'ఆచార్య' కాపీ ఆరోపణల్లో నిజమెంత...?

Update: 2020-08-29 02:30 GMT
మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ''ఆచార్య''. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పై నిరంజన్ రెడ్డి - కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన 'ఆచార్య' మూవీ టైటిల్ మోషన్ పోస్టర్‌ విశేషంగా ఆకట్టుకుంది. అయితే రాజేష్ మండూరి అనే వర్థమాన రచయిత ఈ సినిమా స్టోరీ తనదే అని మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై 'ఆచార్య' ప్రొడ్యూసర్స్ మరియు దర్శకుడు కొరటాల శివ స్పందించారు. 'ఆచార్య' స్టోరీ కాపీ ఆరోపణలపై ఓ మీడియా ఛానల్ లో జరుగుతున్న లైవ్ డిబేట్ లో రాజేష్ మండూరితో పాటు కొరటాల శివ కూడా మాట్లాడారు.

కొరటాల శివ 'ఆచార్య' ఎవరి స్టోరీ కాదని.. ఇది తాను సొంతంగా రాసుకున్న కథ అని తెలిపారు. ఇదే విషయంపై కొరటాల శివకు రాజేష్ కి వాదోపవాదాలు జరిగాయి. నిజ జీవిత కథల ఆధారంగా దేవాలయాల భూములపై నేను రాసుకున్న కథను కొరటాల తీస్తున్నారని రాజేష్ ఆరోపిస్తున్నారు. ఒక వేళ ఇది నా కథ కాకపోతే నేను క్షమాపణ చెప్తా.. కానీ ఇది నా కథే అనడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని రాజేష్ అన్నాడు. దానికి కొరటాల శివ వివరణ ఇస్తూ 'మీరు రాసుకున్న కథ వేరు.. నా కథ వేరు. సోషల్ ఇష్యూస్ పై ఎవరికి తోచిన విధంగా వారు కథలు రాసుకుంటూ ఉంటారు. షూటింగ్ దశలో ఉన్న సినిమా స్టోరీ నేను ఎలా చెప్పగలను. ఆరోపణలు చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను కథలు వినిపించుకుంటూ పోవాలా..?' అని కొరటాల శివ అన్నారు. అయితే దీనికి రాజేష్.. 'నేను కో డైరెక్టర్ ద్వారా కథ తెలుసుకొని నేను మాట్లాడుతున్నా.. నా దగ్గర కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి.. ఇది నా కథే.. మీకు తెలియకుండానే నా కథని తీస్తున్నారు' అని అన్నారు. దాంతో కొరటాల శివ ఒకింత అసహనానికి కోపానికి గురయ్యాడు.

'నా కో-డైరెక్ట‌ర్ తో నేను మాట్లాడాను. ఆయ‌న ఈ క‌థ గురించి ఎవ‌రికీ ఏం చెప్ప‌లేద‌న్నారు. అయినా నా మనుషులు నా గురించో.. నా సినిమా గురించో త‌ప్పుగా ఎందుకు మాట్లాడ‌తారు?' అని కొరటాల అన్నారు. అదే సమయంలో కాల్ రికార్డ్స్ ని ఇవ్వమని రాజేష్ ని అడుగగా.. 'తన దగ్గర ఇప్పుడు లేవని.. ఏ విధంగా వాటిని తెచ్చుకోవాలో చెప్తే నేను తెచ్చి ఇస్తానని' అన్నారు. 'రాజేష్ గారి క‌థకీ నాకూ సంబంధం లేదు. ఆయ‌న ఆ క‌థ‌తో ఆయన సినిమా తీసుకోవొచ్చు. నా సినిమా కంటే ముందు రిలీజ్ చేసుకోవొచ్చు. కావాలంటే మీడియా ముఖంగా సంత‌కం చేసి ఇస్తా. ఇంత‌కంటే ఏం చేయ‌గ‌ల‌ను? ఈ ఇష్యూని చిరంజీవిగారి ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లాల‌న్న‌ది రాజేష్ ప్ర‌య‌త్నం కావొచ్చు. నేను మీడియా ముందుకు వ‌చ్చాను కాబ‌ట్టి దీని గురించి చిరంజీవిగారికి తెలిసిపోతుంది. తెలియ‌క‌పోయినా నేనే చెప్తా' అని కొరటాల అన్నారు.

అయితే 'ఆచార్య' సినిమా కథ అతను చెప్పే కథ కాదని ఎంత చెప్పినా వినకపోవడంతో కొరటాల శివ.. అవసరమైతే ఈ విషయం పై కోర్టుకు వెళ్తానని అన్నారు. ఇద్దరి మధ్య సంభాషణలు చూసిన వారు రాజేష్ సరైన ప్రూఫ్స్ లేకుండా ఆరోపణలు చేస్తున్నారని.. సోషల్ మీడియాలో 'ఆచార్య' స్టోరీ ఇదేనంటూ వచ్చే వార్తలను బట్టి ఈ కథ తనదే అంటున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. కొరటాల మాత్రం మీడియా ముఖంగా ఈ కథ నాదే అని గట్టిగా చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా.. లేదా 'ఆచార్య' సినిమా రిలీజయ్యే వరకు ఈ వివాదం ఇలానే కొనసాగుతుందా అనేది చూడాలి.
Tags:    

Similar News