాతో రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు అమీర్. ‘పీకే’ సినిమాతో దాదాపు రూ.800 కోట్ల వసూళ్లు రాబట్టిన అమీర్.. రూ.1000 కోట్ల వసూళ్లు మైలురాయిని కూడా అందుకుంటాడని.. అతడికే ఆ రికార్డు సాధ్యమని అంతా అనుకుంటూ వచ్చారు. కానీ ఈ ఘనతను ‘బాహుబలి’ సినిమా సొంతం చేసుకుంది. ఈ సినిమా అసాధారణ వసూళ్లతో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది.

ఇన్నాళ్లూ తనతో తనే పోటీ పడుతూ వచ్చిన అమీర్.. ఇప్పుడు ‘బాహుబలి’ని ఢీకొట్టాలి. ఈ నేపథ్యంలో అమీర్ కొత్త సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందన్నది ఆసక్తికరం. అమీర్ కు అమితాబ్ కూడా తోడవుతుండటం.. ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు కూడా నటిస్తుండటంతో ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ అంచనాలకు తగ్గట్లుగా ఉంటే వసూళ్లు అసాధారణంగానే ఉంటాయని భావిస్తున్నారు. ఐతే ఈ సినిమా స్క్రిప్టుకు ఇప్పుడు కొన్ని మార్పులు జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘బాహుబలి-2’ విడుదల తర్వాత ఈ సినిమా ఆషామాషీగా ఉంటే కుదరదని.. యశ్ రాజ్ ఫిలిమ్స్ టీం మరింత మెరుగ్గా స్క్రిప్టును తీర్చి దిద్దే పనిలో పడిందట. దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య రచయితల బృందంతో కలిసి మళ్లీ పని చేస్తున్నాడట. లాక్ అయిన స్క్రిప్టుకు మార్పులు చేస్తున్నారట. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో బాహుబలి-2 కంటే భారీ స్థాయిలో రిలీజ్ చేయాలన్న ఆలోచనతో ఉంది యశ్ రాజ్ ఫిలిమ్స్. కేవలం ఇండియన్ మార్కెట్ మీదే దృష్టిపెడితే.. ‘బాహుబలి-2’ను దాటడం కష్టమని.. అందుకే హాలీవుడ్ సినిమాల స్థాయిలో అంతర్జాతీయంగా భారీ స్థాయిలో వసూలు చేస్తే తప్ప వసూళ్లలో కొత్త శిఖరాల్ని అందుకోవడం సాధ్యం కాదని భావిస్తోంది యశ్ రాజ్ ఫిలిమ్స్. మరి ఈ మార్పులు సినిమాకు ఎంత మేర కలిసొస్తాయో.. ఈ సినిమా ఎంత వసూళ్లు రాబడుతుందో చూడాలి.
Tags:    

Similar News