స్మాల్‌ బీ కి మరో దారుణ అవమానం

Update: 2018-09-27 12:40 GMT
బాలీవుడ్‌ బిగ్‌ బి అమితా బచ్చన్‌ తనయుడు - అందాల రాశి - బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ భర్త అయిన అభిషేక్‌ బచ్చన్‌ పదే పదే సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ ను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఈయన నటన మరియు సినిమాల విషయంలో ఎన్నో సార్లు ఎన్నో రకాల విమర్శలను ఎదుర్కొన్న విషయం తెల్సిందే. కెరీర్‌ ఆరంభంలో కాస్త పర్వాలేదు అనిపించిన అభిషేక్‌ బచ్చన్‌ గత కొన్ని సంవత్సరాలుగా సక్సెస్‌ మొహం చూడలేదు. దాంతో ఈయన సినిమాలకు గుడ్‌ బై చెప్పడం మంచిదంటూ కొందరు - తండ్రి - భార్య సంపాదిస్తుంటే విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తున్నాడు అంటూ ఇంకొందరు ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్‌ చేస్తూనే ఉన్నారు.

ఇటీవల అభిషేక్‌ బచ్చన్‌ నటించిన ‘మన్మర్జియా’ చిత్రం విడుదల అయ్యింది. తాప్సి హీరోయిన్‌గా నటించిన ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటం జరిగింది. దాంతో సోషల్‌ మీడియాలో మరోసారి అభిషేక్‌ బలైపోయాడు. ‘మన్మర్జియా’ సినిమాపై ఒక డాక్టర్‌ చాలా ఘాటుగా కామెంట్‌ చేశాడు. ఎంత మంచి సినిమా అయినా కూడా, ఎంత మంచి కథ ఉన్నా కూడా అందులో అభిషేక్‌ నటిస్తే మాత్రం ఫ్లాప్‌ అవ్వడం ఖాయం. సినిమాలను ఫ్లాప్‌ చేసే టాలెంట్‌ కేవలం అభిషేక్‌ కు మాత్రమే ఉందని సదరు నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. సినిమా ఇండస్ట్రీలో ఇకపై వారసులకు స్థానం లేదు అంటూ ఈ చిత్రం ఫలితంతో తేలిపోయిందని, ఇక అభిషేక్‌ బచ్చన్‌ వడా పావ్‌ వ్యాపారం చేసుకోవాలని కూడా ఆయన కామెంట్‌ లో పేర్కొన్నాడు.

సదరు వ్యక్తి చేసిన కామెంట్‌ కు అభిషేక్‌ బచ్చన్‌ స్పందించాడు. మీరు బాక్సాఫీస్‌ లెక్కలు - నిజా నిజాలు బాగా తెలుసుకుని మాట్లాడాలని సూచించాడు. స్టార్‌ కిడ్స్‌ చేస్తున్న సినిమాలు ఫ్లాప్‌ అవుతున్నాయి అంటూ మీరు చేసిన కామెంట్‌ తో ఏకీభవించను అన్నాడు. వడా పావ్‌ వ్యాపారం గౌరవప్రధమైన వ్యాపారమే అని, దాన్ని అంత చులకనగా చూడాల్సిన అవసరం లేదు అంటూ సమాధానం ఇచ్చాడు. మొత్తానికి గత కొన్నాళ్లుగా అభిషేక్‌ బచ్చన్‌ బాక్సాఫీస్‌ వద్ద పరువు పోగొట్టుకోవడంతో పాటు - సోషల్‌ మీడియాలో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అందుకే ఈయన గౌరవ ప్రధంగా సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలు చేసుకోవడం ఉత్తమం అంటూ సన్నిహితులు సలహాలు ఇస్తున్నారు.

Tags:    

Similar News