అమెరికాలో 'ఆచార్య' వసూళ్ళు అంత తక్కువా..?

Update: 2022-04-30 09:31 GMT
మెగాస్టార్ సినిమా వస్తుందంటే టాలీవుడ్ లో హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది తనయుడు మెగా పవర్ స్టార్ తో కలిసి వస్తున్నాడంటే.. ఇంక ఆ సందడి ఎలా ఉండాలి?. 'ఆచార్య' సినిమా విడుదలకు ముందు అందరూ ఇలానే అనుకున్నారు. అయితే రిలీజ్ తర్వాత పరిస్థితి దీనికి భిన్నంగా కనిపిస్తోంది.

చిరంజీవి - రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ''ఆచార్య''. భారీ అంచనాల నడుమ నిన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబడింది. అయితే మొదటి రోజే ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. రివ్యూలు కూడా యావరేజ్ గానే వచ్చాయి.

అయితే మెగాస్టార్ సినిమా అంటే రివ్యూలతో సంబంధం లేకుండా టిక్కెట్లు తెగుతుంటాయి. కలెక్షన్స్ పోస్టర్స్ తో సోషల్ మీడియా అంతా సందడి సందడిగా ఉంటుంది. ఇతర హీరోల అభిమానులతో మెగా ఫ్యాన్స్ నెట్టింట చేసే రచ్చ మామూలుగా ఉండదు. కానీ 'ఆచార్య' విషయంలో అలా ఏదీ జరగలేదు.

తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. ఓవర్ సీస్ లో కూడా ఫస్ట్ డే 'ఆచార్య' ప్రభావం ఎక్కడా కనిపించలేదు. యూఎస్ లో ప్రీమియర్ షోలు ప్రారంభం కాకముందే అడ్వాన్స్ సేల్స్ $600k రేంజ్ లో ఉండటంతో.. మొదటి రోజు ప్రీమియర్ షోలతో సహా ఒకటిన్నర మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేస్తుందని అంచనా వేశారు.

అయితే 'ఆచార్య' చిత్రానికి ప్రీమియర్స్ నుంచి నెగెటివ్ టాక్ రావడం.. రివ్యూలు ఆశాజనకంగా లేకపోవడంతో అంతా మారిపోయింది. నార్త్ అమెరికాలో చాలా మంది ప్రేక్షకులు తాము బుక్ చేసుకున్న టిక్కెట్లను రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. దీంతో ఓపెనింగ్ డే ఫిగర్స్ $160k - $200 మధ్య ఉంటాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మెగా తండ్రీకొడుకులు నటించిన మూవీకి ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. శని, ఆదివారాలు సహకరిస్తే.. ఓపెనింగ్ వీకెండ్ లో 'ఆచార్య' కు ఓ మోస్తరు వసూళ్ళు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఈ సినిమా లాంగ్ రన్ లో ఒకటిన్నర మిలియన్ డాలర్ల లోపే కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

యూఎస్ఏలో కొరటాల శివ డైరెక్ట్ చేసే సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. 'శ్రీమంతుడు' సినిమా 2.8 మిలియన్ డాలర్లు వసూలు చేస్తే.. 'భరత్ అనే నేను' అక్కడ 3.4 మిలియన్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇక RRR సినిమాతో రామ్ చరణ్ US లో భారీ వసూళ్లు అందుకున్నారు. కానీ ఇక్కడ 'ఆచార్య' సినిమాకు ఏకగ్రీవంగా నెగిటివ్ టాక్ వచ్చింది. రాబోయే రోజుల్లో ఏదో మ్యూజిక్ జరుగుతుందని ఊహించడం అత్యాశే అవుతుందేమో.
Tags:    

Similar News